ప్రజాశక్తి-గుంటూరు : స్వచ్ఛ గుంటూరు సాధన ప్రతి ఒక్కరి భాధ్యతని, నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. బుధవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో ప్రజారోగ్య విభాగం, ఇంజినీరింగ్, శానిటేషన్ కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్స్‌లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని, కార్మికులు, శానిటేషన్ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మరింత భాద్యతగా విధులు నిర్వహిస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి మెరుగైన ర్యాంకు రావటం పెద్ద కష్టం కాదని అన్నారు. ఆస్తిపన్ను మ్యాపింగ్ రెండ్రోజుల్లో పూర్తి చేయాలని, ప్రతి షాప్ డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, వ్యర్ధాలను రోడ్లపై, కాల్వల్లో వేసే షాప్స్ సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా కార్మికులను కేటాయించాలన్నారు. 2023 స్వచ్చ సర్వేక్షణ్‌లో గుంటూరు నగరం మెరుగైన ర్యాంక్ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్పందన అర్జీలు, ట్రేడ్ లైసెన్స్‌లు మంజూరు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో తొలుత ఇటీవల మరణించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ దౌలాకి కమిషనర్, ఇతర అధికారులు నివాళులర్పించారు. సమావేశంలో ఎంహెచ్‌ఒ డాక్టర్‌భాను ప్రకాష్, ఎస్‌ఇ భాస్కర్, ఇఇ కొండారెడ్డి పాల్గొన్నారు.










