Mar 07,2021 19:43

ఆమె నిత్యం సవాళ్ల మధ్యే ఉండేది. ఆధిపత్య భావజాల ప్రపంచంలో సవాళ్లను స్వీకరిస్తూనే ఉంది. సమాజ మార్పుకు ప్రయత్నిస్తూనే ఉంది.. అది కరోనా వైరస్‌ నుండి కుటుంబాన్ని కాపాడుకోవటంలో అయినా.. తన పుట్టుక నుండి పెరిగి పెద్దయ్యే వరకూ మనుగడ కోసమైనా.. వివక్ష, గృహహింస, వేధింపులు, అత్యాచారాలపైనైనా.. సవాళ్లను ఆమె ఎదుర్కొంటూనే ఉంది. దేశ రాజధానిలో మూడు నల్ల వ్యవసాయ చట్టాల సవాళ్లపై జరిపే పోరులోనూ మహిళల శాతం అధికమే. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అంటూ ప్రయివేటీకరణ సవాలుపై జరిగే ఉద్యమంలో తాను సైతం అంటూ ఆమె పోరుబాటలో ఉంది. ఈ సవాళ్లన్నీ స్వీకరిస్తూ.. మహిళల హక్కులంటే.. మానవ హక్కులేనంటూ నినదిస్తూ.. సమాజ మార్పుకు ఆమె నడుం బిగించింది.. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


ఈ ఏడాది థీమ్‌..
ఈ ఏడాది (2021) అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా # ChooseToChallenge# A Challenged world is an alert world and frome challenge comes change. So let's all choose to challenge. how will you help forge a gender wqual world? Celebrate women's achievement. Raise awareness against bias. Take action for equality అనే నినాదాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు. ''సవాళ్లతో కూడిన ప్రపంచం.. అప్రమత్తతో ఉండే ప్రపంచం కూడా! సవాళ్ల నుండే మార్పు వస్తుంది. కాబట్టి మనందరం సవాళ్లను ఎంచుకుందాం.. లింగ వివక్షలేని సమాజాన్ని రూపొందించడానికి మీరెలా సహాయం చేయగలరు? మహిళల విజయాలను ఎలుగెత్తిచాటుదాం. వాటిని పండగలా జరుపుకోండి. పక్షపాతాన్ని నిరసించండి. దానికి వ్యతిరేకంగా అవగాహనను పెంచండి. సమానత్వ సాధన కోసం కృషి చేయండి'' అన్నది దాని అర్థం.
 

మార్చి 8నే ఎందుకు?
రష్యా మహిళలు 1917 యుద్ధ సమయంలో ''ఆహారం - శాంతి'' డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్‌ నికోలస్‌ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్‌ క్యాలెండర్‌) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


వివక్ష.. హింస..
'ఆడపిల్లగా పుట్టడం నా తప్పా?' అని ఈ సమాజంలో ఆడపిల్లలు ప్రశ్నించాల్సి రావడమే దేశ దౌర్భాగ్యం. ఇంతకన్నా వివక్ష మరొకటి లేదు. మనుగడ కోసం ఆమె పోరు సల్పాల్సిన దుస్థితి. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. పుట్టిన తర్వాత ఎదగడం లోనూ.. చదవడంలోనూ.. ఇంటా.. బయటా అనేకరకాల వివక్షలు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లే! ఆ సవాళ్లను స్వీకరించడం కేవలం మహిళల కర్తవ్యం కాదు.. మనందరి బాధ్యత.. సమానతా భావాలే సమాజాన్ని సమున్నతంగా నిలిపేవి. ఇంట్లో ఆమెపై హింస ఏ స్థాయిలో ఉందంటే.. 'గృహహింస' చట్టమే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇదీ ఓ మార్పే. లైంగిక వేధింపులు అయితే చిన్నపిల్లల నుండి ముదసలి వరకూ ఎదుర్కోవాల్సి వస్తోంది. అత్యాచారాల భారతంలో ''నిర్భయ'' వంటి చట్టాలను తెచ్చుకోగలగడం. అయినా హథ్రాస్‌ సంఘటన ఆ అత్యాచారాల పర్వం కొనసాగుతుందని తెలియజేస్తుంది. అసిఫా వంటి బాలికను దేవాలయంలోనే హత్యాచారం చేసిన ఘటన మనమెవ్వరం మరవలేం.. పైగా నేరస్థులను నెత్తినెక్కించుకుని, వారిని కాపాడే ప్రయత్నం చేసిన పాలకులున్న దేశం మనది. దిశ హత్యాచారం మన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. ఈ సవాళ్లను స్వీకరిస్తూ.. వర్మ కమిషన్‌ సిఫారసుల అమలుకోసం ఐక్యంగా ఉద్యమించాల్సిందే.

ఇంటిపనిలో..
ఇంటిపనిలో వేతనం లేని పనిమనిషి ఆమె. ఇంటెడు చాకిరీని తానొక్కతే చేస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ నడిచే యంత్రం ఆమె. అంతలా కష్టపడుతుండటం కుటుంబ అభివృద్ధికే కాదు.. ఆమె శ్రమ సమాజ అభివృద్ధికీ తోడ్పడుతుంది. అందుకే ఆమె శ్రమకు విలువ కట్టాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ముందుకొచ్చింది. అందులో భాగమే సుప్రీం న్యాయమూర్తే ఈ విషయాన్ని ప్రస్తావించడం.. తమిళనాడులో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌హసన్‌ తన ఎన్నికల ప్రణాళికలో ఇంటిపనికి వేతనం చెల్లిస్తానని పేర్కొనడం. ఇవన్నీ ఇంటిదగ్గర ఉండే మహిళల గురించి. మరి ఇంటా బయటా పనిచేస్తూ ఉత్పత్తిలో నేరుగా భాగస్వామ్యం అవుతున్న మహిళలు మరింత శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇవన్నీ ఎదుర్కొంటున్న సవాళ్లే.. అయితే చిన్న సవాల్‌ నుండి పెద్ద సవాల్‌ వరకూ స్వీకరిస్తూ.. ఆమె విజయం సాధిస్తోంది. ఆడవాళ్ల పనులు, మగవాళ్ల పనులు అన్న భేదం చూపించ కుండా.. అందరం కలిసి అన్నిపనులూ చేసుకుందాం.. ఈ సవాల్‌ను స్వీకరిద్దాం.. మార్పుకు శ్రీకారం చుడదాం..

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


ఉత్పత్తి రంగాల్లో..
ప్రభుత్వరంగం కుదించుకుపోతూ.. ప్రయివేటీకరణ జరిగే నేటి పాలక విధానాలతో అసంఘటితరంగం పెద్దఎత్తున పెరిగిపోయింది. ఈ అసంఘటిత రంగంలో మహిళల శ్రమ సగానికిపైనే. ఆమె లేని రంగం లేదు. అందుకే కార్మికహక్కుల కోసం జరిగే పోరాటాల్లో ఆమె అత్యధిక భాగస్వామ్యం కలిగి ఉంది. అంతరిక్షం లోనూ ఆమె సగం.. అవకాశాల్లోనూ ఆమె సగం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ.. పరిశోధనల్లోనూ.. ఆవిష్కరణల్లోనూ.. ఆమె దూసుకుపోతోంది. అయినప్పటికీ ఆమె నాయకత్వాన్ని ఆధిపత్య భావజాలం అంగీకరించే స్థితిలో లేదు. ఈ భావజాలం పురుషులకే కాదు.. మహిళల్లోనూ ఉంది. ఆ భావజాలం వల్లే నేటికీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ ఇవ్వకపోవడం. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయమన్న సుప్రీం తీర్పు అమలుకు నోచుకోకపోవడం. పని ప్రదేశాల్లో స్త్రీ నాయ కత్వాన్ని అంగీకరించలేకపోవడం. వారి ప్రతిభను అంగీకరించలేకపోవడం.. వారిని ప్రోత్సహించ లేకపోవడం.. తమ నాయకత్వంలోనే మహిళలు పనిచేయాలనే ఈ ఆధిపత్యభావజాల వాదుల ధోరణి. అందుకే ఈ ఆధిపత్య భావజాల సవాల్‌ను స్వీకరిద్దాం.. సమానత భావాలను పెంపొందిద్దాం..

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


కరోనా వైరస్‌ వేళ..
కరోనా వైరస్‌ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసింది.. ఇంకా అది అనేక రూపాలు మార్చుకుంటూ మనల్ని ఇబ్బందిపెడుతూనే ఉంది. ఈ సవాల్‌ను ఫ్రంట్‌ వారియర్స్‌గా వైద్య, పోలీస్‌, పారిశుధ్య రంగాలనే గుర్తిస్తున్నారు. కానీ అందరికన్నా ఎక్కువ ఈ వైరస్‌ను అన్నిరకాలుగా ఎదుర్కొనేది మహిళలే. ఆ వైరస్‌ బారిన పడకుండా కుటుంబాన్ని కాపాడటంలో ఆమె పాత్ర అత్యున్నతమైనది. అందరికీ పోషకాహారం అందించడమే కాదు.. మాస్క్‌ల దగ్గర నుండి అందరి పరిశుభ్రత ఆమె వల్లే జరిగింది.. జరుగుతోంది. ఈ కాలంలో ఆమెపై పనిభారం అధికమైంది. వర్క్‌ ఫ్రం హోమ్‌తో అది మరింత పెరిగింది. కరోనా వైరస్‌పై సమరం ఆమె స్వీకరించిన సవాల్‌.. దానిపై పోరాడటం వల్లే కరోనా ఈ మాత్రం కట్టడి చేయడానికి సాధ్యమైంది. భారత్‌లో ఈ వైరస్‌పై పోరాటంలో ముగ్గురు మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. ఆ ముగ్గురు ఇప్పుడు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శం అయ్యారు. వారే తొలి మేడిన్‌ ఇండియా కరోనా టెస్టింగ్‌ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త మీనల్‌ దఖావే భోసలే, మైలాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షెఫాలి దేశారు, మిథాలీ పాటిల్‌. వీరిలో మీనల్‌ దఖావే భోసలే నిండు గర్భిణి.

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


దేశ రాజధానిలో..
ఇప్పుడు ఆమె చేసిన, చేస్తున్న పోరాటాలు ఒక ఎత్తు. ఇప్పుడు అతిపెద్ద ఉత్పత్తి రంగమైన వ్యవసాయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె ఎత్తిన పిడికిలి మరో ఎత్తు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల కోసం దేశ రాజధానిలో జరుగుతున్న రైతు పోరాటం 100 రోజులు దాటింది. దీనిలో స్త్రీలు అద్వితీయమైన పాత్ర నిర్వహించారు. ఎముకలు కొరికే చలిలో సైతం 60 ఏళ్లకు పైబడిన మహిళలు పాల్గొనడం సామాన్యం కాదు. అనేక నిర్బంధాలను ఎదుర్కొని, అక్కడ ఓ సమాంతర వ్యవస్థనే ఏర్పర్చుకోగలిగారు. ఓ వైపు ఇంటిని, పిల్లల్ని చక్కబెట్టుకుని, పోరాట కేంద్రంలో పనిచేయడం.. మరోవైపు భర్తలు పోరాటం కేంద్రంలో ఉంటే.. తాము వ్యవసాయం చేయడం.. ఉద్యమంలో భాగంగా ట్రాక్టర్లను నడపడం సైతం నేర్చుకుని, కదనరంగంలో వందల కిలోమీటర్ల వరకూ పాల్గొన్నారంటే మహిళల పోరాటపటిమే కారణం. ఆ చట్టాలు రద్దయ్యే వరకూ పోరు విరమించేది లేదని భీష్మించుకుని కూర్చోడం సవాల్‌ను స్వీకరించడం వల్లే.. ఈ సవాల్‌ కార్పొరేట్ల పక్షాన నిలిచిన ప్రభుత్వాన్ని ఎండగడుతోంది.. కార్పొరేట్ల విషకౌగిలి నుండి వ్యవసాయాన్ని విముక్తి కలిగించేందుకే. ఆ మార్పుకోసమే ఈ పోరాటం జరుపుతున్నామని మహిళలు తాము తెలుసుకోవడమే కాదు.. ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న, ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలనూ చైతన్యవంతం చేస్తున్నారు. ఈ అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నది మహిళలే. మహిళలకు సహజంగానే కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి. మహిళా రైతులు అలాంటి వ్యక్తిగతమైన నెలసరి వంటి సమస్యలనూ ఈ పెద్ద సమస్య ముందు అల్పంగా భావించగలుగుతున్నారు. అనారోగ్య సమస్యలున్నా.. అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ సవాల్‌ను స్వీకరిద్దాం.. మార్పు తెచ్చే క్రమంలో మనమూ తోడ్పడదాం.

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


వాస్తవాల వెల్లడిలో..
ప్రతి పోరాటం వెనుక కుట్రలు చేస్తున్న పాలకుల తీరును ఎండగట్టాలన్నా.. అసలు సత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నా మీడియానే సారథి. అయితే ప్రధాన మీడియా కార్పొరేట్ల వశమైపోయింది. అందుకే ప్రత్యామ్నాయ మీడియా ఆవశ్యకత అవసరమైంది. అందుకే రైతులు తమ పోరాటాలకు సంబంధించి హౌడీ మీడియాకు వ్యతిరేకంగా సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సోషల్‌ మీడియాలోనూ వాస్తవాలను వెల్లడిస్తున్నారు. వీటన్నింటిలో ప్రధానంగా యువత భాగస్వామ్యమై ఉంది. అందులో మహిళా యువ జర్నలిస్టుల పాత్రే కీలకం. యుపిలోని హథ్రాస్‌ సంఘటనలోని యువతికి పోలీసు అధికారులే కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా అంత్యక్రియలు జరిపారన్నది వెలుగులోకి వచ్చింది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినదీ మహిళా యువ జర్నలిస్టు. ఇది కవర్‌ చేయడం పెద్ద సవాల్‌. గతేడాది అనేక దేశాల్లో నిరసనలకు కారణమైన.. అమెరికాలోని నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బయటపెట్టిందీ ఓ మహిళే.. ఈ మధ్య కాలంలో న్యాయవ్యవస్థ తీరూ ఆక్షేపణీయంగా ఉంది. అవీ వెల్లడవుతోంది, వాటిపై పోరాడుతుంది మహిళ నేతలే.. ఇలా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి వాస్తవాలను ప్రజలకు చేరవేయడం, చైతన్యపర్చడం మార్పుకు దోహదపడటమే.
ఆమె అసమానతలపై జరిగే పోరాటాలే కాకుండా ఆర్థిక అసమానతలపై, ఆర్థిక విధానాలపై పోరాడితేనే స్త్రీ విముక్తి కలిగేది. అందుకే సమాజంలో తన హక్కులతో పాటే అన్ని హక్కులూ హరించివేస్తున్న వేళ.. ఆ ఆధిపత్య కంచెలను తొలగించాల్సిందే.. ఆ సంకెళ్లను తెంచాల్సిందే.. అందుకు జరిగే పోరాటాల్లో ఆమె సైతం పదం పాడుతూ.. కదం తొక్కాల్సిందే.. అది ఒకవైపు.. దేశ రాజధానిలోనైనా.. విశాఖ తీరంలో జరుగుతున్న పోరాటాల్లోనైనా.. ఆమె భాగస్వామ్యం ఆర్థికపరమైన పోరాటమే. కరోనా వైరస్‌ ప్రపంచంలో విషనాల్కలు విసురుతున్న వేళ.. ఆయా రంగాల్లో ఆమే ఫ్రంట్‌ వారియర్‌. అందుకే సవాళ్లను స్వీకరిద్దాం.. మార్పును తీసుకొద్దాం.. ఆ మార్పు సమసమాజ మార్పుకు దారితీయాలి.. ఆ సమున్నత సమాజంలో అన్నీ వికసిత పుష్పాలే!

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


మార్చి 8 : హక్కుల దినం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. వారం ముందు నుండే వివిధ వాణిజ్య ప్రకటనలు ఆఫర్స్‌ ప్రకటిస్తుంటాయి.. మీ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు మెసేజ్‌లూ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి. ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా? నిరసనలు తెలిపే రోజా? అంటే.. దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీనికి బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్‌ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని, అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909లో 'జాతీయ మహిళా దినోత్సవా'న్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారాజెట్కిన్‌ అనే ఒక మహిళా నేతది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్‌ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవా'న్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలూ జరిగాయి. ఈ ఏడాది జరిగేది 109వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అయితే, 1975లోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్‌) తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది 'సవాళ్లను స్వీకరిద్దాం.. మార్పును తీసుకొద్దాం' అన్నది నినాదం. సామాజికంగానూ, రాజకీయంగానూ, ఆర్థికంగానూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' మారిపోవడం విచారకరం. వాస్తవంగా కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు.. ధర్నాలు, నిరసనలు నిర్వహించటం.. ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం. దీనికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారా జెట్కిన్‌ భావించలేదు.

స‌వాళ్లు స్వీక‌రిద్దాం.. మార్పు తీసుకొద్దాం..!


విశాఖ తీరంలో..
ఇప్పుడు విశాఖ తీరంలో ఎగిసిపడే కార్మిక కెరాటాల్లో మహిళలూ భాగస్వామ్యులై ఉన్నారు. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అన్న నినాదాన్ని అందిపుచ్చుకుని ఉద్యమంలో ఉవ్వెత్తున మహిళలు పాల్గొంటున్నారు. పాలకపక్షాలు పోలీసు జులుం ప్రదర్శిస్తున్నా ఏమాత్రం వెరవడం లేదు. తాడుతో మెడకు చుట్టి లాగుతున్నా.. రోడ్డుపై ఈడ్చేస్తున్నా.. లాఠీలతో కొడుతున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గక.. తమ హక్కును సాధించుకునేందుకు సమరశీలంగా పోరాడుతున్నారు మహిళలు. ఇది కేవలం విశాఖ ఉక్కుకే పరిమితమైన పోరాటం కాదు.. దేశంలోని ప్రభుత్వరంగాల్ని ప్రయివేటుపరం చెయ్యాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరు. విశాఖ ఉక్కుపై జరిగే ఈ పోరాటం ప్రయివేటీకరణ పోరాటాలకు నాందీ ప్రస్థానం. ఆమె-అతడు కలిసి ఈ పోరాటం చేస్తేనే ఫలితం వచ్చేది. ఈ ఆర్థిక విధానాలపై పోరాటం మన ముందున్న పెద్ద సవాల్‌.. ఈ పోరాటంలో మనమూ భాగస్వాములమవుదాం.. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుందాం.. ప్రభుత్వరంగంతోనే ప్రజాసంక్షేమం అన్న సత్యాన్ని చాటుదాం.

                                                           * శాంతిశ్రీ‌, 8333818985