Mar 14,2023 23:20

స్వచ్ఛ సంకల్పంపై అవగాహన కల్పిస్తున్న జోనల్‌ కమిషనర్‌ సింహాచలం

ప్రజాశక్తి -గాజువాక : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ ప్రథమ స్థానంలో నిలవడానికి గాజువాక ప్రజలు సహకరించాలని జోనల్‌ కమిషనర్‌ పి.సింహాచలం కోరారు. జీవీఎంసీ 79వ వార్డు పరిధి అగనంపూడి జాతీయ రహదారి నుంచి విఎస్‌జిహెచ్‌ రోడ్డులో ఉన్న బ్లూ ఎవిన్‌ అభిరామ్‌ అపార్ట్‌మెంట్స్‌లో జీవీఎంసీ ఆధ్వర్యాన స్వచ్ఛ సంకల్పంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్‌ కమిషనర్‌ పి.సింహాచలం మాట్లాడుతూ, నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 24వ స్థానం నుంచి 4వ స్థానానికి రావడంలో నగర ప్రజల కృషి ఎనలేదన్నారు. విశాఖ నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన 90 శాతం నివారించగలిగామని చెప్పారు. ప్లాస్టిక్‌ నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. షాపులో ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులుగా గన్ని బ్యాగ్స్‌ వాడాలని కోరారు. ఇళ్ల వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీల కాలుష్యంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్టుకు లేఖ రాస్తామని తెలిపారు. ఆస్తి, చెత్త, నీటి పన్నులు సకాలంలో కట్టి కార్పొరేషన్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కాలవలు సరిగా లేవని, మురుగు నీరు నిల్వ చేరి పందులు, కుక్కలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపారు. డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. గాజువాక జోన్‌ ఎఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ, పరిశుభ్రతలో అభిరామ్‌ అపార్ట్‌మెంట్‌ ఆదర్శంగా ఉంటుందన్నారు. ఏడిసీ చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, విలీన గ్రామాల అభివృద్ధికి జీవీఎంసీ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు.
బ్లూ ఎవిన్‌ అభిరామ్‌ అపార్ట్‌మెంట్స్‌ నివాసుల సంక్షేమ సంఘం గౌరవ కార్యదర్శి ఎన్‌.చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో 79వ వార్డు టిడిపి కార్యదర్శి బొబ్బరి సూర్య, టిడిపి బీసీ సెల్‌ అధ్యక్షులు సింగిడి సింహాచలం, 6వ జోన్‌ ఎస్‌ఎస్‌ బివి.రామారావు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ టి.నగేష్‌ పాల్గొన్నారు.