Jun 22,2023 22:51

ప్రజాశక్తి - పెద్దాపురం యాసలపు సూర్యారావు ఆశయ సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిపిఎం మాజీ ఎంపీ, పార్టీ జాతీయ నాయకుడు పి.మధు అన్నారు. యాసలపు సూర్యారావు 11 వర్థంతి సందర్భంగా గురువారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన '9 ఏళ్ల బిజెపి పాలన - తీరు పెన్నులు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సైకిల్‌ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సూర్యారావు చిన్ననాటి నుంచి కమ్యూనిస్టుగా, కార్మిక నేతగా, పాత్రికేయునిగా, కౌన్సిల్‌ ప్రజా ప్రతినిధిగా, కవిగా, రచయితగా, కార్మిక సంఘాల నిర్మాతగా నిబద్ధతతో కొనసాగించిన జీవితం అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. 9 ఏళ్ల బిజెపి పాలన మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, రకరకాల పేర్లతో పన్నులు పెంచడం, ప్రజలపై భారాలు మోపడం అలవాటుగా మారిపోయిందన్నారు. దేశ ప్రజల ఐక్యత మధ్య చిచ్చుపెట్టే బిజెపి పాలన అంతం చేసేందుకు రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జి, కరణం ప్రసాదరావు, సిపిఎం మండల నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, కేదారి నాగు, సిపిఎం కాకినాడ నగర నాయకులు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు దారపురెడ్డి సత్యనారాయణ, రొంగల వీర్రాజు, సిరపరపు బంగార్రాజు, దారపురెడ్డి కృష్ణ, మహాపాతిన రాంబాబు, అమత, నమ్రత, పూజిత, సావిత్రి, లక్ష్మి, నిఖిల గీతాలు ఆలపించారు. తొలుత సూర్యారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోరాటాలతోనే భూములు సాధించుకోగలం
యు.కొత్తపల్లి
పోరాటాలు చేయడం ద్వారానే భూములను సాధించుకోవచ్చని సిపిఎం జాతీయ నాయకులు పి.మధు అన్నారు. కొత్త ఇసుకపల్లిలో కొత్తచెరువు, పాత చెరువు భూములను కొంతమంది నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండడంతో సుమారు 52 ఎకరాల కొత్తచెరువు, పాత చెరువు భూములను గురువారం సిపిఎం నాయకులతో కలిసి మధు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 72 ఏళ్ల నుంచి పేద రైతులు పండించుకుంటూ పన్నులు సైతం చెల్లిస్తూ ఉంటే కొందరు భూములను కబ్జా చేసేందుకు చూస్తున్నారన్నారు. పేదల భూములను కబ్జా చేస్తే ఉరుకోబోమని హెచ్చరించారు. పోరాటాలు చేసేటప్పుడు పోలీసు కేసులు పెట్టినా భయపడవద్దని రైతులకు ధైర్యం చెప్పారు. ఫినిషింగ్‌ వేసిన స్తంభాలను వెంటనే తొలగించాలని రైతులకు సూచించారు. అవసరమైతే నేను మళ్లీ వస్తానని బాధిత రైతులకు హామీ ఇచ్చారు. గతంలో కబ్జా చేసేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నిస్తుంటే సిపిఎం నాయకులు అండగా ఉండి పోరాటం సాగించామని మహిళా రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనింగ్‌ సభ్యులు కరణం ప్రసాద్‌ రావు, దువ్వా శేషబాబ్జి, రైతు సంఘం నాయకులు గుర్రాల అప్పారెడ్డి, సిపిఎం మండల అధ్యక్షులు కాళ్ల నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు అంగర వాసు, సిఐటియు మండల కార్యదర్శి, చీకట్ల సాంబశివ కుమార్‌, చింతపల్లి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.