స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి : సిఐటియు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
గ్రామాలను శుభ్రం చేస్తూ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండ సేవలు అందిస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛభారత్ కార్మికుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం డిఆర్‌ఒ పుల్లయ్యకు సమస్యల వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, స్వచ్చ భారత్ కార్మికుల సంఘం నాయకులు సుబ్బరాయుడు, దేవదాసులు మాట్లాడుతూ ఏడు నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్మికులపై నేటికీ రాజకీయ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రెండు సంవత్సరాల క్రితం వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 680 ప్రభుత్వం జారీ చేసిందని, నేటికీ ఆ జీవో ప్రకారం పది వేల వేతనం అమలు కావడం లేదని విమర్శించారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, సబ్బులు, నూనె, యూనిఫారం, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దేవదాసు, సుభద్రమ్మ, ప్రసాద్, నాగన్న, హనుమంతు, త్యాగరాజు, స్వచ్ఛభారత్ కార్మికులు పాల్గొన్నారు.











