Jul 24,2023 22:14

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జగనన్న కు చెబుదాం కార్యక్రమం అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్‌ గోడ పత్రికను విడుదలచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌, ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుధ్య, పరిశుభ్రత సర్వే అని, పట్టణాలు, నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంలో, పౌరులకు వారి సేవలు మెరుగుపరచడానికి, పరిశుభ్రమైన నగరాలను రూపొందించడంలో ఇది కీలకమైనది అన్నారు. మరుగుదొడ్డిలో కాకుండా బహిరంగ వాతావరణంలో మలవిసర్జన చేయడం మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై ప్రజలకు అవగాహనా కల్పించాలని ఆయన తెలిపారు. సంపూర్ణ స్వచ్ఛత వైపు అడుగు వేద్దామని, మన గ్రామాన్ని, జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చుకుందామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జెసి ఆర్‌.గోవిందరావు, డిపిఒ బి.సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు, డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు.