ఈ సంవత్సరం అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ) ద్వారా పంట మోళ్లను, చెత్తను కుళ్లబెట్టగల 'బయో-ఎంజైమ్' రూపొందించబడింది. సామాన్య రైతులు దీన్ని వాడుకొనే విధంగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రచారం నిర్వహిస్తున్నది. కాని కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కంపెనీలకు రాయితీలిచ్చే పథకాలను ప్రోత్సహిస్తూ, ఢిల్లీ ప్రభుత్వాలను, వాతావరణ కాలుష్య పథకాలను పట్టించుకోవటం లేదు. ఈ బయో ఎంజైమ్ కేవలం హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లో వరి సాగు చేసే రైతులకే కాదు. 'చెత్త నుండి సంపద' తీసి భూసారాన్ని పెంచేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తే అందరికీ ఉపయోగపడుతుంది.
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ అదుపు పేరుతో అక్టోబర్ 31 నుండి నవంబర్ 12 వరకు గ్లాస్గో పట్టణంలో (బ్రిటన్) సి.ఓ.పి-26 (కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్) జరగబోతున్నది. ఇందులో 193 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఎందరో శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు తమ అవగాహనను మరోసారి పంచుకోబోతున్నారు. ఇలాంటి సమావేశాలు ఇప్పటికి పాతిక సార్లు జరిగాయి. గత పదిహేనేళ్లలో జరిగిన సమావేశాల్లో క్యోటో (జపాన్), పారిస్ ( ఫ్రాన్స్) సమావేశాలు ముఖ్యమైనవి. అభివృద్ధి పేరుతో వ్యాపారం చేసి ప్రపంచాన్ని ప్రస్తుత పతనావస్థకు తెచ్చిన... వాతావరణ తీవ్రతకు మూలకారణమైన... ధనిక దేశాలు దాని మూల్యం చెల్లించాలని తీర్మానించడమైనది. అంటే డబ్బు, సాంకేతికాల రూపేణా అమెరికా, ఐరోపా, జపాన్ ఆస్ట్రేలియాలు 'కార్బన్ ట్యాక్స్ ' పేరు మీద బీద దేశాలకు ధన సహాయం చెయ్యాలి. అలానే పెద్ద దేశాలైన చైనా, ఇండియాలు తమ కార్బన్ ఉద్గారాలను తగ్గించుకొనే ప్రయత్నాలు చిత్తశుద్ధితో చెయ్యాలి. వాతావరణ తీవ్రతను పెంచే రసాయనాలను, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలను మార్చుకోవాలి. యుద్ధాలను, దానికి వాడే ఆయుధాలను నిలుపుదల చెయ్యాలి. 2030 నాటికి భూతాపాన్ని అదుపులో (తగ్గించగల) ఉంచే ప్రపంచ 'అన్ని దేశాలకు ధనిక దేశాలు అండగా ఉండాలి'. ఈ తీర్మానాల్ని చిత్తశుద్ధిగా అమలు చేస్తామని 'క్యోటో ఒప్పందం' వరకు అన్ని దేశాలు ప్రపంచాన్ని నమ్మించలేకపోయాయి. కాని పారిస్ ఒప్పందం నాటికి ఒబామా నాయకత్వంలో ఉన్న అమెరికా కూడా దాన్ని అమలు చేస్తామని (ముఖ్యంగా కార్బన్ ఉద్గారాల పన్ను కడతామని) ప్రకటించింది. తన బాధ్యతను నిర్వర్తించడంలో భారత్ అందరి కంటే ముందుంటుందని మన ప్రధాని ప్రకటించారు. కానీ ట్రంప్ వలయంలో చిక్కుకొన్న అమెరికా వెనక్కి పోయింది. అలానే ఒప్పం దం అమలులో మన దేశం చిత్తశుద్ధిని ప్రదర్శించలేక పోయింది. అయినా మళ్లీ సి.ఓ.పి-26 కి స్వయంగా ప్రధాన మంత్రే వెళ్తారట.
ఈ సి.ఓ.పి-26 సందర్భంగా మరోసారి ఢిల్లీవాసుల ప్రమాదాన్ని గుర్తుచేసుకొందాం. దీపావళి పండగ దేశ రాజధాని ఢిల్లీ వాసులకు శాపంగా మారింది. ఆ కాలంలో పెరిగే వాయు, శబ్ద కాలుష్యాలతో పాటు ఇతర అంశాల ప్రభావంతో ఢిల్లీని నల్లటి పొగలు కమ్ముకొని ప్రజలను భయభ్రాంతుల్ని చేసున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు బయట తిరగలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలే కరోనా తాకిడి, దానికి తోడు ఈ స్మాగ్ దాడి, మళ్లీ పాఠశాలలు, ప్రయోగశాలలు మూసే ప్రయత్నాలు మొదలౌతాయి.
ప్రపంచంలోని 1600 నగరాల్లో (91 ముఖ్య దేశాల్లో) జరిపిన అధ్యయనం ప్రకారం భారత దేశ నగరాలు అందునా దేశ రాజధాని ఢిల్లీ, వాయు కాలుష్యపరంగా ముందు వరసలో ఉన్నాయి. సంవత్సరానికి 20 లక్షల మంది సామాన్యులు వాయు కాలుష్య ప్రభావంతో చనిపోతున్నారు. వాహనాల వల్ల 22 శాతం, పరిశ్రమల వల్ల 19 శాతం వాయు కాలుష్యం జరుగుతుంటే, ప్రజల జీవన సరళి, పాలనా రంగ వైఫల్యాలు, ఢిల్లీ పరిసర వ్యవసాయ ప్రాంతాలు, పారిశ్రామిక వాడల విస్తరణ ప్రభావాల వల్ల 59 శాతం వాయు కాలుష్యం జరుగుతున్నది. ఈ స్థితి ఢిల్లీకి కొత్తగా వచ్చింది కాదు. గత దశాబ్ద కాలంలో ఢిల్లీ వాయు కాలుష్యం ప్రభుత్వాన్ని, ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నది. ఎక్కువ మందిని నిష్క్రియాపరుల్ని చేస్తున్నది. సామాన్యుల్ని రోగాల బారిన పడవేస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం, రవాణా సాధనాల నియంత్రణ వంటి సంస్కరణలు కూడా మొదలెట్టింది. పరిశ్రమలను నగర కేంద్ర స్థానం నుండి బయటకు మరల్చే ప్రయత్నాలు చేసింది. అలానే 'హరిత దీపావళి' ప్రచారాలు మొదలెట్టింది. దాని ప్రభావమే నిన్న తమిళనాడు ప్రభత్వం శివకాశి మందుగుండు సామాను తయారీ వృత్తిదారుల తరపున విన్నపాలు చెయ్యటం. అయినా వాయు కాలుష్యం తగ్గే సూచనలు కనపడటం లేదు. ఎందుకిలా జరుగుతున్నది ?
నైసర్గికంగా ఢిల్లీ నగరం, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్యలో ఉన్నది. ఆ ప్రాంతాల వాతావరణ ప్రభావం ఢిల్లీ మీద అధికం. వేసవిలో ఇసుక తుపానులు, వేడి వాయువులు, చలికాలంలో చలి గాలులు తరచుగా ఢిల్లీ పై కూడా దాడి చేస్తాయి. వీటికి తోడు ఆ రాష్ట్రాల్లో వచ్చిన వ్యవసాయ మార్పులు ఢిల్లీని మరింత ప్రతికూలత లోకి నెడుతున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది పంట సాగు ప్రక్రియ. వరి పంట నూర్చిన వెంటనే భూమి మీద మిగిలిపోయిన దుబ్బుల్ని, గడ్డిని తగలబెట్టడం, తద్వారా వచ్చే పొగ ఢిల్లీ నగరాన్ని కమ్మేయటం సాధారణమైపోయింది. ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మారింది.
హరిత విప్లవాన్ని ముందుగా అందుకోగలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, ఉత్తర రాజస్థాన్ గోధుమ సాగులో ప్రపంచ రికార్డును నెలకొల్పగలిగాయి. సారవంతమైన నేలలు, సాగు నీటి వనరులు, నేర్పుగల రైతులు దీని వెనుక ఉన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు 2-3 పంటలు సంవత్సరానికి సాగు చెయ్యగలుగుతున్నారు. గతంలో ఆ రాష్ట్రాల్లో గోధుమ, ఆవాలు, ఆలుగడ్డ, గింజ పైరులు, బఠాని, శనగ, కంది, కూరగాయలు, చెరుకు, పత్తి వంటివి సాగయ్యేవి. అయితే రానురాను మార్కెట్ మార్పుల రీత్యా, వరి-గోధుమల వరస సాగు విధానం విస్తరించింది. నిజానికి ఈ ఒరవడి నష్టకరమని పరిశోధన, విస్తరణ రంగాలు గుర్తించినా... రైతులు మార్కెట్ శక్తుల ప్రభావంలో పడి గిట్టుబాటు ధరల రీత్యా వర్షాకాలంలో (జూన్ - అక్టోబర్) వరి.... అది నూర్చీనూర్చగానే చలి కాలంలో (నవంబర్ - మార్చి ) గోధుమ సాగుకు అలవాటు పడ్డారు. రెండు పంటల మధ్య భూమిని ఖాళీగా ఉంచగల పరిస్థితి లేదు. వీటి సాగులో ప్రవేశించిన యాంత్రిక పద్ధతుల రీత్యా, వరి నూర్చిన తరువాత మిగిలిపోయిన మోళ్లు, పోగుబడిన గడ్డి ప్రతిబంధకంగా మారాయి. ఫలితంగా వాటిని తగలబెట్టి వెంటనే పొలాన్ని దున్ని గోధుమ విత్తేందుకు సిద్ధం చేయాల్సి వస్తున్నది. ఈ చర్య స్థానికంగానూ, ఢిల్లీ వారికి ఎంతో నష్టమని (పొగ వ్యాపించటం వలన) తెలిసీ రైతులు మానుకోలేని స్థితిలోకి నెట్టబడ్డారు. ఆ కార్చిచ్చు పొగలు ఢిల్లీని ఘాటు పొగమంచు లాగ కమ్ముకొంటున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వం గత అనుభవాల నేపథ్యంలో, పోయిన సంవత్సరం 3 నెలల ముందు నుండి పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు విన్నపాలు, హెచ్చరికలు చేసింది. వాతావరణ కాలుష్యాన్ని పెంచే వ్యవసాయ ప్రక్రియలను అదుపులో ఉంచమని కోరింది. ప్రొ|| ఎం.ఎస్. స్వామినాథన్, డా|| దేవేంద్ర శర్మ, డా|| జి.వి. రామాంజనేయులు వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు, సునీతా నారాయణ్ వంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని సూచించారు. ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా రైతుల్ని భూసార రక్షణ, నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ దిశ లోకి నడపాలని చెప్పారు. అలాగే పంట అవశేషాల్ని కాల్చి వేయకుండా భూమి లోకి తొక్కి కుళ్లబెట్టే పద్ధతుల్ని ప్రోత్సహించాలని వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో వరిగడ్డిని కూడా పశుగ్రాసంగా మార్చి కంపోస్టు ఎరువుల రూపకల్పనకు తోడ్పడాలి. కృత్రిమ విధానాల నేపథ్యంతో కంపోస్టుల ద్వారా భూసారాన్ని పునరుద్ధరించగల సూక్ష్మక్రిముల మూల ఉత్ప్రేరకాల్ని రైతులకు అందుబాటులోకి తేవాలి. గత సంవత్సరం దేశ ఉన్నత న్యాయస్థానం కలుగచేసుకొని, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలను మందలించింది. పంట సాగుదార్లకు ఆర్థిక సహాయం (కనీసం ఎకరానికి రూ.3000) అందించి, వరి గడ్డి దుబ్బులను మంటల పరంగా అంతం చేసే ఒరవడి మార్చాలని వివరంగా చెప్పింది.
ఈ సంవత్సరం అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ) ద్వారా పంట మోళ్లను, చెత్తను కుళ్లబెట్టగల ''బయో-ఎంజైమ్'' రూపొందించబడింది. దాన్ని ''పూసా'' పేరుతో క్షేత్ర స్థాయికి తెచ్చారు. సామాన్య రైతులు దీన్ని వాడుకొనే విధంగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రచారం నిర్వహిస్తున్నది. కాని కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కంపెనీలకు రాయితీలిచ్చే పథకాలను ప్రోత్సహిస్తూ, ఢిల్లీ ప్రభుత్వాలను, వాతావరణ కాలుష్య పథకాలను పట్టించుకోవటం లేదు.
ఈ బయో ఎంజైమ్ కేవలం హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లో వరి సాగు చేసే రైతులకే కాదు. 'చెత్త నుండి సంపద' తీసి భూసారాన్ని పెంచేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ''ప్రకృతి వ్యవసాయం'' ముసుగుతో దాతృత్వ పెట్టుబడిదారుల్ని సంతృప్తిపరిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ''పరిశోధనా ఒరవడి'' మార్పించే సంస్కరణల్ని అందుకోవాలి. భూసారాన్ని నీటి వనరులను కాపాడే సాగు పద్ధతుల్ని ప్రోత్సహించాలి. కేవలం 'శూన్య పెట్టుబడి వ్యవసాయ' ప్రచారం నడవదు. సైన్స్ సాంకేతికాల ద్వారా జరుగుతున్న నష్టాలను, సైనర్సీ-సాంకేతికాలిచ్చే వనరులే పూడ్చగలవు. అదే ''బయో-ఎంజైమ్'' వంటివి మనకు నేర్పుతున్నది. ప్రపంచానికి శుష్క తీర్మానాలు చేయడానికి కాకుండా నిబద్ధతతో కూడిన ఆచరణ యోగ్యమైన సాంకేతికాల విస్తరణకు సి.ఓ.పి-26 పూనుకోవాలి. నేరస్తులను శిక్షించగల చట్టాలను అమలుపరచే వీలు కల్పించాలి.
/ వ్యాసకర్త - విశ్రాంతి వ్యవసాయ శాస్త్రవేత్త /
ప్రొ|| ఎన్. వేణుగోపాలరావు











