Nov 04,2022 23:40

  • సమస్యలపై 'జడ్‌పి'లో గళమెత్తిన అధికారపక్ష సభ్యులు
  • ఆరోగ్య శ్రీ సేవలు అందడంలేదని ఆగ్రహం
  • జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు డిమాండ్‌
  • ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి
  • 108 కో ఆర్డినేటర్‌పై చర్యలకు సూచన

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
''విజయవాడ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదు. ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి ఆమోదం రానిదే అత్యవసర వైద్య సేవలందడం లేదు. కౌంటర్లో ముందస్తు డిపాజిట్‌ చేస్తేనే గుండెపోటు వచ్చిన పేషెంట్లకు చికిత్స చేస్తామని నెట్‌వర్కు ఆస్పత్రుల వారు డబ్బులు వసూలు చేస్తున్నారు. స్పెషలిస్టుల్లేని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సంబంధం లేని వైద్య సేవలందించి మోసం చేస్తున్నాయి'' స్వయంగా అధికారపక్ష సభ్యులే గళమెత్తిన పరిస్థితి జిల్లా పరిషత్‌ సమావేశంలో చోటుచేసుకుంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్‌ కన్వెన్షన ్‌హాలులో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులే పలు సమస్యలు లేవనెత్తారు. అంతేకాదు...108 స్పందన పేలవంగా ఉందని, పిహెచ్‌సిల మ్యాపింగ్‌ లోపభూయిష్టంగా ఉందని, అధికారులు చిత్తశుద్దితో పనిచేయడంలేదని, సమస్యలు పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పెనమలూరు, నూజివీడు ఎంఎల్‌ఎలు కొలుసు పార్ధసారధి, మేకా వెంకట ప్రతాప అప్పారావు కోరారు. తోట్లవల్లూరు మండలంలో రెండో పిహెచ్‌సి నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలని పామర్రు ఎంఎల్‌ఎ కైలే అనిల్‌కుమార్‌ డిఎంహెచ్‌ఒ గీతాబాయిని ప్రశ్నించారు. త్వరలో నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తామని అధికారులు సమాధానమిచ్చారు. విలేజ్‌ క్లీనిక్‌లలో మందులు ఉండటం లేదని ఇబ్రహీంపట్నం జడ్‌పిటిసి సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని అవనిగడ్డ, నూజివీడు ఎంఎల్‌ఎలు సింహాద్రి రమేష్‌, మేకా ప్రతాప్‌ అప్పారావు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది మిల్లర్ల మాయాజాలంతో రైతులకు మద్దతు ధర అందలేదదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈసీజన్లో నిర్దేశించిన మొత్తంకన్నా తేమశాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సేకరించడానికి అవకాశాలను పరిశీలించాలని, రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని పెనమలూరు ఎంఎల్‌ఎ పార్థసారథి కోరారు. వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌, ధాన్యం సేకరణ, ఆర్‌అండ్‌బిశాఖల అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి జోగి రమేష్‌, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల కలెక్టర్లు పి.రంజిత్‌బాషా, ఎస్‌.డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.
108 కో ఆర్డినేటర్‌పై చర్యలు తీసుకోండి
ఎంఎల్‌ఎ పేర్ని నాని
'రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని రక్షించడానికి 108కు ఫోన్‌చేస్తే వాహనం రావడానికి చాలా సమయం పట్టింది. ఇటువంటివి ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మారతాయి'' అని జి.కొండూరు జడ్‌పిటిసి సభ్యులు లక్ష్మీతిరుపతమ్మ సమావేశంలో ప్రస్తావించారు. ఈ అంశంలో సంబంధిత లొకేషన్‌ నుంచి 108కు ఫోన్‌ ఏ సమయంలో వచ్చింది, పేషెంట్‌ వద్దకు ఎప్పటిలోగా వాహనం వెళ్లింది అన్న వివరణ ఇచ్చి జడ్‌పిటిసి సందేహాన్ని నివృత్తి చేయాలని ఎన్‌టిఆర్‌ జిల్లా డిఎంహెచ్‌ఒ సుహాసినిని మచిలీపట్నం ఎంఎల్‌ఎ పేర్ని నాని కోరారు. ఈ సమావేశానికి 108 కో ఆర్డినేటర్‌ వస్తానని సమాచారం ఇచ్చారని, ఆయన వచ్చి వివరణ ఇస్తారని చెప్పారు. అయితే సమావేశ వేదికపైకి పిలిచినా కో ఆర్డినేటర్‌ అందుబాటులోకి రాలేదు. కో ఆర్డినేటర్‌పై చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌ఎ నాని అధికారులకు సూచించారు.