ముఖ్యంగా నూతన సంవత్సరమంటే స్వీటు తప్పకుండా ఉండాల్సిందే. తిల్ పీఠా, గోధుమ హల్వా, స్వీట్ పనియారం, పెసరపప్పు స్వీట్ రెసిపీలు ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. ఇంటిల్లిపాది కమ్మని రుచులు ఆస్వాదించండి.
తిల్ పీఠా
కావాల్సిన పదార్థాలు : బియ్యం- 3 కప్పులు, నల్ల నువ్వులు- 150 గ్రాములు, బెల్లం- 200 గ్రాములు, నీళ్లు- సరిపడా.
తయారుచేసే విధానం :
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీళ్లు నింపి ఏడు గంటలు నానబెట్టాలి.
తర్వాత నీళ్లన్నీ ఒంపేసి, తడిగా ఉన్నప్పుడే మెత్తగా అరిసెల పిండిలా దంచుకోవాలి.
పిండిని గిన్నెలోకి తీసుకుని, తడి బట్ట కప్పి ఉంచుకోవాలి.
నువ్వులను నూనె లేకుండా వేయించుకుని, పొడి కొట్టుకోవాలి.
బెల్లం తరిగి, నువ్వుల పొడి కలిపి పెట్టుకోవాలి.
స్టౌ మీద పెనం వేడి చేసి, తడిగా ఉన్న బియ్యం పిండిని రొట్టెలా కాల్చుకోవాలి.
తర్వాత దానిపైన బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని ఉంచి, బియ్యం రొట్టె (పీఠా) ను రెండు వైపుల నుంచీ లోపలికి మడవాలి.
ఈ పీఠాను తిరగేసి, కాల్చి తీయాలి. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
స్వీట్ పనియారం
కావాల్సిన పదార్థాలు :
బియ్యప్పిండి - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, బెల్లం - అరకప్పు, అరటిపండు ముక్కలు - అరకప్పు, యాలకులు - రెండు, నెయ్యి - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం :
బౌల్‌లో కొబ్బరి తురుము, అరటిపండు ముక్కలు, యాలకులు తీసుకోవాలి. వాటిని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. అవసరమైతే ఒకటి రెండు చెంచాల నీళ్లు వేసుకోవచ్చు.
తర్వాత బెల్లం వేసి మరోసారి గ్రైండ్ చేసుకుని ఇంకో బౌల్‌లోకి మార్చుకోవాలి.
అందులో తగినంత ఉప్పు, బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పనియారం పాన్ (గుంట పాన్) లో కొద్దిగా నెయ్యి వేసి, మిశ్రమం వేసుకోవాలి.
చిన్నమంటపై మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత తిప్పి, మరికాసేపు ఉడికించాలి. చట్నీతో తింటుంటే ఇవి రుచిగా ఉంటాయి. పండుగ రోజున పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
కడా ప్రసాద్
కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి- కప్పు, పంచదార- కప్పు, నెయ్యి- కప్పు, మంచినీళ్లు- 3 కప్పులు
తయారుచేసే విధానం :
పాన్‌లో పంచదార వేసి, అందులో నీళ్లుపోసి, మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
అది మరిగే సమయంలో మరో మందపాటి పాన్ పెట్టి, నెయ్యి వేయాలి.
అది కరిగిన తర్వాత గోధుమపిండి వేసి ఉండలు కట్టకుండా వేయించాలి. పిండి రంగు మారి మంచివాసన రానివ్వాలి.
తర్వాత పాకాన్ని రెండు భాగాలుగా చేసి, ముందుగా ఓ భాగాన్ని గోధుమపిండిలో వేసి కలపాలి.
అది బాగా కలిసి బుడగలు వచ్చాక రెండో భాగాన్నీ కలిపి, హల్వాలోంచి నెయ్యి బయటకు వచ్చేవరకూ తిప్పుతూ ఉడికించాలి.
దగ్గరగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. అంతే కడా ప్రసాద్ రెసిపీ రెడీ.
పెసరపప్పు స్వీట్
కావాల్సిన పదార్థాలు :
పెసరపప్పు- 100గ్రా, ఉప్మారవ్వ- 100గ్రా, నెయ్యి- స్పూను, పంచదార- 200గ్రా, నూనె- డీఫ్రైకి సరిపడినంత, యాలకుల పొడి- అరస్పూను, పాలు- 200 ఎమ్‌ఎల్ (కాచి చల్లార్చినవి).
తయారుచేసే విధానం :
ముందుగా పాన్ తీసుకొని అందులో పెసరపప్పు వేసి కలర్ మారే వరకూ వేయించుకోవాలి.
తర్వాత వాటిని కడిగి గిన్నెలో పెట్టుకోవాలి.
తర్వాత అదే పాన్‌లో వంద గ్రాముల పాలు, కొంచెం నీళ్లు, కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి, తక్కువ మంటలో మూతపెట్టి ఉడకనివ్వాలి.
పాలు ఇంకిపోయి, పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో మెత్తగా వేసుకోవాలి.
మరోసారి పాన్‌లో మిగిలిన పాలు పోసుకొని, ఉప్మారవ్వ వేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ తక్కువమంట మీద ఉడకనివ్వాలి.
రవ్వ బాగా ఉడికిన తర్వాత నెయ్యివేసి, బాగా కలియతిప్పుతుండాలి. అందులోనే మిక్సీ వేసి పెట్టుకున్న పెసరపప్పును వేసి, బాగా కలుపుకోవాలి.
తర్వాత స్టవ్ ఆపి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. దానిని చిన్నచిన్న ఉండలుగా కట్టి, చేతిలోనే మందంగా వడలలాగా రౌండ్‌గా ఒత్తుకోవాలి. దానిమీద ఫోర్క్‌తో లేదా చిన్న పుల్లతో క్రాస్‌గా గీతలు గీసుకోవాలి.
పాన్ తీసుకొని అందులో నూనె వేసి, అది వేడక్కాక మనం తయారుచేసుకున్న వాటిని ఎక్కువమంట మీద నూనెలో వేసి, బంగారు వర్ణం వచ్చేవరకు వేయించుకొని, పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో చక్కెర వేసి, అంతకు రెట్టింపు నీటిని పోసి, కొంచెం పాకం వచ్చేవరకు ఉంచి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
తర్వాత పెసరపప్పు వడలను ఆ పాకంలో రెండు, మూడు గంటలు నానబెట్టాలి. అంతే పెసరపప్పు స్వీట్ రెడీ.