Aug 07,2021 15:22

వాషింగ్టన్‌ : మనిషి దంతాలను పోలిన దంతాలతో విభిన్నమైన చేప ఒకటి అమెరికాలోని నార్త్‌కరోలినాలో ఒక మత్సకారుడికి చిక్కింది. జెన్నెట్స్‌ పైర్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఈ వింత ఆకారపు చేప ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోపై పలువురు స్పందించారు. ఇటువంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదని జీన్‌ క్లౌడ్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పేర్కొనగా, నా దంతాల కంటే ఆ చేప దంతాలే అందంగా ఉన్నాయంటూ మరో వ్యక్తి ట్వీట్‌ చేశారు. ఈ చేప నోటిలో మనిషిని పోలినట్లు పై దవడ, కింది దవడల్లో దంతాలతో పాటు నోటికి చిక్కిన ఎరను పట్టి నమిలేందుకు వీలుగా పక్క దంతాలను కూడా కలిగి ఉంది. ఈ చేప నోరు గొర్రె తలను పోలి వుండటంతో 'షీప్‌షేప్డ్‌ ఫిష్‌' గా పేర్కొంటారని స్థానికులు తెలిపారు. అయితే దంతాలు ఉండటం ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ఇటువంటి చేపలు ఎక్కువగా కనిపిస్తుంటాయని, పదునైన వెన్నెముకను కలిగి ఉంటాయని, సాధారణంగా 10-20 అంగుళాల పొడవు పెరుగుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఇవి నీటి మొక్కలతో పాటు చిన్న చిన్న జీవులను తింటాయని అన్నారు. ఈ వారం ప్రారంభంలో ఈ ఫొటోను అప్‌లోడ్‌ చేయగా.. సుమారు 300 మందికి పైగా షేర్‌ చేయబడింది.