Jul 27,2022 22:56

సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్‌ జాదవ్‌

ప్రజాశక్తి -గాజువాక : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికవర్గాన్ని, ప్రభుత్వ రంగసంస్థలను సర్వనాశనం చేయాలని చూస్తోందని. ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు మనోహర్‌ జాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యలను తిప్పికొట్టాలంటే స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బుధవారం గాజువాకలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జాదవ్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 40 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చేసిన ప్రభుత్వం, కార్మికులు, పెన్షనర్స్‌పై మరింత దాడి చేసే అవకాశం ఉందని, దీన్ని సమైక్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు.
అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అజరుకుమార్‌ మాట్లాడుతూ, కార్పొరేట్లు, బడా కంపెనీలకు లక్షల కోట్లు తాయిలాలు ఇస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, కార్మికులు, పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తోందని, దీన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. మరో పాతికేళ్లు ఆగితే స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుందే తప్ప, పాలకుల విధానాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఒకవైపు ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరిపి ప్రజలకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు. పబ్లిక్‌ సెక్టార్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే, వాటికి, కార్మికులకు ప్రయోజనకరమన్నారు. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యలపై వచ్చేనెల 25న పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబర్‌లో ఢిల్లీలో పెన్షనర్ల ధర్నా విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హయ్యర్‌ పెన్షన్‌ అమలు చేసి, కనీస పెన్షన్‌ నెలకు రూ.9వేలు చెల్లించాలని, కరువు భత్యం చెల్లింపు, వైద్య సదుపాయాలను కల్పించాలని కోరారు. అనంతరం అధ్యక్షునిగా దీనబంధు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కె.హుస్సేన్‌తో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జె కోటేశ్వరరావు , ఉపాధ్యక్షుడు వర్మ, జిల్లా గౌరవాధ్యక్షులు బిటి మూర్తి పాల్గొన్నారు.