- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంఓని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం తొమ్మిది గంటలకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగిస్తారని చెప్పారు. మేరా మిట్టి మేరా దేశ్ ప్రతి గ్రామ పంచాయతీలో 75 మొక్కలు నాటాలని, ఒక పైలాన్ ఏర్పాటు చేయాన్నారు. గ్రామాల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాలని, విశ్రాంత ఉద్యోగులను సన్మానించాలని, పంచ ప్రాణ ప్రతిజ్ఞ, జెండా వందనం చేయాలన్నారు. అందుకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పరేడ్ కార్యక్రమాన్ని ఎస్‌పి, వేదిక ఏర్పాట్లను ఇంజనీరింగ్ శాఖ, ఆర్‌డిఒ, తహశీల్దార్ పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇనుమడింపజేసేలా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల వివరాలు అందజేయాలన్నారు. ప్రతి శాఖ నుంచి ఇద్దరు, ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఎస్‌పి జి.ఆర్ రాధిక, అటవీశాఖ అధికారి నిషాకుమారి, డిఆర్‌ఒ మురళీకృష్ణ, ఆర్‌డిఒ బి.శాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, డిఎస్‌ఒ వెంకటరమణ, డిఎంహెచ్ బి.మీనాక్షి పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










