ప్రజాశకి-విజయనగరం టౌన్ : పిల్లలకు చదువుతోపాటు క్రీడలూ అవసరమని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి వాటిలో ప్రతిభ ఉంటే తన లాంటి తల్లులకు ధైర్యంగా ఉంటుందని చెప్పారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్- (జూనియర్స్) ఎంపిక పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి.ఈశ్వర్ కౌశిక్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు తదితరులతో కలిసి ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, 63 ఏళ్ల వయసులోనూ మన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గంటపాటు జలాసనం వేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేశారు. పట్టుదలతో ఎంచుకున్న రంగంలో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా విద్యలకే కాక, క్రీడలకూ పెట్టింది పేరని గుర్తు చేశారు. కేసలి అప్పారావు మాట్లాడుతూ కరాటే వంటి ఆత్మ రక్షణ క్రీడలు బాలల శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.










