* నేడు ఆర్ట్స్ కళాశాలలో జెండా పండుగ
* పతాకావిష్కరణ చేయనున్న ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ
* 111 మందికి ప్రశంసాపత్రాలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్‌పి రాధిక సోమవారం పరిశీలించి, పలు సూచనలు చేశారు. పెద్దసంఖ్యలో విద్యార్థులతో పాటు అధికారులు, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులు పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరువైపులా త్రివర్ణ పతాకాలను బారికేడ్లకు ఏర్పాటు చేశారు. పోలీస్ పెరేడ్‌తో పాటు ఎన్‌సిసి క్యాడెట్లు, స్కౌట్, గైడ్స్ విద్యార్థులు గౌరవ వందనం అందించనున్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసేలా శకటాలు, స్టాల్స్‌ను ప్రదర్శించనున్నారు. ఇందులో ఆకట్టుకున్న మూడు శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నారు.
పటిష్ట బందోబస్తు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆర్ట్స్ కళాశాల మైదానం పరిసర ప్రాంతాలను బాంబ్, డాగ్ స్వ్యాడ్ బృందాలు పరిశీలించాయి. ప్రత్యేక బలగాలతో పాటు సివిల్ పోలీసు సిబ్బంది సుమారు 400 మంది విధుల్లో ఉన్నారు. వేడుకలు నిర్వహించే మైదానం వద్దకు కేవలం విఐపి వాహనాలనే అనుమతించనున్నారు. పలు పాఠశాలల విద్యార్థులను తీసుకొచ్చే వాహనాలు, ఇతర వాహనాలకు కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించినట్లు ట్రాఫిక్ డిఎస్‌పి సిహెచ్.జి.వి ప్రసాద్ తెలిపారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్‌పి
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పరిశీలించారు. వేడుకలకు సంబంధించిన వేదిక, ప్రదర్శన స్టాల్స్, సీటింగ్, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని ఆర్‌డిఒ బి.శాంతిని ఆదేశించారు. వేడుకలకు వచ్చే స్వాతంత్య్ర సమరయోధులు, జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులకు విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు ఇతర మౌలిక వసతులు కల్పించాలన్నారు.
పెరేడ్ రిహార్సల్స్ పరిశీలన
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పోలీసుల కవాతు రిహార్సల్స్, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను ఎస్‌పి జి.ఆర్ రాధిక ఎఎస్‌పి జె.తిప్పేస్వామితో కలిసి పరిశీలించారు. ఆర్మ్‌డ్ రిజర్వు డిఎస్‌పి డి.ప్రసాద్ పెరేడ్ కమాండర్‌గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. కవాతు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై ఎస్‌పి సూచనలు చేశారు.










