Sep 28,2023 23:05

ప్రజాశక్తి - బాపట్ల
పిన్నవయసులోనే దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు త్యజించిన వేగుచుక్క భగత్ సింగ్ అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయి బాబు అన్నారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు. చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన ఆయన త్యాగం నిరుపమానమైనదని అన్నారు. జ్వలించే నిప్పు ఖనిక లా తెల్లదొరలను వణికించారని అన్నారు. ఆంగ్లేయులపై పగ తీర్చుకుని భారతీయుల సత్తా చాటారని అన్నారు. దేశ స్వాతంత్రాన్నే కాకుండా సమసమాజంలో  అసమానతలు, మూఢనమ్మకాలు లేని దేశం కోసం కలలు కన్నారని అన్నారు. ఆయన ప్రాణ త్యాగం వల్ల దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిలిందని అన్నారు. భగత్ సింగ్ ఆశయాల కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది జడ్ బాషా, సుభాని, రెడ్డి రహెల్ పాల్గొన్నారు.