మనది ప్రపంచంలోనే అతి పెద్ద 'ప్రజాస్వామ్య దేశం' అని చెప్పుకుంటారు. వేల సంవత్సరాల నాగరికత, ప్రాచీన చరిత్ర గల ఈ దేశ ప్రజలకు, ప్రజా పోరాటాలకు గొప్ప స్థానముంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తరిమికొట్టిన ఘన చరిత్ర మన ప్రజలది. మన జాతీయోద్యమ ప్రస్థానంలో స్త్రీల పాత్ర చెరగనిది. స్వాతంత్య్ర సమరంలో వారు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చరిత్రను మలుపు తిప్పిన ఘటనలకు ఆద్యులయ్యారు.
బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశం చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా ఉండేది. ఆ సంస్థానాల అధిపతులు, తమ సంస్థానాలు నిలబెట్టుకునేందుకు అనేక యుద్ధాలు, పోరాటాలు చేశారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్రకెక్కిన 1857 సిపాయిల తిరుగుబాటు, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర అందరికీ తెలుసు. మహారాణి వేలు నాచియార్ తమిళనాడు లోని శివగంగ ఎస్టేట్ మహారాణి. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి కంపెనీ సైన్యాలను ఓడించి తన రాజ్యాన్ని దక్కించుకున్నది. ఇది జరిగింది 1760-70 మధ్య కాలంలో. అదే కాలంలో కర్ణాటక లోని బెలగాం జిల్లా బెలవాడి మల్లమ్మ బ్రిటిష్ వారిపై కత్తి దూసింది. కర్ణాటక రాష్ట్రానికే చెందిన కిట్టూరు రాణి చెన్నమ్మ 1824లో బ్రిటిష్ వారిని ఎదిరించి యుద్ధం చేసింది.
ఇప్పటికీ వివక్షకు గురవుతున్న ముస్లిం మహిళలు, వెలివేయబడుతున్న దళిత స్త్రీలు, నాగరిక సమాజపు వెలుపలికి నెట్టివేయబడుతున్న గిరిజన స్త్రీలు వీరవనితలై పోరు సలిపారు. తూర్పు కనుమల్లో ప్రస్తుత జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సంతాల్ భిల్లు జాతి ప్రజలు రాణి శిరోమణి నాయకత్వంలో పెద్ద తిరుగుబాటు చేశారు.
బేగం హజ్రత్ మహల్, ఆమెతోపాటు అనేకమంది స్త్రీలను చరిత్ర ఉపేక్షించిందనే చెప్పాలి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని 'అవధ్' నవాబు వజీర్ అలీషా భార్య బేగం హజ్రత్ మహల్. 1856లో అవధ్ ఎస్టేట్‌పై బడ్డ బ్రిటిష్ సైన్యాలకు లొంగకుండా బేగం హజ్రత్ మహల్ యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుకుంటుంది. అయితే బ్రిటిష్ సైన్యాలు మరలా దాడి చేసి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాయి. యుక్త వయసులోనే అనేకమంది స్త్రీలు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. అవధ్ సంస్థానం లోనే ఉడాదేవి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించింది. రావి చెట్టు పైకెక్కి సైన్యానికి చిక్కకుండా 36 మంది బ్రిటిష్ సైనికులను హతమారుస్తుంది. ఉడాదేవి దళిత బిడ్డ.
ఇకపోతే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చరిత్ర అందరికీ తెలిసిందే. ఆమె అసలు పేరు మణి కర్ణిక. అప్పటి బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం ఎనిమిది సంవత్సరాల వయసుకే వివాహం చేశారు. ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. వారసత్వాన్ని అంగీకరించని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఝాన్సీని స్వాధీనపరచమని ఒత్తిడి చేస్తుంది. 'నేను ఝాన్సీని వదలను' అని యుద్ధం ప్రకటిస్తుంది. ఆధునిక భారత చరిత్రలో అసమాన ధైర్యసాహసాలకు లక్ష్మీబాయి చిహ్నంగా నిలుస్తుంది.
లక్ష్మీబాయితోపాటు మరణించిన మరో గొప్ప వీరవనిత జల్కారీబాయి. ఈమె దళిత మహిళ. చిన్న వయసులోనే కట్టెల కోసం తండ్రితో పాటు అడవికి వెళ్ళి పులి బారిన పడి తిరగబడి పులిని చంపిన ధైర్యశాలి అని చెప్తారు. యుద్ధ విద్యలు నేర్చుకుంటుంది. భర్త ఝాన్సీ రాజ్యంలో సైనికుడు. ఆమె రూపురేఖలు లక్ష్మీబాయిని పోలి వుండేవట. లక్ష్మీబాయిని కోటలో నుంచి తప్పించే నిమిత్తం బ్రిటిష్ వారిని పక్కదారి పట్టించేందుకు ఈమె కోట దాటి బయటకు వస్తుంది. యుద్ధంలో మరణిస్తుంది.
బెంగాల్ ప్రావిన్స్‌ను చిట్టగాంగ్ విప్లవకారుల కార్యక్రమాలు ఒక కుదుపు కుదిపాయి. మాస్టర్ సూర్యసేన్ నాయకత్వంలో తూర్పు బెంగాల్ లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్) చిట్టగాంగ్‌ను కేంద్రంగా తీసుకొని బ్రిటిష్‌వాళ్ళను దేశం నుండి తరిమికొట్టాలన్న లక్ష్యంతో పని చేశారు. బ్రిటిష్ అధికారులపై టెర్రరిస్టు దాడులు చేసేవారు. వారిలో ప్రీతి లత ఒడేదార్, కల్పనా దత్తు ప్రముఖులు. ప్రీతి లత ఢాకా యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివింది. బ్రిటిష్ అధికారులు ఉండే పహర్తల యూరోపియన్ క్లబ్ బయట 'కుక్కలకు, భారతీయులకు ప్రవేశం లేదు' అని రాసిపెట్టిన బోర్డులు వారిలో ఆవేశాన్ని రగిలించాయి. దాంతో క్లబ్బుపై దాడిచేశారు. ఈ దాడిలో కొంతమంది యూరోపియన్లు గాయపడ్డారు. ప్రీతి లత కూడా గాయపడింది. బ్రిటిష్ కుక్కలకు పట్టు పడరాదని నిర్ణయించుకొని సైనైడ్ మింగి చనిపోయింది. అదే దాడిలో కల్పనా దత్తు కూడా పాల్గొంది. ఆమెను అరెస్టు చేసి జైలులో పెట్టారు. చిట్టగాంగ్ విప్లవకారుల దళంలో మహిళలను చేర్చుకోరాదని మొదట నిర్ణయించుకున్నారు. కాని ఈ ఇరువురు విప్లవకారిణుల పట్టుదల ఆ నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది, చరిత్రను సృష్టించింది.
కెప్టెన్ లక్ష్మీ సెహగల్ జీవితం గొప్ప స్ఫూర్తిదాయకమైనది. ఆ రోజుల్లోనే వైద్య విద్యను అభ్యసించారు. సింగపూర్ చేరుకొని సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో రాణి ఝాన్సీ రెజిమెంట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం కాన్పూర్‌లో స్థిరపడి పేదసాదలకు డాక్టర్‌గా వైద్య సేవలందించారు. వామపక్షాల అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డ తొలి మహిళ లక్ష్మీ సెహగల్.
సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ఉత్తేజంతో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్న మరో యువతి బీనా దాస్. 1932లో ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలో చదివారు. అప్పటి బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై తూటాలు పేల్చారు. అయితే ఆయన బతికి బయటపడ్డారనుకోండి. ఆరోజు ఆమె కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ పుచ్చుకునే రోజు. గవర్నర్ నుండి డిగ్రీ తీసుకోవలసిన రోజునే గవర్నర్‌పై తుపాకి ఎక్కుపెట్టిన విప్లవకారిణి బీనా దాస్. ప్రీతి లత, బీనా దాస్ ఇద్దరికీ వారి మరణానంతరం 2012లో కలకత్తా యూనివర్సిటీ డిగ్రీలు ప్రదానం చేసింది.
జమీందారీ విధానాలకు, నైజాం వంటి సంస్థానాల పాలనకు వ్యతిరేకంగా రైతాంగం లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అశేష త్యాగాలు చేశారు. ఈ పోరాటాలలో పాల్గొన్న స్త్రీలు పోరాట స్వభావాన్నే మార్చివేశారు. దీన్ని కూడా స్వాతంత్య్రోద్యమానికి ఒక పాయగానే చూడాల్సి వుంటుంది.
సామాజిక విప్లవాలలో స్త్రీల భాగస్వామ్యం గురించి కారల్ మార్క్స్ చెప్పిన మాటలు కార్మిక రైతాంగ పోరాటాలకు, ఇంకా చెప్పాలంటే మొత్తం స్వాతంత్య్ర ఉద్యమంలో స్త్రీల పాత్రకు సరిగ్గా సరిపోతాయి. జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో గుండెనిచ్చిన గున్నమ్మ, బావిరెడ్డి వియ్యమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆద్యురాలైన వీరనారి ఐలమ్మలు రైతాంగ పోరాటాల చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆంధ్ర ప్రాంతంలో జమీందారీ వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వమే స్థిరపర్చింది. రైతాంగం నుండి విపరీతంగా శిస్తులు వసూలు చేసేవారు. శిస్తు కట్టలేని రైతుల భూములు ఆక్రమించేవారు. కొన్ని సందర్భాలలో చిత్రహింసలు కూడా పెట్టేవారు. అడవుల్లో కట్టెలు కొట్టుకోవడానికి, పశువులను మేపుకోవడానికి హక్కు లేదు. నదీప్రాంతాల్లో రెల్లుగడ్డి కోసుకోనిచ్చేవారు కాదు. సహజంగానే రైతాంగం తిరగబడింది. శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో అడవిలో కట్టెలు కొట్టుకోబోతే బ్రిటిష్ పోలీసులు అడ్డుకున్నారు. తుపాకులతో బెదిరించారు. ఆ పోరాటంలో నిండు గర్భవతి సాసునూరు గున్నమ్మ పొట్టలో నుంచి తుపాకి గుళ్లు దూసుకుపోయాయి. మానికొండ సూర్యావతి, చండ్ర సావిత్రీదేవి, మోటూరు ఉదయం వంటి నేతలు మహిళా ఉద్యమాన్ని నిర్మించడంతోపాటు రైతాంగ ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో బహుశా వీరగున్నమ్మ ప్రాణ త్యాగమే రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. ఇది 1940 ఏప్రిల్ 1న జరిగింది. ఆ తరువాత చెప్పుకోదగ్గది చల్లపల్లి జమీందారి వ్యతిరేక పోరాటం. 1946 ఏప్రిల్ 10న గాజుల్లంక వద్ద కృష్ణా నది ఒడ్డునున్న లంక గ్రామాల్లో జమీందారు ఆంక్షలను ధిక్కరించి బావిరెడ్డి వియ్యమ్మతోపాటు రైతులు రెల్లుగడ్డి కోశారు. వియ్యమ్మతోపాటు మరో ముగ్గురు రైతులను జమీందారు గూండాలు కాల్చి చంపారు. ఈ పోరాటంలో గుత్తికొండ సీతమ్మ వంటి స్త్రీమూర్తులు జైళ్ళకు వెళ్ళారు. అరెస్టులు, పోలీసు లాకప్పులు లెక్క చేయలేదు. స్త్రీలు కొరియర్లుగా కూడా పనిచేశారు.
రైతాంగ పోరాటాల్లో మణి కిరీటం లాంటిది తెలంగాణ సాయుధ పోరాటం. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది ఐలమ్మ. ఐలమ్మ కుటుంబం కులవృత్తి చేసుకుంటూనే కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకునేది. భూమిని గుంజుకోవడానికి దేశ్‌ముఖ్ గూండాలు ప్రయత్నించారు. 1945 నుండి ఈ రగడ సాగుతూనే ఉంది. ఐలమ్మ భర్త, కుమారుడిని కూడా జైలులో పెట్టారు. అయినా పట్టువదలని ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకులైన బి.ఎన్.రెడ్డి తదితరుల సహాయంతో భూమిని దక్కించుకుంది. ఐలమ్మ పోరాటం మరెందరికో స్ఫూర్తి నిచ్చింది. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య హత్యతో తెలంగాణ మొత్తం అగ్గి రాజుకుంది. ఆరేళ్లపాటు సాగిన పోరాటంలో జమీందారులు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు ఊళ్ళను వదిలి పారిపోయారు. నైజాం రాచరికం పోయి ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. లక్షల ఎకరాల భూమిపై రైతాంగానికి హక్కులు వచ్చాయి. మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ పోరాటంలో మహిళల ధైర్యసాహసాలు, త్యాగాలు సామాన్యమైనవి కాదు. మహిళలు గెరిల్లా దళాల్లో నాయకులుగా, సభ్యులుగా ఉన్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్నారు. తుపాకి భుజాన వేసుకుని వందల గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచి పోరాటాల్లోకి కదిలించారు. పుచ్చలపల్లి సుందరయ్య రచించిన 'తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-గుణపాఠాలు' పుస్తకంలో స్త్రీల పాత్రను ప్రత్యేకించి చెప్పారు. వారిలో మల్లు స్వరాజ్యం, మంత్రాల రాములమ్మ, సత్యవతి, సుగుణ, పద్మ, వంటి నేతలెందరో ఉన్నారు. మల్లు స్వరాజ్యం 12 సంవత్సరాల వయసులో స్వగ్రామంలో బతుకమ్మ పాటలతో కూలీలను ఉత్సాహపరచి వ్యవసాయ కార్మిక సమ్మె నడిపారు. అది మొదలు ఆసాంతం పోరాటంలో ఉన్నారు. నేటికీ ప్రజా ఉద్యమాల్లో వున్నారు. రాజక్క పేరుతో ప్రత్యేకించి కోయ ప్రజల్లో పనిచేశారు.
స్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న స్త్రీలే కాకుండా పరోక్షంగా అజ్ఞాతంగా ఉండి, అండగా నిలబడ్డ తల్లులు, సోదరీమణులు మరెందరో. మరో రెండు రోజుల్లో మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆ త్యాగఫలాలను కాపాడటం మనందరి విధి. చరిత్రకర్ధం అంత:పుర కాంతలు, మహారాజుల ప్రేమ పురాణాలు కాదు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించే పోరాటాలే అసలు సిసలు చరిత్ర. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ చరిత్రలో అలిఖితంగా, అజ్ఞాతంగా ఉన్న ఎందరో స్త్రీ మూర్తులు, వీర వనితల జీవితాలే మన బంగారు జీవితాలకు పునాదులవుతాయి.
- ఎస్. పుణ్యవతి
ఐద్వా జాతీయ కోశాధికారి










