ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు సిద్ధమైంది. పంద్రాగస్టు..జిల్లాస్థాయి వేడుకల నిర్వహణకు జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల మైదానాన్ని ముస్తాబు చేశారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పలు శాఖల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. జిల్లా ఎస్‌పి అతుల్ సిన్హా, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ సోమవారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మైదానంలో పోలీసుల కవాతుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్య అతిధులు ఆసీనులయ్యేందుకు వేదిక ప్రాంగణం ముస్తాబు చేశారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. శకటాల రూపకల్పన..మరోవైపు సాయుధ బలగాల కవాతు.. ఇంకోవైపు విఐపిలు, వీక్షకులను దృష్టిలో ఉంచుకొని మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నాలుగు రోజులుగా సాయుధ దళాల కవాతు సాధన చేశాయి. ఆహుతులను ఆకట్టుకునేలా, దేశభక్తి ఉట్టిపడేలా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో నిర్వహించనున్న సాంస్కతిక ప్రదర్శనలను సిద్ధం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రదర్శించే శకటాలు సిద్ధమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించే విధంగా పలు స్టాళ్లను ఆకర్షనీయంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖలు అభివృద్ధిని వివరిస్తూ స్టాళ్ళలో చిత్రాలు, ఫ్లెక్సీలను ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలను ప్రోటోకాల్ ప్రకారం పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి సైతం ప్రతిపాదనలు పంపించాలని ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇవ్వగా వారి పేర్లను కలెక్టరేట్‌కు పంపించారు. జిల్లా అధికారులతో పాటు ఆయ శాఖలో కిందిస్థాయిలో ఉత్తమ సేవలందించిన వారి జాబితా రూపొందించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మువ్వన్నెల జెండా ఎగురనున్నది.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ ఆదేశాలతో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ బాలుర పాఠశాల హెచ్‌ఎం రీమలి జాన్ అన్నారు. పాఠశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం ప్రజాశక్తితో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గ్రౌండ్ సిద్ధం చేశారని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వేడుకలను తిలకించేందుకు హాజరయ్యే ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. వేడుకలను పురస్కరించుకుని ఇప్పటికే అధికారులు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.










