Oct 20,2023 21:52

వైద్యాధికారి ధరణిని సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-వేపాడ : మండలంలో అధికార పార్టీ సభ్యులు అసంతృప్తి గళం వినిపించారు. మండల సమావేశంలో ఎంపిపి తీరును తప్పుబట్టారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి డి.సత్యవంతుడు అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు హాజరయ్యారు. మండల పరిషత్తు నిధులు మంజూరులో ఎంపిపి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టిడిపి బానాది ఎంపిటిసి గొంప తులసి, వైసిపి ఎంపిటిసి వి.వి.చినరామునాయుడుతోపాటు పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బానాది, ఎన్‌కెఆర్‌పురం గ్రామాలకు రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిరంకుశత్వంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్నట్లు జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేశారు. బానాదిలో టిడిపి శ్రేణులున్న వీధులకు నీరివ్వకుండా అధికారులను బెదిరించడం ఎంతవరకు సమంజసమని గొంప తులసి నిలదీశారు. ఎంపిపి తీరువల్ల మండలంలో పార్టీకి నష్టం తప్పదని అధికార పార్టీ సభ్యులు సమావేశంలోనే అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విస్తృతంగా సేవలందించిన వైద్యాధికారి ఎ.ధరణిని సభ్యులు సన్మానించారు.
సమావేశంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సన్యాసినాయుడు, ఎంపిడిఒ బిఎస్‌కెఎన్‌ పట్నాయక్‌, తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌, ఇఒపిఆర్‌డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎన్‌.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.