Apr 13,2023 22:27

ప్రజాశక్తి - ముదినేపల్లి
         సూర్య ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. గతవారం రోజులుగా ఎండలు మండుతుండటంతో జనం అల్లాడుతున్నారు. భానుడి భగభగలతో గ్రామీణ ప్రాంత ప్రజానీకం హడలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వివిధ పనులపై బయటకు వస్తే తిరిగి ఇంటికెళ్లేసరికి ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతతో రోగులు, చిన్నారులు, వృద్దులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడు భగభగమంటూ ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్నాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లకే పరిమితమౌతున్నారు.
కనిపించని చలివేంద్రాలు
ప్రతియేటా ఏప్రిల్‌లో ప్రజల దాహర్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌, పంచాయతీ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు పంచాయతీలు ఏర్పాటు చేసేవి. దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వేసవిలో ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. మండలంలోని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలోగాని, దాతల సహకారంతోగాని ఎక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో అత్యవసర పనులపై బయటకు వచ్చే బాటసారులు, ప్రజలు, వాహనదారులు దాహర్తితో అలమటిస్తున్నారు. దీంతో చేసేదిలేక ప్రజలు దాహర్తిని తీర్చుకునేందుకు శీతాలపానీయాలను ఆశ్రయిస్తున్నారు.
విద్యుత్‌ కోతలతో ఇక్కట్లు
వేసవి తాపానికి తోడు వేళపాళాలేని విద్యుత్‌ కోతలతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపానికి తోడు అనధికార విద్యుత్‌ కోతలు విధించడంతో జనం నానావస్థలు పడుతున్నారు.
తగ్గిన ప్రయాణాలు
వేసవి తాపానికి ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ముఖ్యమైన పనులైతే తప్ప ప్రయాణాలు చేయడం లేదు. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఉదయం తొమ్మిది గంటల్లోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాతే చేస్తున్నారు. అత్యవరమైతే టోపీలు, కళ్లజోళ్లు ధరించి రాకపోకలు సాగిస్తున్నారు.