ప్రజాశక్తి - సాలూరు : యుటిఎఫ్ ఏర్పడి 50ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో స్వర్ణోత్సవాల నిర్వహణకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మురళీ మోహన్‌రావు కోరారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవాల సన్నాహక ప్రచారంలో భాగంగా సాలూరు, పాచిపెంట మండలాల్లో పలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో స్థానిక లయన్స్ క్లబ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో సమావేశం నిర్వహించారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈనెల 21న బైక్ జాతా ఇచ్చాపురంలో ప్రారంభమై 22న పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట కి చేరుతుందని చెప్పారు. అక్కడ నుంచి పార్వతీపురంలో పైలాన్ ప్రారంభం అనంతరం బొబ్బిలి జాతా చేరుతుందని తెలిపారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మురళీమోహన్ కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాద్యక్షులు బి.విజయకుమార్, మండల అధ్యక్షుడు కె.జానకీరావు, కార్యదర్శి ఎ.గణేష్, జిల్లా సభ్యులు సింహాచలం, జగదీష్,సీతయ్య పాల్గొన్నారు.
కలెక్టరేట్: యుటిఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈనెల 22న బైక్ ర్యాలీ జిల్లాలో ప్రవేశిస్తుందని, ఈ జాతాను జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రమేష్, ఎస్.మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 1974 ఆగస్టు 10న ఏర్పడిన యుటిఎఫ్ ఉపాధ్యాయులకు ఎన్నో మేలైన, మెరుగైన అంశాలను సాధించిందన్నారు. ఈ 50ఏళ్లలో అనేక సమరశీల పోరాటాలు చేసిందని అన్నారు. ప్రస్తుతం ఉద్యమం అనేక ఓడిదుడుకులకు గురైనప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు బిగించినప్పటికీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.










