జాతీయోద్యమంలో ఆరెస్సెస్ కాని హిందూత్వ శక్తులు కాని ఎక్కడా పాల్గొనలేదు సరికదా వీలైన అన్ని సందర్భాలలోనూ బ్రిటిష్ పాలకుల ఏజెంట్లుగానే వ్యవహరించారు. చివరకు జాతిపితనే బలిగొన్నారు. ఆనాడు జాతీయోద్యమానికి ద్రోహం చేసిన ఈ శక్తులు నేడు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.... సామాన్యుడి చిరునవ్వుకు గ్యారంటీ అడిగాడు శ్రీశ్రీ. కాని ఈ మోడీ ప్రభుత్వం కరోనా బాధితులకు ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోయింది. కరోనా కష్ట కాలంలో సైతం అటు కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడం ఆపలేదు. ఇటు తన మత విద్వేష ఎజెండాను
అమలు చేయడం మానలేదు.
''ఇది నా స్వాతంత్య్ర దిన/ మహా సంకల్పం/ విధిగా వికసించే/ చరిత్రకొక కృతజ్ఞత/ ప్రజలకు నివాళి'' అంటూ మహాకవి శ్రీశ్రీ 1947 సెప్టెంబరులో ఆకాశవాణి కోసం 'మహా సంకల్పం' అన్న కవిత రాశారు. అందులో కొత్తగా అధికారాన్ని స్వీకరించిన పాలకులకు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించాడాయన.
''అతణ్ణి జాగ్రత్తగా చూడండి/ స్వతంత్ర భారత పౌరుడు/ అతని బాధ్యత వహిస్తామని/ అందరూ హామీ ఇవ్వండి/ అతని యోగ క్షేమాలకు/ అంతా పూచీ పడండి/ అతికించండి మళ్ళీ/ అతని ముఖానికి నవ్వు''.
దేశానికి వచ్చిన స్వాతంత్య్రం సామాన్యుడి వరకూ రావాలని, సామాన్య ప్రజల యోగక్షేమాలను పరిరక్షించడం స్వతంత్ర భారత ప్రభుత్వపు ప్రధాన కర్తవ్యంగా ఉండాలని శ్రీశ్రీ స్పష్టం చేశాడు.
నిజానికి ఇది ఒక్క శ్రీశ్రీ అభిప్రాయం మాత్రమే కాదు. జాతీయోద్యమంలో పాల్గొన్న కోట్లాది సామాన్య భారతీయులది. కోట్లాది మంది రైతులు, కార్మికులు, చేతివృత్తిదారులు, ఉపాధ్యాయులు, మేధావులు, యువజనులు, మహిళలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు, తీర్మానాలకు, విజ్ఞప్తులకు, రాయబారాలకు పరిమితం అయిన ఉద్యమానికి జవసత్వాలు కల్పించారు. దాంతో జాతీయోద్యమం నిజమైన ప్రజా ఉద్యమంగా పరిణితి చెందింది. బ్రిటిష్ వలసపాలకుల పునాదులను కదిలించింది. ఈ సామాన్య ప్రజలంతా జాతీయోద్యమంలో పాల్గొన్నది కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి మాత్రమే అనుకుంటే పొరపాటు. ప్రతీ సామాన్య పౌరుడికీ స్వేచ్ఛాయుతమైన, పరిపూర్ణమైన జీవితం సాధించడానికే వారంతా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే తమ కలలు నెరవేరతాయని వారంతా ఆశించారు.
1945లో ఫాసిస్టు హిట్లర్ మూకలు సోవియట్ ఎర్ర సైన్యం చేతుల్లో మట్టి కరిచాయి. ప్రపంచవ్యాప్తంగా జాతీయ విమోచనోద్యమాలు వెల్లువెత్తాయి. ఈ అంతర్జాతీయ నేపథ్యంలో మన దేశంలో పెల్లుబుకుతున్న ప్రజా వెల్లువను తట్టుకోలేమని గ్రహించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం అప్పటి ప్రధాన బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ముస్లిం లీగు నాయకులతో రాజీ కుదుర్చుకుంది. దాని పర్యవసానంగా దేశ విభజన జరిగింది. అధికారం బడా బూర్జువా వర్గం నాయకత్వం లోని పాలక వర్గం చేతుల్లోకి మారింది. ఏ భూస్వామ్య, ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా అశేష రైతాంగం పోరాడారో, ఆ భూస్వాములు ఈ పాలకవర్గంలో భాగస్వాములయ్యారు. ప్రజలు ఆశించిన స్వాతంత్య్రం వేరు, వచ్చిన స్వాతంత్య్రం స్వభావం వేరు.
దేశ విభజన జరిగిన వెంటనే దేశ వ్యాప్తంగా పలుచోట్ల మత కల్లోలాలు చెలరేగాయి. సామాన్య ప్రజలు-ఇరు మతాలవారూ-ఈ మత ఘర్షణలకు బలయ్యారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. మత సామరస్యం కోసం ఆ రోజుల్లో మహాత్మా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రజలను సామరస్యంగా మెలగమని ఉద్బోధించారు. మరోపక్క కమ్యూనిస్టులు ప్రజలకు అండగా నిలిచి మత కల్లోలాలను అదుపు చేయడానికి పూనుకున్నారు. జాతిపిత హత్య ఆ మత మారణ కాండ అధ్యాయానికి పరాకాష్ట. ఆనాడు గాంధీజీని పొట్టన పెట్టుకున్నవారి వారసులే నేడు అధికారంలో ఉండడం, ఆరెస్సెస్ కనుసన్నల్లో నడిచే బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరగడం చూస్తే జాతీయోద్యమ లక్ష్యాలకు ద్రోహం సంపూర్ణం కావస్తున్నదని మనకు బోధ పడుతుంది.
అధికారం చేపట్టిన తొలి దశాబ్దాలలో భారత పాలక వర్గం జాతీయోద్యమపు ఒరవడిని ఎంతోకొంత మేరకు కొనసాగించక తప్పలేదు. ముఖ్యంగా డా|| అంబేద్కర్ సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం ఈ ఒరవడిని చాలావరకూ ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఒక ఫెడరల్ వ్యవస్థ ఉండాలని, ఆయా రాష్ట్రాల ప్రజలకు వారివారి ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము పాలించుకునే వీలుండాలని రాజ్యాంగం అభిలషించింది. భిన్న జాతుల, భిన్న మతాల, భిన్న సంస్కృతుల సంగమంగా ఈ దేశం పరిఢవిల్లాలని రాజ్యాంగకర్తలు ఆకాంక్షించారు. అందుకే ఫెడరల్ స్వభావంతో బాటు మన దేశం లౌకిక విధానానికి కట్టుబడి వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతీ పౌరుడికీ మత స్వేచ్ఛ గ్యారంటీ చేశారు. తద్వారా మైనారిటీలకు భరోసా కల్పించారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన దేశ ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్, సభా, పత్రికా స్వాతంత్య్రాలు కల్పించింది రాజ్యాంగం. తరతరాల పీడనల నుండి, వివక్షతల నుండి, అసమానతల నుండి, వెనుకబాటుతనం నుండి, అవిద్య నుండి సమస్త పీడిత, తాడిత, దళిత వర్గాల ప్రజలకు విముక్తి కల్పించాలని ఆదేశ సూత్రాల ద్వారా రాజ్యాంగం ఆదేశించింది. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి నిర్దేశం చేసింది. ప్రధాన భారతీయ భాషలన్నింటికీ సమాన గౌరవాన్ని కల్పించింది. మన రాజ్యాంగం లోని ఈ విశిష్టతలన్నీ కేవలం ఆ రాజ్యాంగకర్తల వ్యక్తిగత ఆదర్శాల నుండి వచ్చినవి కావు. అశేష ప్రజానీకపు పోరాటాల, ఆకాంక్షల ప్రతిబింబంగా మనం మన రాజ్యాంగాన్ని చూడాలి. అనేక అంశాలలో మన రాజ్యాంగంలో లోటుపాట్లు, పరిమితులు కనిపిస్తాయి. అది వాస్తవం. ఈ విషయాన్ని స్వయంగా డా||అంబేద్కర్ ప్రకటించారు. రాజ్యాంగం ప్రజలందరికీ రాజకీయంగా సమాన హక్కును (ఓటు హక్కు) కల్పించిందని, ఆర్థికంగా సమానత్వం గనుక సాధించకపోతే, ఈ రాజకీయ హక్కు కూడా నీరుగారిపోతుందని ఆయన అన్నారు.
సామ్రాజ్యవాద దేశాల కబంధ హస్తాల నుండి బైటపడి స్వతంత్రంగా, స్వావలంబన దిశగా నడిస్తేనే తప్ప తాము నిలదొక్కుకోలేమని భారత బూర్జువా వర్గం గ్రహించింది. ఆ దిశగా చేపట్టిన చర్యలు కొన్ని సత్ఫలితాలను ఇచ్చాయి. బీమా రంగం జాతీయీకరణ, ఆ తర్వాత దశాబ్దంలో బ్యాంకుల జాతీయీకరణ, విద్యుత్, పెట్రో, రవాణా, సమాచార రంగం, ఓడరేవులు, ఉక్కు, భారీ యంత్రాల తయారీ తదితర రంగాలలో బలమైన ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పడం దేశ స్వావలంబనకు తోడ్పడింది. ప్రాంతీయ. సామాజిక అసమానతలను కొంతమేరకు తగ్గించగలిగింది. రక్షణ రంగం, అణువిద్యుత్ రంగం, అంతరిక్ష పరిశోధనా రంగం వంటి రంగాలలో కూడా మనం పురోగతి సాధించగలిగాం. ప్రపంచ స్థాయిని అందుకోదగిన ఐఐటి లు, జాతీయ పరిశోధనా సంస్ధలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హరిత విప్లవం ద్వారా దేశం ఆహార స్వయం సమృద్ధిని సాధించగలిగింది. వెనుకబడిన దళిత, గిరిజన, బలహీన వర్గాలలో కొద్ది మోతాదులోనైనా ఉన్నత విద్యను పొందగలిగారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించగలిగారు. ఈ కాలంలోనే ప్రధానంగా కమ్యూనిస్టులు చేసిన కృషి వలన భూ పంపకం ఒక ఎజెండాగా ముందుకు వచ్చింది. తద్వారా లక్షలాది పేదలు, ముఖ్యంగా దళిత, గిరిజనులు భూములను పొందగలిగారు. ఆ కమ్యూనిస్టుల పాలనలో నడిచిన ప్రభుత్వాలు చూపిన బాటలోనే ఒక మేరకు అధికార వికేంద్రీకరణ జరిగి పంచాయితీలకు, స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు బదలాయించబడ్డాయి. కార్మిక సంక్షేమ చట్టాలు కొన్ని రూపొందాయి.
1950-1980 మధ్య కాలంలో జరిగిన పై మార్పులన్నీ పాలకవర్గాలు ప్రజలపై ప్రేమ కొద్దీ చేసినవి ఎంతమాత్రమూ కాదు. కొన్ని చర్యలు సామ్రాజ్యవాదుల పట్టు నుండి బైటపడి తాము-అంటే భారత బూర్జువా వర్గం-స్వతంత్రంగా ఎదగడానికి చేసినవి అయితే, మరికొన్ని కమ్యూనిస్టుల, ప్రజల పోరాటాల వత్తిడి ఫలితంగా చేపట్టినవి. ఈ కాలంలోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాథమి హక్కులను సైతం కాలరాయడానికి ప్రయత్నించిందన్నది మరిచిపోలేము.
1985 తర్వాత టెలికాం రంగంలో కార్పొరేటీకరణ, నూతన విద్యావిధానం (1986) మొదలయ్యాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అప్పులు, వాటితోబాటు విషమ షరతులు, గ్యాట్ చర్చలు - ఇవన్నీ అంతిమంగా 1990లో నూతన ఆర్థిక విధానం పేరుతో ప్రజల మీద, వారి హక్కుల మీద, రాజ్యాంగం మీద దాడిగా మొదలయ్యాయి. ప్రైవేటీకరణ జపం మొదలైంది. దేశాన్ని అంతవరకూ సొంతకాళ్ళ మీద నిలబెట్టడానికి దోహదం చేసిన ప్రభుత్వ రంగం కాస్తా ఇప్పుడు పాలకుల దృష్టిలో గుదిబండ అయిపోయింది. స్వేచ్ఛా మార్కెట్ జపం ఊపందుకుంది. అన్ని సమస్యలనూ పరిష్కరించే శక్తి స్వేచ్ఛా మార్కెట్‌కు మాత్రమే ఉందన్న వాదనలు ప్రచారంలోకి వచ్చాయి. మీడియా ప్రైవేటీకరణ, తర్వాత అది కార్పొరేట్ల బాకాగా దిగజారడం మనం ఈ కాలంలో చూశాం. ఎన్నికల వ్యవస్థకి ఉన్న ప్రజాస్వామ్య స్వభావం పలచనైపోయింది. డబ్బుతో ఎన్నికల ఫలితాలను నియంత్రించే ప్రక్రియ జోరందుకుంది.
జాతీయోద్యమం ఫలితంగా సాధించుకున్నవన్నీ, ఒక్కొక్కటిగా ప్రజలకు దూరం అయిపోవడం ఈ నయా ఉదారవాద శకంలో గత మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. సంపదలో, ఆదాయాల్లో అసమానతలు తగ్గవలసింది పోయి ఈ కాలంలో విపరీతంగా పెరిగాయి. ఒక పక్క దేశంలో శత కోటీశ్వరుల సంఖ్య, వారి సంపద అనూహ్యంగా పెరుగుతూ పోతోంది. ఇంకో పక్క పేదరికం, ఆకలి, నిరుద్యోగం, బలహీన వర్గాలపై దాడులు విపరీతంగా పెరుగుతూ వున్నాయి. ఆహార స్వయం సమృద్ధిని సాధించగలిగిన దేశంలో ఇప్పుడు ఆకలి చావులు పెరుగుతున్నాయి. మరో పక్క రైతన్నల ఆత్మహత్యలూ అసాధారణంగా పెరిగాయి.
ఈ నయా ఉదారవాద, కార్పొరేట్ దోపిడీ పట్ల, దాని పర్యవసానంగా పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, సామాజిక అసమానతల పట్ల ప్రజలలో తలెత్తే అసంతృప్తిని, ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించి మత విద్వేష రాజకీయాల వైపు దృష్టిని మళ్ళించే హిందూత్వ శక్తులు ఈ కాలంలో బలపడడం యాదృచ్ఛికమేమీ కాదు. తమ తమ ప్రయోజనాల కోసమే ఈ మతతత్వ శక్తులకు కార్పొరేట్లు అండగా నిలిచారు. అంగబలం, అర్ధ బలం సమకూర్చారు. కార్పొరేట్ నియంత్రణలో నడిచే మీడియా గొంతు కలిపింది. అమ్ముడు పోయే మేధావులు ఎటుతిరిగీ ఉండనే వున్నారు.
ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేసినందువల్లనే ప్రజలకు కష్టాలు పెరిగాయి. అసంతృప్తీ పెరిగింది. ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకుని అధికారం చేపట్టిన బిజెపి అవే ఉదారవాద విధానాలను, మరింత వేగంగా అమలు జరుపుతోంది. దానికి ఆటంకంగా ఉన్న అన్ని వ్యవస్థలను, చట్టాలను, తుంగలో తొక్కుతోంది. ఇంకోవైపు తన మతతత్వ ఎజెండాను మరింత వేగంగా, దూకుడుగా అమలు చేస్తోంది. అమెరికాతో అంటకాగి దానికి జూనియర్ భాగస్వామిగా మన స్వతంత్ర దేశాన్ని దిగజార్చింది. సాధించుకున్న కొద్దిపాటి స్వావలంబన కాస్తా ఇప్పుడు అంతరించిపోతున్నది. చివరకు ఆహార భద్రతకు సైతం ముప్పు తేవడానికి మోడీ ప్రభుత్వం ఏ మాత్రమూ సంకోచించకుండా నల్ల వ్యవసాయ చట్టాలను చేసింది. కార్మిక చట్టాలను కాలరాసింది. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడమే గాక, ఉనికిలో ఉన్న రాష్ట్రాలను సైతం కేంద్ర పాలిత ప్రాంతాలుగా దిగజార్చడానికి వెనుకాడడం లేదు. జమ్ము-కాశ్మీర్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల కమిషన్, కాగ్, ఇ.డి, ఎన్‌ఐఎ , ఐ.టి వంటి స్వతంత్ర సంస్థల ప్రతిపత్తిని పూర్తిగా దెబ్బ తీసి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని పనిముట్లుగా మార్చివేసింది. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని తెర మీదకు తెచ్చి తన విధానాలను ప్రతిఘటించే వారందరిపైనా ప్రయోగిస్తోంది. లౌకిక విధానాలను విడనాడి ప్రజలలో కొందరిని తక్కిన వారికి శత్రువులుగా చిత్రీకరించి మైనారిటీలలో భయోత్పాతానికి కారణమౌతోంది. ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్ధకంగా మార్చివేస్తున్నది. డబ్బుతో, ఫిరాయింపులతో ప్రజల తీర్పులను తల్లకిందులు చేస్తూ అనైతిక పద్ధతుల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నది. మోడీ ప్రభుత్వపు పచ్చి నియంతృత్వ స్వభావం నేడు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. సామాన్యుడి చిరునవ్వుకు గ్యారంటీ అడిగాడు శ్రీశ్రీ. కాని ఈ మోడీ ప్రభుత్వం కరోనా బాధితులకు ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోయింది. కరోనా కష్ట కాలంలో సైతం అటు కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడం ఆపలేదు. ఇటు తన మత విద్వేష ఎజెండాను అమలు చేయడం మానలేదు.
జాతీయోద్యమంలో ఆరెస్సెస్ కాని హిందూత్వ శక్తులు కాని ఎక్కడా పాల్గొనలేదు సరికదా వీలైన అన్ని సందర్భాలలోనూ బ్రిటిష్ పాలకుల ఏజెంట్లుగానే వ్యవహరించారు. చివరకు జాతిపితనే బలిగొన్నారు. ఆనాడు జాతీయోద్యమానికి ద్రోహం చేసిన ఈ శక్తులు నేడు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కార్పొరేట్ల సేవలో, అమెరికన్ సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో మెలుగుతూ, ఆనాటి జాతీయోద్యమ ఫలాలైన రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. లౌకిక విధానాన్ని, అలీన విధానాన్ని, స్వావలంబనను, సామాజిక న్యాయాన్ని, ఫెడరల్ స్వభావాన్ని, శాస్త్రీయ విద్యను-ఒకటేమిటి, అన్ని అంశాలనూ దెబ్బతీస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు.
మన పెద్దలు పోరాడి మనకు అందించిన స్వాతంత్య్ర ఫలాలు నేడు మనకు దూరం అవుతున్న దుస్థితిని చూస్తూ మౌనంగా భరించడమా? లేక ఎదురుతిరిగి పోరాడి జాతీయోద్యమ వారసత్వాన్ని కాపాడుకోవడమా? ఇదే మన అందరి ముందూ ఈ స్వాతంత్య్ర దినాన ఉంచిన ప్రశ్న.
మనకు అన్నం పెట్టే రైతన్నలు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో స్పష్టంగానే తమ సుదీర్ఘ, అపూర్వ పోరాటం ద్వారా చెప్తున్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాట స్థాయిలో, మరో పోరాటం అవసరమని వారు ప్రకటిస్తున్నారు. క్యాంకింగ్, ఇన్సూరెన్స్, విద్యుత్ తదితర రంగాల కార్మికులూ తమ తమ పోరాటాలతో ముందుకొస్తున్నారు. విద్యార్ధి, యువజన, మహిళా, దళిత ప్రజలంతా గొతులు కలుపుతున్నారు.
అందుచేత ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మనమంతా మరో మహా సంకల్పం చెప్పుకుందాం. స్వతంత్ర భారతావనికి పట్టిన ఈ మతోన్మాద, కార్పొరేట్ చీడ నుండి, పెరుగుతున్న అమెరికన్ సామ్రాజ్యవాదుల పెత్తనం నుండి విముక్తి కలిగించి సామాన్యుడి ప్రయోజనమే పరమావధిగా వ్యవహరించగల లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తుల అధికారాన్ని సాధిద్దాం.
ఎం.వి.ఎస్.శర్మ











