Jul 03,2023 19:28

ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న స్వచ్ఛభారత్‌ కార్మికులకు 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి అశోక్‌, వ్యకాస మండల ఉపాధ్యక్షులు యూసుఫ్‌ బాష డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ముందు స్వచ్ఛభారత్‌ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఐటియు మండల అధ్యక్షులు పాండు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్‌ కార్మికులకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 8 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని, ఏం తినాలని ప్రశ్నించారు. పచ్చదనం, పరిశుభ్రత అనే గొప్ప, గొప్ప మాటలు చెప్పే పాలకులు క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు. స్వచ్ఛభారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, నెలనెలా జీతాలు ఇచ్చే పద్ధతిని తీసుకురావాలని కోరారు. కార్మికులకు బట్టలు, నూనెలు, సబ్బులు, పిఎఫ్‌ సౌకర్యం, ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్వచ్ఛభారత్‌ కార్మికులు శాంతి రాజు, ఏసోబు పాల్గొన్నారు.