ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లకు నెలకు రూ.26 వేలకు వేతనం పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న కోరారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్.గోపాల్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లుగా 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వీరికి కనీస వేతనం ఇవ్వకుండా నెలకు కేవలం రూ.4 వేలు ఇస్తూ ప్రభుత్వం వెట్టిచాకిరి చేసుకుంటోందని విమర్శించారు. ఇది కూడా 3, 4 నెలలకోసారి ఇస్తున్నారని తెలిపారు. కొంతమందికి ఇప్పటికీ ఆర్డర్ ఫారాలు ఇవ్వలేదన్నారు. స్వీపర్ల అకౌంట్‌లోకి నేరుగా నెలకు వేతనం వేయాలని, ఇప్పుడు ప్రధానోపాధ్యాయుల ఖాతాకు జమ చేయడం వల్ల సకాలంలో ఇవ్వడం లేదన్నారు. అధ్యక్షులు వైపి.ఈరమ్మ, కార్యదర్శి విజయలక్ష్మి, కోశాధికారి ఎం.రాజేశ్వరి పాల్గొన్నారు.