Sep 28,2023 22:38

స్వాతిని సత్కరిస్తున్న ఎస్‌పి

'స్వాతి'ముత్యం
ఎస్‌ఐ నుంచి
డిప్యూటీ కలెక్టర్‌గా
ఘనంగా
సన్మానం, వీడ్కోలు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
పోలీసు విభాగంలో 'స్వాతి'ముత్యంగా నిలిచి, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకుంది. గురువారం స్వయానా ఎస్‌పి పి.పరమేశ్వరరెడ్డి ఆమెను ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. 2018 బ్యాచ్‌ ఎస్‌ఐగా తిరుపతి జిల్లా పోలీసు శాఖలో స్వాతి నియమితులయ్యారు. కఠోరశ్రమతో ఇటీవల గ్రూప్‌ 1 ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రంలోనే ఎనిమిదో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని సాధించారు.
సత్యసాయి జిల్లా హిందూపరం గురవనహల్లి గ్రామ వాస్తవ్యులు. నాగరాజు, రత్నమ్మ దంపతులకు స్వాతి 1993లో జన్మించారు. బాల్యం నుంచి విద్యతో చురుగ్గా ఉంటూ ఎంఎస్‌సి కెమిస్ట్రీ ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఎస్‌ఐ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులై 2017లో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించి ట్రైనింగ్‌కు వెళ్లారు. 2018, జులై 3న ఎస్‌ఐ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లాలోని తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్‌ఐగా స్వాతి నియమితులయ్యారు. తర్వాత గాజులమండ్యం పోలీసు స్టేషన్‌లోనూ, శ్రీకాళహస్తి టుటౌన్‌లోనూ, జిల్లా ఎస్‌బిలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తించారు. 2021లో ఒంగోలుకు చెందిన మహేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను వివాహమాడారు. భర్త ప్రోత్సాహంతో ఒకటిన్నర సంవత్సరం లీవు తీసుకుని హైదరాబాద్‌లోని ప్రముఖ అకాడమీలో కోచింగ్‌ తీసుకుని 2022 సంవత్సరంలో వచ్చిన గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ద్వారా తన ఆశయ సాధనే లక్ష్యంగా నిబద్ధత, పట్టుదల, కఠోరశ్రమతో అహర్నిశలు కష్టపడి చదివి గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్వ్యూలు పూర్తి చేసి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. స్వాతి మాట్లాడుతూ పోలీసు విభాగం తన పుట్టిల్లుతో సమానమన్నారు. పోలీసు శాఖలో పనిచేసిన అనుభవం వల్లనే ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా, కచ్చితత్వంతో సమాధానాలు చెప్పగలిగానని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని సాధించేందుకు పోలీసు శాఖ అనుభవం ఎంతో ఉపయోగపడిందన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, పరిపాలన కులశేఖర్‌, శాంతిభద్రత విమల కుమారి, నేర విభాగం డీఎస్పీలు గిరిధర, ఎస్బి సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
స్వాతిని సత్కరిస్తున్న ఎస్‌పి