Aug 14,2023 21:12

నాగావళి నదిలో తెప్పపై బాలికను తరలిస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  స్వాతంత్య్ర వచ్చెననీ సభలేచేసి సంబర పడగానే సరిపోదోయీ.... అన్నాడు మహా కవి శ్రీశ్రీ. సాధించినదానికి సంతృప్తి చెంది... అదే విజయమనుకుంటే సరిపోదోయి... అని కూడా హెచ్చరించాడు. అచ్చంగా ఆ పాటను గుర్తుచేస్తోంది నేటి సమాజం. ఈ విషయంలో మన జిల్లాలో పరిస్థితులూ తీసిపోలేదు. ఏటా స్వాతంత్య్ర వేడుకల హంగామా తప్ప, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి, అంతరాలను అంతమొందించేందుకు తగినంతగా కృషి జరగడం లేదు. శ్రీశ్రీ తన పాటలో చెప్పినట్టు కులమత, భేదాలు, వ్యక్తిగత స్వార్థ రాజకీయాలే ఇందుకు కారణం. ఫలితంగా జిల్లాలో జీవన ప్రమాణాలు పెరగడం లేదు. స్వాతత్య్రం వచ్చి 76ఏళ్లు కావచ్చినా ఇప్పటికీ చదువును కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అక్షరాస్యతలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అనేక గ్రామాలకు ఇప్పటికీ రహదారులు లేవు. ఇదే కారణంతో కొమరాడ మండలం చోళ్లపదం పంచాయతీ, రెబ్బ గ్రామానికి చెందిన కోలక సోమయ్య తమ కుమార్తెను బతికించుకునేందుకు కోసం వెదురు కర్రలతో తయారుచేసిన నావపై నాగావళి నది దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ ఒక్క గ్రామమే కాదు. పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం చేపట్టకపోడంతో సుమారు 15గ్రామాల ప్రజానీకం ఆపదలోనూ దవాఖానాలకు వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. అటు సాలూరు మండలంలోని కొఠియా ప్రాంతంలోనూ ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి. ఓటు కార్డులు తప్ప, రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులకు నోచుకోని కుటుంబాలెన్నో... వీరికి విద్య, వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఇప్పటికీ పసరమందులే దిక్కుగా మారింది. ఇక రక్తహీనతతో తల్లీపిల్లల మరణాలు ఇటీవల ఎక్కువయ్యాయని అధికారుల సమీక్షలోనే ఇటీవల బయటపడింది. ఇప్పటికీ అంటరాని తనం, రెండు గ్లాసుల పద్ధతి అక్కడకక్కడా కనిపిస్తోంది. 76ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో కొన్ని సామాజికవర్గాలు, పేదలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ విధానాల కారణంగా గతం కన్నా దోపిడీ, అవినీతి పెరింగింది. మరోవైపు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల పెరిగిన టమాటా ధరలే ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇంకోవైపు నిరుద్యోగం పెరిగింది. వయసు మీరుతున్నా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చదువుకున్నవారి పరిస్థితి సైతం దుర్భరంగా మారుతోంది. ఇటీవల కాలంలో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడమే ఇందుకు నిదర్శనం.

  రోడ్డు సౌకర్యం లేక డోలీ కట్టి రోగిని కిందికి తీసుకొస్తున్న మారిక గిరిజనులు
 రోడ్డు సౌకర్యం లేక డోలీ కట్టి రోగిని కిందికి తీసుకొస్తున్న మారిక గిరిజనులు

ఇలా స్వాతంత్య్ర అనంతరం జిల్లా అభివృద్ధి చెందినప్పటికీ 76ఏళ్లకు తగ్గట్టు లేదనేది ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయ కాముకుల వాదన. సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాట పటిమను, వీరుల త్యాగఫలాన్ని విస్మరిస్తూ కేవలం సభలు చేసి సంబర పడడంతో సరిపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశ్రీ అన్నట్టు సాధిచిన దానితో సంతృప్తి చెంద కుండా, అదే విజయమనుకుంటే సరిపెట్టుకోకుండా ప్రగతి దారులకై... సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా... సకల జనుల సౌభాగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.