
(గత వారం తరువాయి)
అలజడి.
'నా సంగతి సరే! మీ సంగతి ఏంటి?' అని అడిగింది.
'నేనా?! మాది ఆంధ్రా. అమ్మానాన్న, తమ్ముడు, చెల్లి, నేను. చదువుకుంటున్నాం. చదవడానికి చదువు, తినడానికి ఈ పని, పైగా కొత్త ప్రదేశాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ పని ఎంచుకున్నా. నాకు సెట్ అయ్యింది' అన్నాను.
'చాలా బాగుంది' నవ్వింది.
'మళ్లీ ఎప్పుడు మీ తిరుగు ప్రయాణం?'
'రేపు సాయంత్రం ఆరు గంటలకు'
'మళ్లీ ఎప్పుడొస్తారు ఇక్కడకు?'
'వస్తా! సమయం వచ్చినప్పుడు?'
'సమయం అంటే?'
'రావాలనుకున్నప్పుడు'
'ఏదో ఒక సమయాన, ఏదో ఒక రోజున వస్తా, కానీ నాకు ఇక్కడ పరిచయస్తులు ఎవరూ లేరు కదా?'.
తాను చిరు కోపంతో 'ఎవరూ లేరా? నేనున్నాగా' అంది కొంచెం అమాయకంగా.
'అయితే కచ్చితంగా వస్తా, కనీసం నిన్ను చూడటానికైనా' కొంచెం తెలివిగా జవాబిచ్చాను.
'ఇక్కడ నేను అనేదాన్ని ఉన్నానని ఎప్పటికీ మరచిపోకు' అంది.
ఇద్దరి నవ్వులు.. పెద్దగా..
ఒక రాయి మీద కూర్చొని, చాలాసేపు మాట్లాడుకున్నాం.
తాను మాట్లాడుతున్నంతసేపు, నా కెమెరాతో ఏదో ఒక అపురూప దృశ్యాన్ని బంధిస్తూనే ఉన్నా.
'ఇంకా?' ఏదో మాట్లాడాలన్న ఆశతో అడిగాను.
'ఇంతే సంగతులు. సరే, ఇంటి దగ్గర నా కోసం మా వాళ్లు ఎదురుచూస్తూ ఉంటారు! రేపు కలుద్దాం' అంది.
'రేపు మనం కలవడానికి కుదరకపోవచ్చు' అన్నాను.
'ఏం?' ఆతృతగా అడిగింది.
'రేపు నేను వెళ్లిపోతున్నా కదా! సర్దుకోవాలి. ఒకవేళ కలవాలి అంటే బస్ కాంప్లెక్స్‌లోనే.. వస్తే త్వరగా వచ్చేయ్యి' అన్నాను.
తన జవాబు కోసం చూడకుండా, చనువుగా 'రేపు నీ కోసం ఎదురుచూస్తా!' అన్నాను.
'అయితే నువ్వు వెళ్లే ముందు మనం కలుస్తున్నాం, కలిసి తీరతాం' అని నవ్వుతూ ఒక ప్రేమపూరితమైన శపథం చేసింది.
తర్వాత రోజు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నా. వెళ్లేటప్పుడు సయాలికి ఏదైనా ఇవ్వాలని అనిపించింది. 'ఇచ్చిన మనసు చాలదా' అని మనసులో ఒక ప్రకంపన. నాలో నేను నవ్వుకుంటూ, ఊహల్లో తెలియాడుతూ నిద్రలోకి జారుకున్నా.
***
ఆ రోజు సాయంత్రం.. నాకు వీడ్కోలు పలకడానికి సయాలి నాకంటే ముందే అక్కడకి చేరింది. మేము కలిసే ప్రతిసారి నేనే ముందు వెళ్లాలని అనుకుంటా.. కానీ తనే నాకంటే ముందుండేది. ఒకరిని ఒకరు చూసుకొని ఇద్దరం నవ్వులు పంచుకున్నాం.
'హారు! ఎప్పుడొచ్చావ్?' అడిగాను.
'నువ్వు రావడానికి ముందే' మళ్లీ నవ్వులు.
'సరే మళ్లీ ఎప్పుడు నీ రాక ఈ భూమికి, నా భూమికి?' అడిగింది.
నేను నవ్వుతూ.. 'వస్తా కచ్చితంగా.. ఈ ప్రకృతి కోసం, ఇక్కడ వదిలి వెళ్తున్న నా మనసు కోసం' అన్నాను.
'ఆహా.. ఎక్కడుందో నీ మనసు?' మళ్లీ నవ్వు.
'ఇక్కడే' భారమైన స్వరంతో అన్నాను.
కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆ మౌనంలో మా ఇద్దరి మనసులు ఊగిసలాడుతున్నాయి. ఒకదానికొకటి ముందుకు నెట్టుకుంటున్నాయి. ఈ లోపు బస్ వచ్చింది. కండక్టర్ అందరికీ వినబడేటట్టు 'అరగంట తర్వాత బస్ బయలుదేరుతుంది' అన్న పెద్దకేక వినిపించింది. ఒక్కసారిగా మా ఇద్దరి కళ్లలో ఆందోళన. నేలను చూస్తున్న మా తలలు నిలపాలని అనిపించలేదు. సయాలి భారమైన స్వరంతో 'ఇక్కడే ఉండొచ్చుగా!' అంది.
'హా! వినపడలేదు' అన్నాను.
'అదే.. ఇక్కడే ఉండొచ్చుగా' అంది.
'ఇదేంటి? ఎప్పుడు లేనిది' అన్నాను.
తన కళ్లు పెద్దవి చేస్తూ 'అవును, నువ్వు విన్నది నిజమే! ఇక్కడే ఇంకొన్నాళ్లు ఉండవచ్చుగా!' అంది.
దించిన తలని ఎత్తాలని అనిపించలేదు నాకు. 'మళ్ళీ వస్తా కదా! ఇప్పుడు వెళితేనే మళ్లీ రాగలను. ఏదేమైనా, కచ్చితంగా వస్తా నీ కోసం' అని నా మనసులో ప్రేమని తన ముందు పరిచేశాను.
సయాలి తలెత్తి, నా కళ్లలోకి చూస్తూ.. 'నేనూ నీతో వస్తా. నీ లోకానికి వచ్చేస్తా!' అని నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, గట్టిగా అదుముతూ మారాం చేసింది.
ఈలోపు బస్ డ్రైవర్ 'అందరూ రావాలి!' అంటూ గట్టిగా హారన్ కొడుతున్నాడు.
'సరే ఇక ఉంటాను. ఇదిగో మళ్లీ మనం కలిసేవరకూ నాకు గుర్తుగా ఒక చిన్న కానుక' అన్నాను. 'ఏంటిది?' అంది.
'నువ్వే తెరిచిచూడు' అన్నాను.
'ఓ! డైరీ' అంది.
'కాదు. మన ఇద్దరి మనసులా స్వచ్ఛమైన కాగితాలు. వీటిపై ఏం రాయాలనుకుంటావో రాసేయి. మన జ్ఞాపకాల నుండి, మన భవిష్యత్ వరకూ. ఈ సారి మనం కలిసినప్పుడు మనిద్దరం చదువుకోడానికి ఏదో ఒకటి ఉండాలి కదా!' ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నాం.
'నిజంగా ఈసారి మనం కలిస్తే, అదే చివరిసారి మనం కలిసేది వేరువేరుగా!' బాధతో కూడిన చిరునవ్వుతో అంది.
మళ్లీ బస్ హార్న్.
'కలుద్దాం' అంటూ గట్టిగా ఒకర్నొకరం హత్తుకొన్నాం.
'సరే ఇప్పటికే ఆలస్యం అయ్యింది సయాలి! ఫోన్ చేస్తూ ఉండు.. మర్చిపోకు' అని వదల్లేక వదల్లేక.. బస్ ఎక్కి కూర్చున్నా. సయాలి బాధతో మౌనంగా పలుకుతున్న వీడ్కోలుని బస్ అద్దం నుండి స్వీకరించా.
బస్ కదిలింది. చూపు అందిన వరకూ సయాలి చేయి ఊపుతూనే ఉంది. ఈలోగా బస్ మలుపు తిరిగింది.
***
డాక్యుమెంటరీ ప్రాజెక్టు తర్వాత ఇంటికి చేరిన నేను.. మళ్లీ యాంత్రిక జీవనంలోకి జారిపోయాను సయాలి ఆలోచన లేని క్షణం లేదు. నేను వచ్చిన మూడో రోజున సయాలి నుండి ఫోన్. రోజులో ఎంతో కొంతభాగం సయాలి నన్ను ఆక్రమిస్తుంది. ఈమధ్య తనకి ఒక ప్రాజెక్టు విషయంలో వేరే ప్రాంతానికి వెళ్తున్నానని ఫోన్ చేసి, చెప్పింది. చెప్తూ చెప్తూ, రోజు ఫోన్ చేయడానికి కుదరకపోవచ్చని, రాగానే ఫోన్ చేస్తానని, ఈ మధ్య నన్ను చాలా మిస్ అవుతున్నానని చెప్పింది.
రోజూ ఏదో ఒక సంధర్భంలో సయాలితో ఫోన్ మాట్లాడే నేను, తన ఫోన్ అందుబాటులో లేకపోవడంతో సయాలిని చాలా మిస్ అవుతున్నా అనే భావన వెంటాడేది. రోజూ ఇవన్నీ ఆలోచిస్తూ గాఢ నిద్రలోకి జారిపోవడం అలవాటుగా మారింది.
***
సరిగ్గా 37 రోజుల తర్వాత..
ముక్కూ ముఖం తెలియని మూడో వ్యక్తి సయాలి గురించి ఫోన్ చేయడం నా ఎదలో అలజడి రేపింది. అనుకున్నదే తడువుగా, తర్వాత రోజు పొద్దున్నే సయాలి దగ్గరకు ప్రయాణమయ్యాను.
నా ప్రయాణం మొత్తం 'సయాలికి ఏమీ జరిగి ఉండదు కదా?' అని ఎన్నెన్నో ప్రశ్నలు చుట్టుముట్టాయి. 'అయినా ఏమి జరగకపోతే ఫోన్ ఎందుకు చేయనట్టు?' అని మరో ప్రశ్న. 'తాను బిజీ అయ్యి ఉంటుందిలే! ఎంత బిజీ అయితే ఫోన్ కూడా చేయదా?' అని ఇలా నా మనసే, వాదోపవాదాలు జరుపుతూ పెద్ద ప్రశ్నల ఉప్పెన సృష్టించింది. చివరకు సయాలి నేల మీద కాలు మోపా! ఇంతకుముందు వచ్చినప్పుడు, చాలా ప్రశాంతంగా కనిపించిన ఈ ప్రాంతం.. ఈ సారి ఎందుకో, అందంగా అనిపించలేదు. నేరుగా ఫోన్ చేసిన నర్సుని కలిశా.. డైరీ అప్పగించింది. మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పి, డైరీని తెరిచి చూస్తే.. నేను, సయాలి కలిసి జీవించబోయే జీవితాన్ని రాసింది. ఆ రాతలు చదివాక, తనని చూడాలన్న ఆతృత మరింత ఎక్కువైంది.
***
గతంలో నేను సయాలి కలిసిన ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు, సయాలియే నాకు ఎదురొచ్చి, స్వాగతం పలికినట్టు అనిపించింది. ఆ ప్రాంతంలో అదే ప్రశాంతత, అదే చల్లనిగాలి. ఏమాత్రం మార్పు రాని ఆ ప్రాంతాన్ని చూడగానే, మనసుకి కొంత ప్రశాంతత దొరికినా, సయాలి విషయం వాకబు చేస్తూనే ఉంది నా మనసు. చివరికి సయాలి ఇంటిముందు నిలబడి 'ఎవరైనా ఉన్నారా?' అని పిలిచాను. ఎవరో పిల్లలు వచ్చి నన్ను చూసి, మళ్లీ ఇంట్లోకి పరిగెత్తారు.
ఒక పెద్దమనిషి ఘర్వాలి వస్త్రాల్లో వచ్చి, 'ఏం కావాలి సార్?' అని అడిగింది.
'ఇంతకుముందు ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది. నేను తన స్నేహితుడ్ని, ఆరోగ్యం బాగోలేదంటే చూడటానికి వచ్చా..!' అన్నాడు.
'ఇక్కడ ఏ అమ్మాయీ లేదు. తప్పు అడ్రస్‌కి వచ్చారేమో చూసుకోండి' అని లోపలకి వెళ్లిపోయింది.
'లేదు.. లేదు.. ఆ అమ్మాయిని సరిగ్గా ఈ ప్రాంతంలోనే కలిశాను.. నాకు బాగా గుర్తు!' అన్నాను.
'చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఏ అమ్మాయి ఉండేదీ కాదు అంటే అర్థం కావట్లేదా?' అని స్వరం పెంచింది.
'నా స్నేహితురాలి పేరు సయాలి. తాను ఇక్కడే ఉండేది. తాను పంపిన అడ్రస్ కూడా నా దగ్గర ఉంది.. కావాలంటే చూడండి!' అన్నాను.
'సార్, ఇవన్నీ నాకు అవసరం లేదు, ముందు వెళ్లిపోండి!' అంది.
'తను వచ్చేవరకూ ఇక్కడ నుండి కదలను' అని బీష్మించుకొని కూర్చున్న.
చివరకు మాట మాట పెరిగి ఆ పెద్దావిడ 'సయాలికి ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు?' అడిగింది కొంచెం గరుకు స్వరంతో.
'తానే ఫోన్ చేసి చెప్పింది.'
'ఎవరు సయాలియా?'
'అవును సయాలియే' అన్నాను.
'అబద్ధాలు చెప్పకండి. ఈ మధ్య సయాలి ఎవరికీ ఫోన్ చేయలేదు' అందావిడ.
'లేదు, నాకు ఫోన్ చేసింది. నన్ను చూడాలంటేనే.. నేను ఇంతదూరం వచ్చాను' అన్నాను.
'వద్దు సార్! మీరు సయాలిని చూడటానికి వీలులేదు' అందావిడ.
'ఎందుకని?'
'కొన్ని ప్రశ్నలకి జవాబులు ఉండవు' మీరు వచ్చినదారినే వెళితే మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాం..!' దండం పెడుతూ అందావిడ.
'లేదు, నేను సయాలిని చూడాలి. తనకి ఏమైంది?' అన్నా గట్టిగా.
'తనకి ఏమీకాలేదు. కాకపోతే ఈ మధ్య ఎవరినీ కలవడానికి ఇష్టపడట్లేదు' అందావిడ.
'నేను వచ్చానని చెబితే కచ్చితంగా నాకోసం వస్తుంది!' అని ఆ పెద్దావిడిని అభ్యర్థించా.
'అయ్యా మమ్మల్ని క్షమించండి. మీరు సయాలిని చూడాలనుకున్నా.. నేను పంపలేను!' అని దీనంగా చెప్పిందా ఆ పెద్దమనిషి.
'మీరు నాకెందుకు అభ్యంతరం చెపుతున్నారు? నన్ను వెళ్లనివ్వండి' అని ఆ పెద్దావిడని నెట్టుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాను.
'సయాలి ఇక్కడ లేదు' తన చేయి నాకు అడ్డుపెట్టి అందావిడ.
'అసలు ఏమైంది సయాలికి?' అని నిలదీశాను.
'ఏమి కాలేదు.. చివరిగా చెబుతున్నా, ఇక్కడ నుండి వెళ్లిపోండి' అని వేడుకుందావిడ.
ఇంతలో ఎవరో ఒక అమ్మాయి తలమీద వెంట్రుకలు లేకుండా వచ్చి, ఆ పెద్దావిడ వెనుక నిలబడింది.
ఆ తేజస్సు సయాలిది.. కానీ! రూపం సయాలిది కాదు. ఒక్క క్షణం ఆ పెద్దావిడ ఏదో చెబుతున్నా వినకుండా.. ఒక అడుగు ముందుకేసి, 'నువ్వు, సయాలివి కదూ?' అని అడిగా ఆతృతగా.
ఆ అమ్మాయి వైపు నుండి జవాబు రాకపోగా, నేనెవరో అన్నట్టు చూసింది. 'ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకే జుట్టు తీసి ఉండొచ్చు!' అని నాలో నేనే సముదాయించుకొన్నాను. ఆ అమ్మాయే సయాలి అని గుర్తించాను. 'నా మీద కోపం వచ్చి ఉండవచ్చు, అందుకే నామీద ఈ అలక అని!' నేనే మాట కలిపి 'ఇన్ని రోజులూ నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించా సయాలి, కానీ నన్ను క్షమించు, అర్థం చేసుకుంటావని చెప్తున్నా!' అని నా మట్టుకు నేను మాట్లాడుతుంటే.. తాను ఏమీ తెలియనట్టు తన దారిన తాను ఇంట్లోకి వెళ్లిపోయింది.
ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న ఆ పెద్దావిడ బోరున ఏడవటం నాకు వినిపించింది.
'ఏమైంది? సయాలి నన్ను చూసి ఎందుకు ముఖం చాటేసింది' అని ఆమెను అడగగానే..
ఆ పెద్దావిడ.. 'అందుకే నేను సయాలిని చూడొద్దని అడ్డుపడింది!' అని చెప్తూ, 'సుమారు రెండు నెలల క్రితం, వేరే ఊరు నుండి వచ్చిన సయాలి, ఎవరో స్నేహితులకి ఫోన్ చేయాలని రోడ్డు మీద నడుస్తున్నప్పడు జరిగిన ప్రమాదంలో, తన జ్ఞాపకశక్తిని కోల్పోయింది. అసలు ప్రాణమే మిగలదని అన్నారు. కానీ! చావుతో పోరాడి, చివరకు ఇలా ఇంటికి చేరింది!' అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ నేల అలికింది.
అది విన్న నాకు ఒక్కసారిగా ఈ లోకమే చీకటిగా అనిపించింది. నాతో పాటు జీవితం పంచుకోవాలని కన్న కలలు, ఆశలు, చివరికి అడియాశలుగానే మిగిలాయి.
'ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం.. కలిసి బతకాలని ఎంత ఆశ పడ్డాం..!' ఇవన్నీ తల్చుకుంటుంటే నా కంటి వెంట చీకటి కారింది.
సయాలిని మళ్లీ చూడాలనిపించి, లోపలికి వెళ్లా! సయాలి చిన్నపిల్లల బొమ్మలతో అడుకుంటుంది.
ఎవ్వరితో మాట్లాడట్లేదు.. ఆ నవ్వు లేదు, ఆ రూపం లేదు.. ఆ సోయాగానికే కొత్తందం తెచ్చిన ఆ కురులు లేవు. ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేసినా, సయాలి నోరు తెరవలేదు. సయాలి సృష్టించుకున్న ఆ లోకంలోకి నాకు ప్రవేశం లేదని స్పష్టమైంది. వెనక్కి నడుస్తూ.. 'నువ్వు నా సయాలివి కావు, కానే కావు, అందమైన నా సయాలి, ఇప్పుడు ఒక పసిపాప!' అని అనుకుంటూనే బయటకు వచ్చేశాను. కానీ, తన నుండి దూరంగా వెళ్లాలని అనిపించలేదు.
***
రోజు రోజుకు సయాలికి, నాకు దూరం పెరిగింది. కానీ తన మనసు నాలో ఒక భాగమైంది. ఎందుకంటే ఇప్పుడు సయాలి ప్రకృతిలో ఒకభాగం. తాను ఎంతగానో ప్రేమించే ఆ హిమాలయాలే తనకు రక్ష. ఆ పైన్, ఓక్ వృక్షాలే స్నేహితులు. రోజూ తన దగ్గరకు వెళ్లడం, దూరం నుండి చూడటం నాకు దినచర్యగా మారింది.
ఒకరోజు అర్ధరాత్రి..
మా ఆఫీసు నుండి ఫోన్. 'సెలవు పొడిగించేది లేదు.. తిరిగి వస్తేనే ఉద్యోగం, లేకపోతే..' అని చిన్న మౌనం. నా జీవితంలో ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. చివరికి ఉద్యోగమే నా జీవితం అని ప్రయాణానికి సిద్ధమైన రాత్రి!
సయాలి నా కలలో నవ్వుతూ, 'కచ్చితంగా వెళ్లాలా?' అని ప్రశ్నించింది.
నేను జవాబు ఇచ్చే లోపే, నా కల చెదిరిపోయింది.
ఆ రాత్రి కలలో కనిపించిన సయాలి అచ్చం ఇంతకుముందు చూసినట్లే ఉంది.
అదే నవ్వు, అదే అందం, అదే జుట్టు, అదే తేజస్సు.
సయాలికి వేరుగా నేను ఏర్పరచుకున్న లోకం నుండి నేను బయటకు రావాలని నా మనసు అనునిత్యం నాతో వాదిస్తుంది. కాలం మారుతూనే ఉంది, కాలంతో పాటు సయాలి కూడా. సయాలి ఇప్పుడు తనకు గుర్తు ఉన్న ప్రాంతాల్లో తచ్చాడుతూ ఉంది. పోయిన జుట్టు తిరిగి వస్తూ ఉంది. కొన్ని మార్పులు మినహా పాత సయాలి మళ్లీ తయారవుతుంది.. ఒక్క తెలివిలో తప్ప!.
ఓ రోజు అలా ఒంటరిగా నడిచిపోతున్న సయాలి గొంతు నుండి ఆయాచితంగా, 'జరూర్ జానాహే? (కచ్చితంగా వెళ్లాలా?)' అన్న మాట నాకు వినబడింది. తాను అంతా మర్చిపోయిందనుకున్న నాకు, ఈ మాటతో తన జ్ఞాపకంలో నేను తప్ప, ఎవరూలేరని అనిపించింది. అలా రోజులు గడుస్తున్నాయి. రాను రాను కొన్నిరోజులకి నా చుట్టూ ఉన్న బంధకాల నుండి క్రమంగా నాకు విముక్తి దొరకడం అనివార్యమైంది. సయాలికి ఇష్టమైన ఆ హిమాలయాలు, ఎండ వేడికి కరిగి జాలువారే ఆ స్వచ్ఛమైన నీటికి పెరిగే మొక్కలు, పూసే పువ్వులు, లోయల మీదుగా వీచే స్వచ్ఛమైన గాలి, ఆ పైన్, ఓక్ వృక్షాలు, ఆ ప్రకృతి, చివరికి సయాలి నన్ను స్వేచ్ఛాజీవిగా మార్చేసింది.
ఇక నేను ఆరాధించే సయాలి ఈ లోకంలోకి రావడం అసాధ్యం.
అందుకే.. ఆ కాశ్మీరీ ఆమ్మాయిని రోజూ దూరం నుండి చూస్తూ, తాను విహరిస్తున్న ఆ లోకంలోకి నేనూ వెళ్లాలని అనునిత్యం ప్రయత్నం చేస్తూనే కాలాన్ని లెక్కగడుతూ ఉన్నా.. ఇప్పటికీ, ఎప్పటికీ..
వడిగ భూపతి (డిఎస్.జీవా)
96763 71743