ప్రజాశక్తి - కాళ్ల
రైతుల సంక్షేమమే ధ్యేయంగా మంతెన వెంకట సూర్యనారాయణరాజు నిరంతరం కృషి చేశారని, ఆయన సేవలు మరువలేనివని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్. నాగిరెడ్డి అన్నారు. ఏలూరుపాడు గ్రామంలో మంతెన సూర్యనారాయణ రాజు ప్రథమ వర్థంతి సభ ఆదివారం నిర్వహించారు. తొలుత సూర్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఆనాటి ఉద్యమాలు.. నేటి ఉద్యమాలకు అంతరమనేది చాలా ఎక్కువ కనిపిస్తోందన్నారు. రైతు సమస్యలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం సూర్యనారాయణ రాజు ఎంతో పోరాడారని తెలిపారు. ఒఎన్‌జిసి ఆయిల్ పంపించడం వల్ల భూమి కుంగి పోతుందని, పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో సూర్యనారాయణ రాజు కృషి ఎనలేనిదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని ఎంతో పరితపించారని తెలిపారు. కృష్ణా గోదావరి డెల్టాల పరిరక్షణ, కొల్లేరు పర్యావరణ పరిరక్షణ చేయాలని నిరంతరం పోరాడిన మహనీయుడు అని గుర్తు చేశారు. రైతు సమైక్య అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ కృష్ణా గోదావరి డెల్టా పరిరక్షణ కోసం పాటుపడ్డారన్నారు. నేటి తరానికి ఆదర్శవంతమైన నాయకులని గుర్తు చేశారు. రాష్ట రైతు సేవా సంస్థ జనరల్ సెక్రటరీ అక్కినేని భవానీప్రసాద్ మాట్లాడుతూ సూర్యనారాయణ రాజు దేశ స్వాతంత్య్రం కోసం, రైతుల కోసం నిస్వార్థంగా సేవలందించారన్నారు. రాష్ట్ర రైతు నాయకులు చెరుకూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రైతు కార్యాచరణ సమితి నాయకులు సూర్యనారాయణరాజు ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా కలిదిండి మండలం నరసింహపురం గ్రామానికి 3 వేల లీటర్ల కొత్త తాగునీటి ట్యాంకర్‌ను రాష్ట్ర వ్యవసాయ మండలి వైస్ ఛైౖర్మన్ నాగిరెడ్డి, కైకలూరు ఎంఎల్‌ఎ డి.నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతుల కోసం పాటుపడిన పలువురు రైతు కార్యాచరణ సమితి నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు నాయకులు త్రినాధ్ రెడ్డి, ఎంఎల్‌ఎలు మంతెన రామరాజు, దూలం నాగేశ్వరరావు, ఉండి మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజు, డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు, అటవీశాఖ రాష్ట్ర డైరెక్టర్ మంతెన యోగేంద్ర బాబు, టిటిడి మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకులు జుత్తిగ నాగరాజు, రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీరామరాజు, గౌరవాధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజు, అధికార ప్రతినిధి కలగ కమలాకర శర్మ, సమితి కోశాధికారి మంతెన వెంకట రవివర్మ, కార్యదర్శులు టి.నాగేశ్వరరావు, సమితి కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, వైస్ ఛైౖర్మన్ నాగబాబు, జాయింట్ సెక్రటరీలు దాట్ల లక్ష్మీపతి రాజు, మేళం దుర్గాప్రసాద్, కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి టెక్నికల్ అధికార ప్రతినిధి జి.కృష్ణారావు, డాక్టర్ గోపాలరాజు, రమణరాజు, సూర్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.










