ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ప్రథమ స్థానమే లక్ష్యంగా నగర ప్రజల సహకారంతో సాధిస్తామని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. ఆర్‌కె.బీచ్ కాళీమాత గుడి నుంచి సబ్‌మెరైన్ వరకు 1కె వాక్‌ను జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌తో కలిసి ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశంలోనే విశాఖ నాలుగవ స్థానం సాధించిందని,ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చి విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే నగర స్వచ్ఛతకు జివిఎంసి యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకుకు కృషి చేయాలని కోరారు. విశాఖ నగరాన్ని పరిశుభ్రత నగరంగా తీర్చిదిద్దేందుకు ''ఇకో-వైజాగ్'' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రజల అవగాహన కోసం 1కె వాక్ ప్రారంభించినట్లు చెప్పారు. విశాఖ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన అమల్లో ఉందని, అయినా కొంతమంది వ్యాపారస్తులు తక్కువ ధరకే దొరుకుతుందని ఆ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామని, నిషేధిత ప్లాస్టిక్ కలిగి ఉన్న దుకాణదారుల నుంచి భారీ స్థాయిలో అపరాధ రుసుం వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జివిఎంసి కమిషనర్ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో అందరి సహకారంతో విశాఖ నగరానికి మొదటి ర్యాంకు సాధిద్దామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ''ఇకో-వైజాగ్'' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 1 కె వాక్ ద్వారా స్వచ్ఛత, పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు, డిసిఆర్ ఫణిరామ్, కార్యదర్శి నల్లనయ్య, జోనల్ కమిషనర్లు, ఎఎంఒహెచ్, స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు, నగర పౌరులు తదితరులు పాల్గొన్నారు.










