మాట్లాడుతున్న కలెక్టర్
స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు
ప్రజాశక్తి-నెల్లూరు:ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తప్పోప్పులకు తావులేని స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారుచేయాలనే సదాశయంతో పూర్తి పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ యం హరినారాయణన్ తెలిపారు.బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ హాల్లో ఇంటింటి ఓటర్ సర్వే ప్రక్రియ గురించి గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారంతపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి బుధవారం జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లాలో 65 శాతం పూర్తయిందన్నారు. ఎన్నికల కమీషన్ నిర్దేశించిన గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగవైకల్య%శీ% 40 శాతం కన్నా అధికంగా ఉన్న దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే ఓటు వేసే సౌలభ్యమున్నందున, అటువంటి వారిని వారి ఆమోదంతో ఓటరు జాబితాలో ప్రత్యేకంగా మార్కు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మరణించిన వారి విషయంలో ఫారం 7 ద్వారా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లయితే, ఆయా దరఖాస్తులను జవాబుదారీతనంతో పరిష్కరించుటకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తప్పోప్పులకు తావులేని స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారుచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం చేపట్టి ఎన్నికల అధికారులకు సహకరించాల్సిందిగా కోరారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాధ్ , డిప్యుటీ కలెక్టర్ పద్మావతి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజరు కుమార్ రెడ్డి, టి డి పి తరఫున షేక్ సుభాన్ భాషా, సి పి ఐ (యం ) నుంచి దయాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి బాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










