Dec 09,2022 23:38

స్వర్ణోత్సవ సంబరాల ఆహ్వాన ముఖ ద్వారం

ప్రజాశక్తి -చింతూరు
చింతూరు డివిజన్‌ కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలకు అంతా సిద్ధమైంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు సన్నాహాలు పూర్తయ్యాయి. 1974లో ఏర్పాటైన ఈ పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులపాటు సంబరాలు జరగనున్నాయి. 1974 నుంచి 2022 వరకు ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు, బోధించిన గురువులు అందరూ ఒకే చోట అపూర్వ కలయికకు ఇది వేదిక కానుంది. రెండు సంవత్సరాలుగా స్వర్ణోత్సవ ఉత్సవాలకు అనేక సమావేశాలు నిర్వహించారు. అనేక ఆటంకాలను ఎదుర్కొని పట్టుదలతో విశ్రాంత ఉపాధ్యాయులు అంక ప్రసాద్‌ సూచనలతో కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి విశ్రాంత గురువులు 70 మందిపైగా హాజరుకానున్నారు. వారికి గురుదక్షిణలు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వర్ణోత్సవ వేడుకల చిహ్నంగా చిరకాలం నిలిచిపోయేలా పైలాన్‌ ఏర్పాటు చేశారు. ఇదే పాఠశాలలో విధులు నిర్వహించిన పూర్వ ఉపాధ్యాయురాలు కీర్తిశేషులు బి.సరోజినీ దేవి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి రూ.3.50 లక్షలు విరాళం అందజేశారు. పాఠశాల సావినీర్‌ను తయారుచేసి అతిథుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజన సదుపాయాలు, వసతి ఏర్పాట్లు చేశారు. 1500 మంది పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు మారుమూల మన్య ప్రాంతమైన చింతూరుకు విచ్చేసి తమ బాల్య కాలం నాటి తీపి గుర్తులను నెమరు వేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి అమరులైన గురువుల చిత్రపటాలను ఆవిష్కరించనున్నారు. ఆహ్వాన ముఖద్వారాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మనబడి స్వర్ణోత్సవ పూర్వ విద్యార్థుల కమిటీ కోరుతోంది.