Oct 06,2023 09:54

న్యూయార్క్‌: ఎట్టకేలకు డొనాల్డ్‌ ట్రంప్‌ను నోర్మూసుకోమని ఓ కోర్టు జడ్డి ఆదేశించారు. ట్రంప్‌పై వచ్చిన మోసం అభియోగాలను విచారిస్తున్న న్యూయార్క్‌ స్టేట్‌ కోర్టు న్యాయమూర్తి ఆర్డర్‌ ఎంగోరాన్‌ అమెరికా మాజీ అధ్యక్షుడి నోటి దురుసుతనంపై ఫైర్‌ ఆయ్యారు. కోర్టు సిబ్బంది సభ్యులపై వ్యక్తిగత దాడులు ఎంతమాత్రం సహించేది లేదని అన్నారు. ట్రంప్‌ అంతకుముందు కోర్టు క్లర్క్‌ అల్లిసన్‌ గ్రీన్‌ఫీల్డును 'గర్ల్‌ ఫ్రెండ్‌' అని ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేశాడు. దీనిపై సీరియస్‌ అయిన న్యాయమూర్తి ట్రంప్‌ తరపు న్యాయవాదులనుద్దేశించి, 'ఇలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేసినందుకు జరిమానా, 30 రోజుల పాటు జైలు శిక్ష విధించవచ్చు. ఆయన (ట్రంప్‌) నోర్మూసుకుంటారా? లేక జైలుకు వెళ్తారా? చెప్పండి' అని మందలించారు. కోర్టు వెలుపల పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి కేసును పక్కదారి పట్టించే చర్యలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కావని న్యాయమూర్తి పేర్కొన్నారు.