Dec 13,2020 12:08

'ఇదిగో డ్రైవర్‌ నీపేరేంటన్నావ్‌?' అన్నాడు నారదమూర్తి.
'ఉదరుకిరణ్‌' చెప్పాడతను మర్యాదగా.
'ఉదరు! ఈ ఉదయంలానే నీ పేరు చాలా బావుందయ్యా ! బస్సులో ఆడవాళ్లు, పెద్దవాళ్ళు.. జాగ్రత్తగా వెళ్ళు! అన్నట్లు మరిచాను. బండిలో స్టెఫ్నీ ఉందా? పంక్చర్‌ గట్రా అవుతే' .
'ఉంది సార్‌. నాలుగూ కొత్త టైర్లే. ఏమీ ప్రాబ్లెమ్‌ ఉండదు సార్‌!'
'మీ ట్రాన్స్‌పోర్ట్‌ వాళ్లంతా ఇలాగే మాట్లాడతారయ్యా! డబ్బు తీసుకుంటారు., డొక్కు బళ్ళు తెచ్చి, ఇబ్బందిపెడతారు. దూరం వెళుతున్నాం కదా అందుకే అడిగా' అన్నాడు నారదమూర్తి.
'ఏవండీ! ట్రిప్‌ పెట్టినోళ్ళు చూసుకుంటారుగా? మీకెందుకా నోటి దురద? క్రితం ట్రిప్‌లో కమల బస్సెక్కుతుంటే ''జాగ్రత్తమ్మా!'' అన్నారు. మీరా మాటంటూనే కమల బస్సు మెట్టు మీద నుంచి జారిపడి, పన్ను విరిగింది. మేము జాగ్రత్తగానే వెళ్ళొస్తాం. తమరు బయలుదేరండిక' అంది నారదమూర్తి భార్య మహతి పుల్లవిరుపుగా.
అయిష్టంగానే బస్సుకు దూరంగా వెళ్లాడు నారదమూర్తి.
నారదమూర్తి, మహతి గేటెడ్‌ కమ్యూనిటీలో నాలుగో అంతస్థులో ఉంటారు. ఇద్దరూ సీనియర్‌ సిటిజన్స్‌. వాళ్ళిద్దరినీ 'మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' అని ఇరుగు పొరుగు అంటూంటారు. వాళ్లిద్దరూ తిరగడమేగాక అపార్టుమెంటులో వారితో విడివిడిగా ఏడాదికి రెండు మూడుసార్లు ట్రిప్‌ వేసుకుని, చూడని ప్రదేశాలు, గుళ్ళూ దర్శిస్తుంటారు. ఈసారి కోస్తా ఏరియాలో గుళ్ళు, చీరల షాపింగ్‌కని మినీ బస్సులో పదిహేనుమంది బయల్దేరారు. నారదమూర్తి వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి వచ్చాడు.
'ఇప్పటికే ఇంట్లో అల్మరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇక చీరలు కొనకు' అని మహతికి చెప్పి వెళ్ళాడు నారదమూర్తి.
'మీది నోరా లేక ఇంకేమన్నానా? ఏభై కిలోమీటర్లు వెళ్ళామో లేదో బస్సు ముందు టైర్‌ పంక్చర్‌. కొద్దిలో ప్రమాదం తప్పింది. బస్సులో మిమ్మల్ని తిట్టనివాళ్ళు లేరు. కొత్త టైర్‌ పంక్చర్‌ అయిందని బూతులు తిట్టాడు డ్రైవర్‌. వినలేక చెవులు మూసుకున్నాను. మీరింక మా ఫ్రెండ్స్‌ దగ్గర ఏమైనా అపశకునపు మాటలు మాట్లాడారో మర్యాద ఉండదు!' అంటూ ఫోనులో నారదమూర్తిని హెచ్చరించింది మహతి.
        అది విన్నప్పటి నుంచి తనేమైనా అంటే అది జరుగుతుందేమోనన్న ఆలోచన అతనిలో మొలకెత్తింది. ఇదివరలోనూ మహతి, పిల్లలు తరచూ 'మీ నోటితో కీడు శంకించకండి అవి నిజమవుతాయి' అనేవారు. వారి మాటల్ని పిచ్చి నమ్మకాలంటూ కొట్టిపారేసేవాడు నారదమూర్తి.
        ఇప్పుడు నారదమూర్తి రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నాడు. వేరేవ్యాపకం లేదేమో ఇలా నమ్మకాలని నమ్మడం మొదలెట్టాడు!
వాళ్ల అపార్టుమెంటులో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. ఉత్తరాదివాళ్ళు దుర్గదేవి పెద్ద విగ్రహం తెచ్చి, ఘనంగా చేయాలని, దాండియా, డి.జె పెట్టవలసిందేనని కమిటీలో తీర్మానించారు. వెంటనే సాంస్కతిక కమిటీ సభ్యుడిగా నారదమూర్తి 'పెద్ద విగ్రహమైతే క్లబ్‌ హౌస్‌ లోనికి తీసుకువెళ్లడం కష్టం గుమ్మానికి తగిలి, విగ్రహం దెబ్బతింటుంది. బయట షామియానా వేసి ప్రతిష్టిద్దాం' అన్నాడు నారదమూర్తి ముందుచూపుతో.
        వర్షం వచ్చేలా వుంది కాబట్టి క్లబ్‌హౌస్‌లోనే పూజ చేయాలని తేల్చేశారు. నవరాత్రులలో మొదటిరోజు ఉదయాన్నే అమ్మవారి విగ్రహం వచ్చింది. ఆరడుగుల ఎత్తున్న విగ్రహం ట్రాలీలో నుంచి క్లబ్‌హౌస్‌లోనికి తరిలిస్తుంటే, కిరీటం గుమ్మానికి తగిలి విరిగింది. కమ్యూనిటీలో నానా రభస. ముందే హెచ్చరించినా నారదమూర్తి జాగ్రత్తలు తీసుకోలేదని కొందరు ప్రచారం చేశారు. విగ్రహం మార్చాల్సి వచ్చి, ఖర్చు తడిసి మోపెడైంది.
        ఈ సంఘటన జరిగిన నాటి నుంచీ నారదమూర్తి తన మాటకు తిరిగే లేదన్న నమ్మకం మరింత బలపడింది. అతని ప్రవర్తన ఎదుటివారికి రాను రానూ భరింపరానిదిగా అయింది. తనని తానొక 'బాబా'గా భావించడం మొదలెట్టాడు. అతని 'అహం'మూర్తి అవతరించాడు!
        నారదమూర్తి అపార్టుమెంటులో 'బోరు' ఎక్కడవేయాలో నారదమూర్తిని అడిగితే బావుంటుందని కొందరు అన్నారు. మరికొందరు భూగర్భజల నిపుణుల్ని సంప్రదించాలన్నారు. నారదమూర్తికీ 'జియాలజీ'లో ప్రవేశం ఉందని ఎవరో చెప్పారని సెక్రటరీ అనడంతో మీటింగుకి నారదమూర్తిని పిలిచారు. 'నారదమూర్తిగారూ మీరైతేనే బోర్‌ ఎక్కడ వేస్తే నీరు పడుతుందో చెప్పగలరు!' అన్నాడు సొసైటీ సెక్రటరీ. తనదే బాధ్యతని అందరిలో సొసైటీ మాటిచ్చాడు నారదమూర్తి.
        మాటైతే ఇచ్చాడు గానీ ఏం చేయాలో అర్థంగావడం లేదు. ఈ విషయమై మూడురోజులు రేయింబవళ్లూ మదనపడ్డాడు. నిశీధిన, నిశ్శబ్దంగా ఉన్నసమయంలో భూమిపై చెవ్వు ఆనించి వింటే, ఆ ప్రదేశంలో జలం ఉంటే నీటిప్రవాహ శబ్దం వినబడుతుందని ఎప్పుడో ఎవరో చెబితే విన్నట్టు గుర్తొచ్చింది నారదమూర్తికి. ఆ రోజు అర్ధరాత్రి దాటాక దాదాపు రెండుగంటలకు నాలుగో అంతస్తు నుంచి కిందకు వచ్చాడు. అపార్టుమెంటులో ఒక మూలగా ఖాళీగా ఉన్న ప్రదేశంలో తుప్పలు, ఎండిపోయిన ఆకులూ శుభ్రం చేసి తనతో తెచ్చుకున్న బెడ్‌షీట్‌ కింద పరిచి, బోర్లా పడుకుని చెవి భూమికి ఆనించి జాగ్రత్తగా విన్నాడు. నీటి ప్రవాహశబ్దం వినబడలేదు. ఇంకొక ప్రదేశానికి మారాడు. అక్కడా పడుకుని చెవి భూమికి ఆనించి విన్నాడు. ఎలాటి ప్రవాహశబ్దం వినబడలేదు. 'ఓహో బెడ్‌షీట్‌ అడ్డం ఉంది!' అనుకుని దాని పైఅంచు మడిచి, పడుకుని కుడిచెవి నేలకానించి, ఐదు నిముషాలు ప్రవాహశబ్దం వినబడుతుందోమోనని చెవి నిక్కరించి విన్నాడు. ఇంతలో చెంప మీద చురుక్కుమని ఏదో కుట్టినట్లనిపించి, తటాలున లేచి టార్చ్‌లైట్‌ వేశాడక్కడ నారదమూర్తి. ఆ వెలుతురులో స్పష్టంగా కనిపించింది చిన్న నల్లటి తేలొకటి కొండి ఎత్తుకుని పాకుతూ!
కెవ్వున అరిచి చటుక్కున లేచి చెంప రుద్దుకుంటూ అలవికాని మంట, నొప్పితో విలవిల్లాడుతూ, బెడ్‌షీట్‌ మరిచి అక్కడ నుంచి పరుగులంకించుకున్నాడు నారదమూర్తి !
         'ఎవరు? కోన్‌ హై వో? చోర్‌ చోర్‌!' అంటూ విజిల్‌ వేస్తూ వెంటబడ్డాడు లాఠీతో సెక్యూరిటీ గార్డ్‌. 'కర్మ! వీడొకడు' అనుకుంటూ అడ్డదిడ్డంగా పరుగెత్తి రొప్పుతూ లిఫ్ట్‌ దగ్గర దొరకనే దొరికాడు తరుముతున్న సెక్యూరిటీ గార్డ్‌కి నారదమూర్తి.
          'ఓ ... ఏందీ సార్‌ గట్ట ఉరుక బడితివి ఎవడో దొంగ అనుకుని, లాఠీ నూకెటోన్ని సార్‌! ఇంకానయం...నీ రోజులు నా రోజులు బాగున్నరు ! అయినా ఈయాలటప్పుడు కింద ఏం చేస్తున్నరు సార్‌?' అని పైకని, గొణుక్కుంటూ వెళ్లిపోయాడక్కడి నుంచి సెక్యూరిటీ గార్డ్‌.
           'బతుకుజీవుడా ! ' అనుకుంటూ ఫ్లాట్‌ కొచ్చి, కారు కీస్‌ తీసుకుని 'మరెప్పుడూ భవిష్యవాణి జోలికి పొరపాటునైనా వెళ్లకూడదు!' అని గట్టిగా లెంపలేసుకుని, నొప్పితో గిలగిల్లాడుతూ ఆసుపత్రికి బయలుదేరాడు నారదమూర్తి ఆ అర్ధరాత్రి.
దెబ్బకి నారదమూర్తికి అహం వదిలింది !

కేశిరాజు వెంకట వరదయ్య
9849118254