స్వచ్ఛభారత్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి : సిఐటియు
ప్రజాశక్తి - ఆత్మకూర్
పెండింగ్‌లో ఉన్న స్వచ్ఛభారత్ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం, ఆత్మకూరు పట్టణ సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఎం రజాక్, రామ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చెత్తాచెదారాన్ని, మురుగు కాల్వలు శుభ్రం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా చేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు పది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒకపక్క రోజురోజుకు ధరలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే ఇచ్చే అతి తక్కువ వేతనాలు నెలనెలా సక్రమంగా రాక కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సర్పంచి, జిల్లా అధికారుల చుట్టూ తిరిగిన ఏమాత్రం ఫలితం లేదు అన్నారు. మూడు సంవత్సరాల క్రితం రూ.10000 జీతం ఇస్తామంటూ జీవో నెంబర్ 680 వచ్చినా నేటికీ అమలు కావడం లేదని అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేని యెడల జిల్లా వ్యాప్తంగా కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.










