* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పేందుకు స్వాతంత్య్ర మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యాన నగరంలోని శాంతినగర్ కాలనీలో గల గాంధీ స్మృతివనంలో మేరా మట్... మేరా దేశ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌పి జి.ఆర్ రాధికతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిజ్ఞ, అమరవీరులకు వందనం, ప్రతి పంచాయతీలో 75 మొక్కలు నాటే వసుధా వందనం, ప్రధాని, ముఖ్యమంత్రి సందేశంతో కూడిన శిలాఫలకాల ఆవిష్కరణ, అమరవీరులను గుర్తించడం వంటి ఐదు రకాల కార్యక్రమాలను ఆగస్టు 15 వరకు జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలతో పాటు 75 వార్డుల్లో నిర్వహించబోతున్నట్లు వివరించారు. ఈనెల 15 తర్వాత ప్రతి గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గం నుంచి కొంత మట్టిని సేకరించి, దాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మెప్మా పీడీ కిరణ్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆయుష్ డాక్టర్ జగన్నాథం, సెట్విజ్ సిఇఒ ప్రసాదరావు, ఎన్‌వైకె కోఆర్డినేటర్ ఉజ్వల, గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు ఎం.ప్రసాదరావు కొంక్యాన వేణుగోపాల్, ఎం.వి.ఎస్ శాస్త్రి, ఎస్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.










