Nov 08,2023 21:55

స్విమ్స్‌ను సందర్శించిన ఈవో ఎవి ధర్మారెడ్డి

స్విమ్స్‌ను సందర్శించిన టిటిడిఈవో
ప్రజాశక్తి - తిరుపతి సిటి
స్విమ్స్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎవి ధర్మారెడ్డి బుధవారం ఉదయం జేఈవో సదాభార్గవి, ఎఫ్‌ఎస్‌సిఎఒ బాలాజీ, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, స్విమ్స్‌ సంచాలకులు ఆర్‌వి కుమార్‌లతో కలిసి సందర్శించారు. విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.2.75 కోట్ల విలువ గల పింక్‌ బస్సును స్విమ్స్‌కు విరాళంగా అందించారు. ఈ పింక్‌ బస్సును పరిశీలించిన అనంతరం ఈవో మాట్లాడుతూ 40 ఏళ్లు పైబడిన మహిళలందరికీ అడ్వాన్స్‌ క్యాన్సర్‌ టెస్ట్‌లను ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. త్వరలోనే మరో బస్సు అందుబాటులోకి రానుందని తెలిపారు. స్విమ్స్‌ క్యాజువాల్టీ విభాగాన్ని సందర్శించి అధికారులకు, వైద్యులకు తగు సూచనలు ఇచ్చారు. త్వరలోనే లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా స్విమ్స్‌లో కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసుకున్న పేషంట్లను ఈవో పరామర్శించారు.
స్విమ్స్‌లో మాస్టర్‌ హెల్త్‌ చెక్‌ ప్యాకేజీల విధానం
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) హాస్పిటల్‌లో పేషంట్ల సౌకర్యార్థం వివిధ రకాలైన మాస్టర్‌ హెల్త్‌ చెక్‌అప్‌ ప్యాకేజ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్స్‌ నందు కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగపు వారి ఆధ్వర్యంలో స్విమ్స్‌ క్లినిక్‌ నందు ఓ.పి విభాగం ద్వారా ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నమోదు చేసుకొని, వివిధ రకములైన మాస్టర్‌ హెల్త్‌ చెక్‌అప్‌ ప్యాకేజ్‌ ల ద్వారా పేషంట్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి అన్నారు. త్వరలోనే కార్డియాక్‌ హెల్త్‌ చెక్‌అప్‌ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ముందుగా ఫోన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయదలచుకొన్న వారు 8333997968 ఫోన్‌ నెంబర్ను సంప్రదించాలని సూచించారు.

రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయలో వైద్యులు రెండేళ్ల వ్యవధిలో రికార్డు సంఖ్యలో 2,030 గుండె శస్త్ర చికిత్సలు పూర్తి చేశారని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా ఏడు విజయవంతం అయ్యాయని, వీరు ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హదయాలయలో బుధవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి 2021 అక్టోబరులో ఈ ఆసుపత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బందం, నర్సుల బందం కలిసి ఎంతో అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్‌ రేట్‌ ఉందని వెల్లడించారు. సేవలకు గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు లభించిందన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ స్కీమ్‌ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రోజుల వయసుగల పిల్లల నుంచి పెద్దల వరకు సంక్లిష్టమైన గుండె సమస్యలకు నిపుణులైన వైద్య బందంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఖర్చుతోకూడిన హైరిస్క్‌ ఆపరేషన్లకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కింద పేదలకు ఉచితంగా గుండెవైద్యం అందిస్తున్నామన్నారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అవసరం లేకుండా నరం ద్వారా కవాటాలు మార్చడం, దమనుల శస్త్రచికిత్సలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలో 350 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుందని, ఇక్కడ కిడ్నీ, మెదడు, బోన్‌మ్యారో తదితర చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని విభాగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. డాక్టర్‌ గణపతి సుబ్రమణ్యం మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో అవయవ మార్పిడిపై అవగాహన పెరగాలని, అవయవ మార్పిడికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. గుండె మార్పిడి చేసుకున్న కర్నూలుకు చెందిన కోటేశ్వరరెడ్డి (32), గుంటూరుకు చెందిన సుమతి(31), కైకలూరుకు చెందిన కరుణాకర్‌(39)లతో ఈవో మాట్లాడారు. టిటిడి జేఈవో సదా భార్గవి, ఆర్‌ఎంఒ డాక్టర్‌ భరత్‌, ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ సౌమ్య, డాక్టర్‌ గణేష్‌ పాల్గొన్నారు.

స్విమ్స్‌ను సందర్శించిన ఈవో ఎవి ధర్మారెడ్డి