Feb 04,2023 23:00

చాపకింద నీరులా అధికారపక్షంలో అసమ్మతి
బిజెపితో సఖ్యత.. అభివృద్ధి పనులకు నిధుల లేమిపై పెదవివిరుపు

             సమస్యలపై అధికారిక సమావేశాల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే గళమెత్తితే స్వపక్షమే విపక్షమైందని అంతా అంటుంటారు అయితే రాజకీయపరమైన వైరం స్వపక్షంలోనే నివురుగప్పిన నిప్పులా ఉంటే.. బడబాగ్ని కాక తప్పదు. దానికి నెల్లూరు జిల్లాలో అధికార వైసిపిలో నెలకొన్న ప్రకంపనలే నిదర్శనం. అయితే ఆ పరిస్థితి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ చాపకింద నీరులా ఉందని, ఇటీవల కేంద్ర బడ్జెట్‌పై స్పందన, నిధుల లేమి తదితర అంశాలు అసంతృప్తి అసమ్మతి రూపం తీసుకుంటోందని అధికార పార్టీ నేతలే నెల్లూరు గురించి చర్చల్లో వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
ఏలూరు జిల్లాలో ఇప్పటికే చింతలపూడి నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇది జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ పాలకవర్గంలోనూ, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లోని స్థానిక సంస్థల్లోనూ చాలా స్పష్టంగా కన్పిస్తోంది. కైకలూరు, దెందులూరు, ఏలూరులో కూడా వివిధ కారణాల పేరిట అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయి. ఏలూరులో కార్పొరేషన్‌ విషయంలో పార్టీ పరువు బజారున పడిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అదే క్రమంలో ఈసారి ఏలూరు ఎంఎల్‌ఎ టిక్కెట్‌ బిసికి ఇవ్వాలని, ఇస్తారని ప్రచారం జోరందుకోగా ఒక మహిళా కార్పొరేటర్‌ బహిరంగంగానే పార్టీ అధినేతను కలిసే ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. అదేక్రమంలో కార్పొరేషన్‌ పెద్దగా వ్యవహరిస్తున్న ప్రముఖులు కూడా టిక్కెట్‌ రేసులో ఉండటం, కొన్ని అంశాల్లో ఎంఎల్‌ఎతో విబేధిస్తుండడం ఆ పార్టీ నేతల్లో నెలకొన్న లుకలుకలను ప్రతిబింబిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపు సమయానికి నెల్లూరు తరహా తిరుగుబాట్లు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈలోపు అధిష్టానం జోక్యం చేసుకుని రాజీకి చర్యలు చేపట్టకపోతే తలపోట్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లోనూ అసమ్మతి సెగ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఉండి నియోజకవర్గంలో అధికార పార్టీ తరచూ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మారుస్తుండడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. దీనికితోడు మాజీ మంత్రి ఒకరు ఈ నియోజకవర్గంలో నేరుగా జోక్యం చేసుకోవడం ఆ నియోజకవర్గ నేతలకు రుచించడం లేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అర్థం కాని పరిస్థితి. టిడిపికి చెందిన మాజీ ఎంఎల్‌ఎ శివ మళ్లీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండటంతో ఆ నియోజకవర్గ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది. అక్కడ గత ఎన్నికల్లో టిడిపి గెలిచినా శివ రాజకీయాలకు దూరంగా ఉండటం, ఎంఎల్‌ఎ తీరుతో ఆ అనుచరగణమంతా వైసిపి గూటికి చేరింది. శివ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కావడంతో వైసిపిలో ఉన్న అనుచరగణమంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే శివ వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచే బరిలోకి దిగుతారా లేక పార్టీ మారతారా అనే దానిపై స్పష్టత వచ్చేంత వరకూ వారంతా వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఇది అక్కడ ఇరు పార్టీలకూ శివ అంశం సకంటంగానే ఉంది. ఇక అధికార పార్టీకైతే ఆశావహులు ఎక్కువ ఉండటం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. భీమవరం ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై గెలుపొందారు. తనకు మంత్రి పదవి వస్తుందని రెండుసార్లు భావించినా చివరి నిమిషంలో చేజారిందనే బాధ గ్రంధి అనుచరుల్లో ఉంది. దీనికితోడు శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజుకు, గ్రంధికి మధ్య పొరపొచ్చాలు నెలకొన్నాయని, దీనివల్ల ఒకింత ఆధిపత్య పోరు కూడా సాగుతోందని ప్రచారం సాగుతోంది. ఇది రానున్న ఎన్నికల నాటికి ఏరూపం తీసుకుంటుందో వేచిచూడాలి. పాలకొల్లులో ఎంఎల్‌ఎ టిక్కెట్‌ రేసులో జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌తోపాటు మాజీ ఎంఎల్‌సి మేకా శేషుబాబు, ఇతరులు ఉన్నారు. ఇక్కడ నేతల మధ్య సయోధ్య లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. ఆచంటలో వారసుడిని రంగంలోకి దింపేందుకు యత్నించడం స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొంది. మొత్తం ఈ పరిణామాలన్నీ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తికి తార్కాణాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పై అంశాలకు తోడు కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు, రాష్ట్రానికి ఎటువంటి ప్రాధాన్యతా లేకపోవడం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కనీసం అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాల్లో ఊపందుకోకపోవడం అధికారపక్ష ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు, రెవెన్యూ లోటు పూడ్చుకునేందుకు ప్రతిసారీ కేంద్రం ముందు మోకరిల్లే బదులు ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే కనీసం నిధులైనా విడుదలయ్యేవని, ఇటు ప్రజల్లోనూ తాము దోషిగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదని బహిరంగంగానే అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలోని బిజెపికి అన్నివిధాలుగా సహకరిస్తూ మద్దతిస్తున్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలైనా ప్రస్తావనకు తీసుకురాకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలోని కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్లకు నిధులు అతితక్కువగా కేటాయించడంపై పెదవి విరుస్తున్నారు. బిజెపితో సఖ్యత, కనీసంగా హామీలు అమలు కాకపోవడం, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం వచ్చే ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా మారుతాయని వైసిపి ఎంఎల్‌ఎలు సైతం తలలు పట్టుకుంటున్నారు. వీటికి తోడు అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగితే నెల్లూరు తరహా తిరుగుబాట్లు ఇక్కడా అధికార పార్టీకి తప్పవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాలి.
- విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌