Sep 29,2023 22:37

ప్రజాశక్తి - బాపట్ల
దేశ ఆర్ధిక వ్యవస్థ గ్రామీణ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక పద్ధతుల ద్వారా అధిక ఫలసాయాన్ని సాధించి దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచవచ్చని, దేశంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ మృతి భారతదేశ వ్యవసాయ రంగానికి తీరని లోటుని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావు అన్నారు. స్వామినాథన్ వృతి పట్ల తీవ్ర సంతాప వ్యక్తం చేశారు. కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. అధిక దిగుబడులను ఇచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించడం ద్వారా తాను నమ్మిన సిద్ధాంతాన్ని నిరూపించి చూపిన డాక్టర్‌ ఎంఎస్ స్వామినాథన్ అమరుడన్నారు. భారత దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి, భారతీయ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చారన్నారు. దేశంలో 1970వ దశకంలో సంభవించిన ఆహార సంక్షోభానికి చలించి, ప్రజలు పస్తులుండే పరిస్థితి రాకూడదని పరితపించిన వ్యక్తి అని అన్నారు. వ్యవసాయ మార్కెట్లో సంస్కరణలకు ఆఖరి క్షణం వరకు కృషి చేసిన స్వామినాథన్ మృతి బాధాకరమని అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల ద్వారా రైతాంగ ఉన్నతికి కృషి చేసిన ఆయనను భారత హరిత విప్లవ పితామహుడని కీర్తించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆయనను "ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎకాలజి" గా గుర్తించిందన్నారు. 1925లో తమిళనాడులోని తంజావూరులో జన్మించిన స్వామినాథన్ జెనిటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో ఉన్నత విద్యనభ్యసించారని గుర్తు చేశారు. దేశంలో ఆహార  ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో విశేష కృషి చేసారని అన్నారు. ఆయన కృషికి ఫలితంగా 1987లో నోబెల్ బహుమతితో సమానమైన వరల్డ్ ఫుడ్ బహుమతి,  1971లో రామన్ మెగాసేసే అవార్డు, 1999లో ఇందిరా గాంధీ శాంతి బహుమతి,  నార్మన్ బోర్లాగ్ అవార్డులతో ప్రపంచం ఆయనను సత్కరించిందన్నారు. ఎవర్ గ్రీన్ రివల్యూషన్ భావనతో ఆఖరి క్షణం వరకు భారత వ్యవసాయ రంగానికే తన జీవితాన్ని అంకితం చేసిన స్వామినాథన్‌ను భారత ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించిందని అన్నారు. 2007లో రాజ్యసభ సభ్యత్వాన్నిచ్చి  గౌరవించిందన్నారు. 1988లో గ్రామీణ ప్రాంత పేద మహిళల ఉద్యోగితకు, వారి ఆర్థికాభివృద్ధి కోసం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారని అన్నారు. ఫౌండేషన్‌ ద్వారా మహిళల ఉన్నతికి పాటుపడిన ఆయన 84డాక్టరేట్లు పొందిన అరుదైన శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి వహించారన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలతో కూడా ఆయనకు అనుబంధముందని అన్నారు. 2006లో కళాశాల డైమండ్ జూబిలీ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా పాల్గొనడమే గాక బివి నాథ్ ఆడిటోరియం శంకుస్థాపన చేశారన్నారు. అప్పట్లో ఆయన ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది  పాల్గొన్నారు.