ప్రజాశక్తి -మధురవాడ : జీవీఎంసీ 7వ వార్డు పరిధి స్వతంత్రనగర్ కాలనీలో శనివారం భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున 3వ విడత వైఎస్‌ఆర్ ఆసరా చెక్కును మహిళలకు అందజేశారు. అనంతరం కాలనీలోని లక్ష్మీదేవి ఆలయం నుంచి వరదనీటి కాలువ నిర్మాణం కోసం జీవీఎంసీ రూ.19.98 లక్షలతో వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముత్తంశెట్టి మాట్లాడుతూ, జగనన్నతోనే స్వరాజ్యం సాధ్యమయ్యేలా పాలన సాగుతుందన్నారు. చట్ట సభల్లో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు జగన్మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారని తెలిపారు. అనంతరం 5, 6, 7, 8 వార్డుల్లో ఉన్న స్వయం సహాయక సంఘాలలో 13,935 మంది లబ్ధిదారులకు రూ.10.62 కోట్లు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










