ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్వచ్ఛభారత్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలోని డిపిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటియు సజ్జరాయప్ప, పైపల్లి గంగాద్రి, బ్యాళ్ల అంజి, సిద్దు, బాబావాలి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు డిపిఒ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య మాట్లాడుతూ కార్మికులకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, హైకోర్టు తీర్పును వెంటనే శ్రీ సత్యసాయి జిల్లాలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు రామచంద్ర, ఆదిమూర్తి, సుధామణి, ఆదినారాయణప్ప, నరసింహ, స్వచ్ఛభారత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










