Aug 14,2023 23:51

జాతీయ పతాకంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

 ప్రజాశక్తి - కాకినాడ ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా కమిటీ పిలుపులో భాగంగా కాకినాడలో 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి బాలజీ చెరువు సెంటర్‌ వరకు 152 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రాము, ఎం.గంగాసూరిబాబు మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు విద్య, ఉపాధి కోసం పోరాడాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు పైబడినా దేశంలో విద్య నేటికీ అందని ద్రాక్షగానే ఉందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్‌ కొఠారి కమిషన్‌ చెప్పినట్టుగా విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలన్నారు. విద్యారంగానికి తక్షణం నిధులు పెంచాలన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. దేశాన్ని మతోన్మాదుల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో 'సేవ్‌ ఎడ్యుకేషన్‌, సేవ్‌ రాజ్యాంగం, సేవ్‌ ఇండియా' నినాదంతో ఆజాద్‌ ర్యాలీని నిర్వహించామన్నారు. విద్యార్థులు భారత స్వాతంత్య్ర ఉద్యమం, చరిత్రను చదవాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను అధ్యయనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పి.వరహాలు, నగర నాయకులు సాహిత్‌, వాసు, రవితేజ, అభిషేక్‌, చరణ్‌ తేజ్‌, సత్య, స్మైలీ తదితరులు పాల్గొన్నారు.