ప్రజాశక్తి - బాపట్ల రూరల్
మండలంలోని సూర్యలంక సముద్ర తీరంలో అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం శనివారం నిర్వహించారు. సముద్రతీరంలో ఇన్కయిస్ సంస్థ ఆధ్వర్యంలో సముద్ర తీరాన వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మత్స్యకారులను ఉద్దేశించి మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగాని అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 37బీచ్‌లలో ఈ దినోత్సవం జరుగుతుందని అన్నారు. సముద్ర యాప్ గురించి మత్స్యకారులకు వివరించారు. ఈ యాప్‌లో సముద్ర పర్యావరణం, సముద్ర తీరంలో చేపలు పట్టడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి సమాచారం ఇవ్వటం, పగడపు దీవుల్లో ఉష్ణోగ్రతను పరిశీలించి ఫ్లోరల్ బ్లీచింగ్ ప్రభావాన్ని విస్తరించే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తుందన్నారు. సముద్ర జలాల్లో విషపూరిత నాచులు గుర్తించి, పర్యవేక్షిస్తుందన్నారు. కార్యక్రమంలో ఇన్కయిస్ సంస్థ నుండి సైంటిస్ట్ ఆర్ వెంకట శేషు, జి వెంకట సాయి పాల్గొన్నారు.










