జాతీయోద్యమంలో భాగస్వామ్యానికి సంబంధించి హిందూత్వ జాతీయవాదులకు అనేక మినహాయింపులు వున్నాయి. అనేక సందర్భాలలో వారు జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. లేదా బ్రిటిష్ వారికి సహకరించారు. సావర్కర్ తన అండమాన్ రోజులకు ముందు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. విడుదల కావడం కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారికి క్షమాపణ తెలిపాడో అప్పటి నుండి ఏనాడూ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో భాగస్వామి కాలేదు. బ్రిటిష్ వారికి కావలసిన సైన్యాన్ని రిక్రూట్ చేస్తూ, బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతునిచ్చాడు.
అధికారంలో ఉన్న బిజెపి కి మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆ సంస్థ... జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిందని నిరూపించడం కోసం ఆ భావజాలం ఉన్న అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం గలవారిలో ముఖ్యుడు, ప్రస్తుత రాజ్యసభలో బిజెపి ఎం.పి రాకేష్ సిన్హా కూడా అదే పనిలో వున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం వల్లనే ఆ ఉద్యమం ఉత్తేజభరితంగా సాగిందని పేర్కొంటున్నాడా పెద్ద మనిషి. ఇంకా అనేక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. స్వాతంత్రోద్యమం ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ భాగస్వామిగా కొనసాగిందని సి.కె. సాజి నారాయణ్ లాంటి ఆర్‌ఎస్‌ఎస్ నేతలు చెప్తారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో, ఇలాంటి చర్చ మరొకసారి ముందుకు వచ్చింది. ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడూ పాల్గొన లేదని, కేవలం 'భారత్ మాతాకీ జై' అని జపించినంత మాత్రాన వారు దేశభక్తులు కాబోరని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలో శిక్షణ పొందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం...థాకరే ప్రకటనకు స్పందిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడైన డా|| కె.బి హెడ్గేవార్ స్వాతంత్య్ర సమర యోధుడని తెలిపాడు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటం మహాత్మా గాంధీ నాయకత్వంలో, సమాజం లోని సమస్త ప్రజల సహకారంతో, భాష మత పరమైన అవరోధాలను అధిగమించి, భారతదేశ అత్యధిక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. మతపరమైన జాతీయతలు ఎజెండాగా వున్న మతపరమైన సమూహాలు, ఈ జాతీయోద్యమానికి దూరంగా ఉన్నాయి. ఇతరుల జాతీయ వాదాన్ని వ్యతిరేకించడం కోసం బ్రిటీష్ వారికి సహకరించాలని నిర్ణయించుకున్నాయి.
జాతీయోద్యమంలో భాగస్వామ్యానికి సంబంధించి హిందూత్వ జాతీయవాదులకు అనేక మినహాయింపులు వున్నాయి. అనేక సందర్భాలలో వారు జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. లేదా బ్రిటిష్ వారికి సహకరించారు. సావర్కర్ తన అండమాన్ రోజులకు ముందు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. విడుదల కావడం కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారికి క్షమాపణ తెలిపాడో అప్పటి నుండి ఏనాడూ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో భాగస్వామి కాలేదు. బ్రిటిష్ వారికి కావలసిన సైన్యాన్ని రిక్రూట్ చేస్తూ, బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతునిచ్చాడు. ఈ కాలంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి సుభాష్ చంద్రబోస్ 'అజాద్ హింద్ ఫౌజు'ను స్థాపించాడు.
ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్వాతంత్య్ర సమరయోధుడని ఫడ్నవిస్ అనడంలో పాక్షిక సత్యమే ఉన్నది. 1925లో ఆర్‌ఎస్‌ఎస్ ను స్థాపించిన తరువాత రెండు సందర్భాలలో మాత్రమే జాతీయ ఉద్యమంలో పాక్షికంగా భాగస్వామి అయ్యాడు. ఈ రెండు సందర్భాలలోనూ ఆయన భారత జాతీయ ఉద్యమంతో స్పష్టంగా విభేదించాడు.
ప్రతి జనవరి 26వ తేదీన మువ్వన్నెల జెండాలను బహిరంగంగా ఎగురవేయాలని 1929లో లాహోర్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. హెడ్గేవార్ ఆ పిలుపును అనుసరించకుండా తిరస్కరించాడు. దీనికి బదులుగా 1930 జనవరి 21న ఆర్‌ఎస్‌ఎస్ శాఖలన్నిటికి కాషాయ జెండాను పూజించాల్సిందిగా ఆదేశాలు పంపాడని సంసుల్ ఇస్లామ్ పేర్కొన్నాడు. కాబట్టి విధానపరంగా భిన్నాభిప్రాయం స్పష్టంగా ఉన్నప్పటికీ జనవరి 26వ తేదీని సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహించేందుకు పాక్షికంగా మాత్రమే సహకరించాడు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే జాతీయ పిలుపుకు బదులుగా, హిందూ జాతీయవాదానికి చిహ్నమైన కాషాయ జెండాలు ఎగురవేశారు.
డాక్టర్ హెడ్గేవార్ 1930లో సహాయ నిరాకరణోద్యమంలో భాగస్వామి కావడం వాస్తవమే. అయితే ఒక సంస్థగా ఈ ఉద్యమానికి దూరంగా ఉండాల్సిందిగా ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశించినట్లు స్పష్టమవుతుంది. హెడ్గేవార్ తన వ్యక్తిగత హోదాలో ఆ ఉద్యమంలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఇందువల్ల స్నేహితుడు, సహచరుడు అయిన డాక్టర్ పరంజపే కి...తన సర్ సంఫ్‌ు చాలక్ (సుప్రీం చీఫ్) పదవిని, బాధ్యతలను జైలులో ఉన్నంతవరకు అప్పగించానని చెప్పాడు.
బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమం నడుస్తున్న సమయంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్...బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం గమనిస్తాము. తమ రోజువారీ పనిలో నిమగం కావాలని, బ్రిటిష్ వారికి ఆగ్రహం కల్గించే ఏ కార్యక్రమాన్ని చేపట్టవద్దని గోల్వాల్కర్ ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను ఆదేశించాడు. 'గురూజీ సమగ్ర దర్శన్' (సంపుటి 4, పేజీ 39)లో ఆయన ఇలా పేర్కొన్నాడు. ''దేశంలో క్షణక్షణం మారుతున్న పరిస్థితులను బట్టి మనసులో అశాంతి, అలజడి చెలరేగుతుంది. అలాంటి అశాంతి 1942 లో ఉంది. దానికి ముందు 1930- 31లో ఉద్యమం ఉంది. ఆ సమయంలో పలువురు డాక్టర్జీ (హెడ్గేవార్)ని కలిశారు. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి దారితీస్తుందని, సంఫ్‌ు ఈ విషయంలో వెనుక పడకూడదని బృందంగా వెళ్లినవారు డాక్టర్జీకి విన్నవించుకున్నారు. ఆ సమయంలో బృంద సభ్యుల్లో ఒకరు తాను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తారు. డాక్టర్జీ మాట్లాడుతూ తప్పనిసరిగా వెళ్ళమంటూనే, జైలుకు వెళ్లే సమయంలో అతని కుటుంబ బాధ్యత ఎవరు స్వీకరిస్తారని అడిగాడు. ఆ పెద్దమనిషి సమాధానమిస్తూ తాను తన కుటుంబానికి తగినట్లుగా అవసరమైన వనరులను సమకూర్చానని, కేవలం కుటుంబ అవసరాలకే కాక, ఇతర అవసరాలకు అనుగుణంగా, అవసరమైతే జరిమానాలు చెల్లించడానికి కూడా వనరులను సమకూర్చానని చెప్తాడు. పూర్తి వనరులను తన కుటుంబానికి సమకూర్చినట్లయితే రెండు సంవత్సరాలు సంఫ్‌ు కోసం పని చేయమని డాక్టర్జీ అతనికి సలహా ఇచ్చాడు. ఆ పెద్దమనిషి తన ఇంటికి వెళ్ళిన తరువాత జైలుకు వెళ్లడంగాని, సంఫ్‌ు కోసం పని చేసేందుకు ముందుకు రావడంగానీ జరగలేదు''.
గోల్వాల్కర్ 'పాంచజన్యం' గ్రంథంలో స్వాతంత్య్ర పోరాటాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ''ప్రాంతీయ జాతీయవాదంగా'' పేర్కొన్నాడు. ''ఇది నిజమైన హిందూ దేశ నిర్మాణానికి అనుకూలమైన, ఉత్తేజపూరితమైన హిందూ దేశాన్ని నిర్మించుకోవడంలో ఆటంకమైంది'' అంటాడు.
బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆర్‌ఎస్‌ఎస్ కు మిలటరీ కవాతు, యూనిఫామ్ ఉండాలని గోల్వాల్కర్ ఆదేశించాడు. ''చట్టం పరిధిలో మన పని మనం చేసుకోవాలి'' అంటూ 1943 ఏప్రిల్ 29న ఒక సర్క్యులర్‌ను జారీ చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఒకటిన్నర సంవత్సరాల తరువాత, బ్రిటిష్ రాజ్యంలోని బాంబే ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తంచేసింది. సంఫ్‌ు ఎంతో మెలుకువగా, జాగ్రత్తగా తనను తాను చట్టపరిధిలో ఇముడ్చుకుందని... ప్రత్యేకంగా 1942 ఆగస్టులో చోటుచేసుకున్న అల్లర్లకు దూరంగా ఉందని ఒక మెమోలో తెలిపింది.
ఇక, 1998 ఎన్నికల సందర్భంలో తాను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్లు వాజ్‌పేయి ప్రకటన చేశారు. ఆ విషయాన్ని పరిశీలించినప్పుడు, తన స్వస్థలమైన బటేశ్వర్‌లో జరిగిన ప్రదర్శనల్లో వాజ్‌పేయి ఒక ప్రేక్షకుడు మాత్రమేనని తేలింది. పోలీసుల లాఠీచార్జీ సమయంలో వాజ్‌పేయి వారిని అనుసరించాడు. పోలీసులు ఉద్యమకారులను నిర్బంధించారు. వాజపేయి చెప్పిన ప్రకారం తను కూడా అరెస్టయ్యాడు. వెంటనే క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశాడు. ఉద్యమకారులకు తనకు ఏవిధమైన సంబంధం లేదని పేర్కొనడమేగాక, ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి పేర్లను కూడా రాసిచ్చాడు.
హిందూ రాష్ట్ర సాధనే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం. వారి ప్రస్తుత ప్రయత్నాలన్నీ భారత స్వాతంత్రోద్యమంలో భాగస్వాములమనే భావన కల్పించడానికే. ఇదంతా ఎన్నికల ప్రయోజనం కోసమే తప్ప, వాస్తవానికి సత్యదూరమైనది.
(రచయిత బయోమెడికల్ ఇంజినీరింగ్ విశ్రాంత ఆచార్యుడు)
రామ్ పునియాని











