Jul 24,2023 23:04

స్వల్పంగా పెరిగిన సాగు

- అత్యధిక మండలాల్లో సాధారణ వర్షపాతం
- వ్యవసాయానికి ఊరట
- జూలైలో కురవాల్సిన వర్షం 142.8 మి.మీ
- ఇప్పటివరకు 189.4 శాతం నమోదు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లా క్రమేణా కుదుట పడుతోంది. కరువు పరిస్థితులు పూర్తిగా తొలగకున్నా, పంటల సాగు కాస్త పర్వాలేదనిపిస్తోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో సాగు శాతం పెరిగింది. వారం రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో రెండు పర్యాయాలు అల్పపీడనం ఏర్పడడంతో జిల్లాలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జిల్లాలో ప్రస్తుతం లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్న మండలాల సంఖ్య గణనీయంగా తగ్గింది. పంటల సాగు మూడు వారాల కిందటి పరిస్థితితో పోలిస్తే కొంత మెరుగుపడింది.
వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లా రైతాంగం క్రమేణా గట్టెక్కుతోంది. వారం రోజుల కిందటితో పోలిస్తే పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు కొన్నిరకాల పంటల విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇందులో వరి 3,98,750 ఎకరాలకు గాను 1,59,558 ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న పంట సాగు కాస్త బాగుంది. ఈ సంవత్సరం 26,375 ఎకరాల విస్తీర్ణంలో వేయాలని అనుకోగా 16,163 ఎకరాల్లో వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా 995 ఎకరాలు (22 శాతం) మేర వేశారు. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాలనుకోగా 995 ఎకరాలు (21 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటివరకు 40 ఎకరాలు (12 శాతం) మేర సాగవుతోంది. వేరుశనగ 1332.5 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా ప్రస్తుతం 30 ఎకరాల్లో వేశారు.
జూలైలో సాధారణానికి మించి వర్షం
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఖరీఫ్‌ సాగుకు అనువైన వర్షం కురవలేదు. అక్కడక్కడా కాస్తంత వర్షం పడినా అది ఏమాత్రం సాగుకు ఉపయోగపడలేదు. జూన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, జూలైలో ఇప్పటివరకు ఒక మాదిరిగా వర్షాలు కురిశాయి. జూన్‌లో సగటున 134.9 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 69.6 మి.మీ మాత్రమే నమోదైంది. వర్షపాతం లోటు 48.4 శాతంగా ఉంది. జూలైలో ఇప్పటివరకు 142.8 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 189.4 మి.మీ వర్షపాతం నమోదై 32.7 శాతం అదనంగా వర్షం పడింది. ప్రస్తుతం జిల్లాలో ఏడు మండలాల్లో అధిక వర్షపాతం, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 11 మండలాల్లో వర్షపాతం లోటు ఉండగా, సోంపేటలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. వారం రోజుల కిందట పరిశీలిస్తే రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
విస్తారంగా వర్షాలు
జిల్లాలో సోమవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే శ్రీకాకుళం నగరంలో అత్యధిక వర్షం కురిసింది. రాష్ట్రంలో అధిక వర్షం కురిసిన ప్రాంతాల్లో ఏడు ప్రాంతాలూ జిల్లాలో ఉండడం విశేషం. హిరమండలం గొట్టా బ్యారేజీ ప్రాంతంలో అత్యధికంగా 58.25 మి.మీ వర్షం కురిసింది. జలుమూరులో 55.5 మి.మీ, సరుబుజ్జిలి మండలం విజయరామపురంలో 54.5 మి.మీ వర్షం పడింది. ఎల్‌.ఎన్‌ పేటలో 40.75 మి.మీ, పాతపట్నంలో 35 మి.మీ, ఎల్‌.ఎన్‌ పేట మండలం కోవిలాంలో 40.75 మి.మీ, బూర్జ మండలం కొల్లివలసలో 19.75 మి.మీ, మెళియాపుట్టిలో 19.5 మి.మీ, పాతపట్నం మండలం జగ్గిలిబొంతులో 16 మి.మీ వర్షం కురిసింది. రణస్థలం మండలం గరికవలసలో 14.5 మి.మీ, ఆమదాలవలసలో 12 మి.మీ వర్షం పడింది.