సవలం కన్నయ్యగుంపు బాధితులను ముంపు జాబితాలో చేర్చాలని వినతి
ప్రజాశక్తి- చింతూరు
మండలంలోని చిడుమూరు పంచాయతీ పరిధి సవలం కన్నయ్య గుంపులోని 14 కుటుంబాలను పోలవరం ముంపు ఆర్ అండ్ ఆర్ జాబితాలో చేర్చకపోవడం అన్యాయమని, తక్షణమే రీ సర్వే చేసి ఆ ఇళ్లను ఆర్ అండ్ ఆర్ జాబితాలో చేర్చాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిడుమూరు సచివాలయం కార్యదర్శికి సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కుంజా సీతారామయ్య, పల్లపు వెంకట్, యర్రంశెట్టి శ్రీనివాసులు, ఎంపీటీసీ ముర్రం లక్ష్మి మాట్లాడుతూ అధికారులు చేసిన సర్వేలు తప్పుల తడకాలుగా, అయోమయంగా ఉన్నాయని విమర్శించారు. ఎత్తులో ఉన్న ఇళ్లు ముంపునకు గురై వాటి కింద ఉన్న ఇళ్లు ముంపులో లేవని చెప్పడమంటే సర్వే ఎంత తప్పుతడకగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి చిడుమూరు పరిధిలోని సవలం కన్నయ్య, తుర్రం లాలమ్మ, తుర్రం సుబ్బయ్య, తుర్రం చంద్రయ్య, తుర్రం మహేష్, గొడ్డెలా బజారమ్మ, పులి కన్నమ్మ, సున్నం ముత్తమ్మ, సున్నం భీమమ్మ, సున్నం గంగమ్మ, గెడ్డల పెద్ద బజారమ్మ, గెడ్డల ముత్తయ్య, సోడి ముత్తయ్య, తుర్రం లాలమ్మ తదితర 14 మంది ఇళ్లను రీ సర్వే చేసి ముంపు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన కార్యదర్శి సమస్య పరిష్కారం కోసం ఆర్ అండ్ ఆర్ అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంపు వాసులు పాల్గొన్నారు.
అలాగే చింతూరు మండల కేంద్రంలో మెయిన్ రోడ్డులో లాండ్రీ షాపు రమణ, బార్బర్ షాపు పొదిలి రామారావు, టైలర్, ఆసుపత్రి గోడకు ఆనుకొని ఉన్న దుకాణాల సముదాయాలను లిస్టులో లేవని, వాటిని కూడా సర్వే చేసి ఆర్ అండ్ ఆర్ జాబితాలో చేర్చాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.










