Aug 14,2023 22:31

దూసిలో రైలు నుంచి దిగుతున్న గాంధీ (ఫైల్‌)

ప్రజాశక్తి - శ్రీకాకుళం : బ్రిటిష్‌ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది 76 ఏళ్లు అయింది. నాటి త్యాగధనులంతా దాదాపుగా కీర్తిశేషులయ్యారు. తరం మారింది. తీరు మారింది. ఫలితంగా నాటి త్యాగాలతో సాధించుకున్న రాజకీయ స్వాతంత్య్రానికి నేడు ముప్పు ముంచుకొచ్చింది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల కబంధహస్తాల నుంచి బయటపడిన భారతదేశం మళ్లీ ఇప్పుడు కార్పొరేట్‌, సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లోకి జారుకుంటోంది. నాటి వారసత్వ స్ఫూర్తితో మరో స్వాతంత్య్రోద్యమానికి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్న శక్తులకు సంపూర్ణ సహకారం అందించాల్సిన సమయం ముందుకొచ్చింది. అలాంటి తరుణంలో నాడు జిల్లాలో సాగిన ప్రధాన ఘట్టాలను పాత్రధారులు, సూత్రధారులను స్మరించుకోవడం, నిరంతర కర్తవ్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పింఛన్లు అందించేందుకు జాతీయోద్యమంలో కారాగార జీవితం అనుభవించిన వారి జాబితా మాత్రమే వెలుగుచూసింది. పోలీసుల నిర్బంధాలకు, చిత్రహింసలకు గురైన వారెందరో ఉన్నారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి నేతల అజ్ఞాత జీవితాలకు సంపూర్ణ సహకారం అందించిన త్యాగధనుల కుటుంబాలు అనేకం ఉన్నాయి. జమిందారీ వ్యతిరేక పోరాటాలు రైతాంగ ఉద్యమాలు, జాతీయోద్యమంలో అంతర్భాగంగానే సాగాయి. సామాన్య ప్రజలను కదిలించాయి.
నేటి శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక భాగం ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి పాతపట్నం, నరసన్నపేట శ్రీకాకుళం తాలుకాలుండేవి. ఆ తర్వాత కొంతకాలం ఉత్తర విశాఖ జిల్లాలో చేరాయి. 1950 ఆగస్టు 15వ తేదీన ఉత్తర విశాఖ జిల్లా నుంచి వీడి శ్రీకాకుళం కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పడింది. 1979లో విజయనగరం జిల్లా ఆవిర్భావంతో, 2022లో జిల్లాల పునర్విభజనతో శ్రీకాకుళం జిల్లా భౌగోళిక స్వరూపం మరోసారి మారిపోయింది.
1905 విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపురావడంతో జిల్లాలోని పలు పట్టణాల్లో ప్రధానంగా నాటి తాలుకా కేంద్రాల్లో ప్రజలు తమ ఇళ్లల్లో ఉన్న విదేశీ బట్టలను రోడ్డుపై తగులబెట్టారు. విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపు అమలు చేసిన వందలాది మందిపై బ్రిటీష్‌ పాలకులు కేసులు పెట్టి అరెస్టు చేశారు. జైళ్లలో పెట్టారు. ఆ కాలంలోనే స్వదేశీ వస్త్ర వినియోగం పిలుపుతోనే ఖాదీల బట్ట తయారీ ఒక ఉద్యమంలా సాగింది. పొందూరు, బొంతల కోడూరు, మెళియాపుట్టి, నరసన్నపేట, బుడితి, సోంపేట, తదితర ప్రాంతాల్లో ఖాదీ బట్ట ఉత్పత్తి, విశేష ఆదరణ కనిపించింది.
జాతీయోద్యమ నాయకత్వం పిలుపునకు జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది. చదువులే కాదు ఉద్యోగాలు వదిలి వచ్చిన వారూ ఉన్నారు. అటువంటి వారిలో ఇచ్ఛాపురం నుంచి పుల్లెల శ్యామసుందరరావు, టెక్కలి నుంచి అట్టాడ కృష్ణమూర్తి, శ్రీకాకుళం నుంచి పూడిపెద్ద వెంకటరావు, మెళియాపుట్టి నుంచి దుక్క రాజన్నరెడ్డి, నరసన్నపేట నుంచి గరిమెళ్ల సత్యనారాయణ తదితరులున్నారు. గరిమెళ్ల సత్యనారాయణ రచించిన మాకొద్దీ తెల్లదొరతనమూ... గీతం ఆ రోజుల్లోనే ప్రాచుర్యం పొందింది. ప్రజల నోట వినిపించింది. 1927లో హరిజనోద్ధరణ పిలుపుతో జిల్లాలో గాంధీజీ పర్యటించారు. బొంతలకోడూరులో తయారవుతున్న సన్నఖాదీ బట్టను పరిశీలించారు. తిలారు, సారవకోట, పర్లాకిమిడి, మెళియాపుట్టి, పూండీ, పలాస, ఇచ్ఛాపురంలో పర్యటించారు.
ఉప్పు సత్యాగ్రహం
జాతిపిత మహాత్మా గాంధీ పిలుపుతో జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వందలాది మంది పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. 1930లో దండి సత్యాగ్రహంగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహంలో కోటబొమ్మాళి రైల్వేస్టేషన్‌ వద్ద టంకాల రంగన్న ఇంటి ముందు ఉప్పు తయారు చేసి, శాసనోల్లంఘనకు సిద్ధపడ్డారు. న్యాయవాది నిష్టల సోమయాజీ పంతులు, టంకాల వెంకటరాజు, అంధవరపు లక్ష్మణమూర్తి తదితరులు వందేమాతర గీతాన్ని ఆలపిస్తూ ప్రజలతో సముద్రానికి ఊరేగింపుగా వెళ్ళారు. సముద్రపు నీటిని తెచ్చి ఉప్పును పండించేందుకు ఉపక్రమించారు. 1930 ఏప్రిల్‌ 19న ఉన్నం రామలింగం మాస్టారు ఆధ్వర్యంలో నౌపడలో ఉప్పు కుప్పల లూటీకి సిద్ధమయ్యారు. ఆ లూటీ విషయాన్ని రామలింగం మాష్టారు, పుల్లెల శ్యామసుందరరావు, టి.ఎన్‌ గుప్త నరసన్నపేటలో బస చేసిన గంజాం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయడం జాతీయోద్యమ ప్రత్యేకత.
జమిందారీ వ్యతిరేక పోరాటం
40వ దశకంలో జాతీయోద్యమంతో పాటు జమిందారీ వ్యతిరేక పోరాటం తీవ్రతరమైంది. 1937లో చారిత్రాత్మకమైన రైతు రక్షణయాత్ర ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకూ సాగింది. కామారెడ్డి సత్యనారాయణ, చలసాని ప్రసాదరావు, పుల్లెల శ్యామసుందరరావు, పుండరీకాక్షాచారి, గౌతు లచ్చన్న తదితరులు యాత్రకు నాయకత్వం వహించారు. జాతీయోద్యమం జరుగుతున్న సమయంలో 1940 మార్చి 26, 27 తేదీల్లో తీవ్ర నిర్బంధాల మధ్య పలాసలో ఐదో అఖిల భారత కిసాన్‌ సభలు జరిగాయి. మహాసభ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. కిసాన్‌ సభకు అధ్యక్షలుగా ఎన్నికైన రాహుల్‌ సాంకృత్యాయన్‌ను అప్పటికే అరెస్టు చేశారు. ఆ సభలను నిర్బంధాల మధ్య పుల్లెల శ్యామసుందరరావు, గౌతు లచ్చన్న, మార్పు పద్మనాభం, చెంబాళం గవరయ్య, గానుగుల తరుణాచారి తదితరుల నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించగలిగారు. కిసాన్‌సభ స్ఫూర్తితో మందస జమిందారీ పోరాటం తీవ్రతరమైంది. ఆ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించిన మార్పు పద్మనాభం, గానుగుల తరుణాచారి, చెంబాళం గవరయ్యను పోలీసులు అరెస్ట్‌ చేసి కడలూరు జైల్లో పెట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వ ఆజ్ఞలు పాటించరాదని, జమిందారుకు పన్నులు చెల్లించరాదని ప్రజలు నిర్ణయించుకున్నారు. పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిని విడిచిపెట్టాలని ప్రజలు అడ్డుకున్నారు. ఆగ్రహించిన పోలీసులు 1940 ఏప్రిల్‌ 1న కాల్పులు జరపడంతో వీరనారి సాసుమాను గున్నమ్మతో పాటు గుంటబుడి మూడు, గొర్లె జగ్గయ్య, కర్రి కలిమాడు, గుంట చిననారాయణ మృతి చెందారు. ఆ సమయంలోనే గౌతు లచ్చన్న అజ్ఞాతవాసంలోకి పోయి తోటాడలోని బెండి శ్రీరామ్మూర్తి ఇంట్లో ఉన్నారు. మందస కాల్పుల తర్వాతనే ఇచ్ఛాపురంలో పుల్లెల శ్యామసుందరరావును గృహనిర్భందం చేశారు. 1940 జూన్‌ 16న గృహ నిర్బంధంలోనే ఆయన మరణించారు.
క్విట్‌ ఇండియా ఉద్యమం
1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో అజ్ఞాతంలో ఉన్న గౌతు లచ్చన్న జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన హిందూఫౌజ్‌లో చేరిన వారిలో మడ్డు కృష్ణమూర్తి, తెప్పల నారాయణ, నరసన్నపేట దరి హుస్సేన్‌పురానికి చెందిన లాలిశెట్టి అప్పారావు, బారువాకు చెందిన పోడిపల్లి సూర్యనారాయణ, మార్పు కృష్ణమూర్తి, మైలపల్లి సూర్యనారాయణ, చిన్నవెంటాపురానికి చెందిన బొడ్డేపల్లి సీతారాములు తదితరులు పట్టుబడి శిక్షలు అనుభవించారు. 40వ దశకం చివరిలో విజయనగరం, పర్లాకిమిడిలో విద్యనభ్యసిస్తున్న జిల్లాకు చెందిన అనేకమంది యువకులు కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. చదువుకు స్వస్తి చెప్పి కార్యకర్తలుగా వచ్చిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో గంటి రాజేశ్వరరావు, దారపు గోవిందరాజులు తదితరులు ముందుకొచ్చి ఉద్యమ నిర్మాణంలో పనిచేశారు.