Sep 25,2023 23:41

మాట్లాడుతున్న గుంటూరు విజరు కుమార్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, పంటలకు కేరళ తరహాలో మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు భరోసా కల్పించాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సోమవారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. విజరుకుమార్‌ మాట్లాడుతూ రైతులను ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని, రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను పడగొట్టే శక్తి ఉందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఖరీఫ్‌లో పైర్లు తీవ్రమైన వర్షాభావం కారణంగా ఎండిపోతున్నాయని ఎండిపోతున్నాయని, అయినా ప్రభు త్వంలో స్పందన లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్ర సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారుల సత్వరమే పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రబీలో ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, ఆయా పంటల ధరలను ముందే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు తమ హక్కుల సాధన కోసం చలో విజయవాడకు పిలుపు నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే నిర్బంధించి అరెస్టులు చేశారని ఖండించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, వై.గోపాలరావు పాల్గొన్నారు.