సిపిఎం
ప్రజాశక్తి - టి.నరసాపురం
సూరంపూడి గట్టు సాగుదారులకు పంట నష్టపరిహారంతోపాటు భూమికి భూమి ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సూరంపూడి లో బాదితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని బొర్రంపాలెం రెవెన్యూ పరిధిలోని సూరంపూడి గట్టులో సుమారు వంద ఎకరాలకుపైగా గిరిజనులు, దళితులు భూమిలేని పేదలు పోడు కొట్టి గట్టుపై జీడి మామిడి, నిమ్మ, కొబ్బరి తదితర పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. 2003, 2008 సమయంలో అధికారులు పేదలకు పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని, ఆ భూముల్లో మోటార్ బోర్లు కూడా ఉన్నాయని అన్నారు. అయితే గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరుతో రైతులకు ఎటువంటి సమాచారమూ లేకుండా భూమి హక్కుదారులకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అడవిని పంటను పాడుచేసి గట్టును, రాళ్ల మట్టిని గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రోడ్డు నిమిత్తం జెసిబిలతో, లారీలతో మట్టి రాళ్లు తొలగిస్తున్నారని వాపోయారు. దీనిపై రైతులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పరిష్కరించలేదన్నారు. ఒకపక్క మండలంలో పలుచోట్ల ప్రభుత్వ భూమిలో గట్టు మీద పోడు చేసుకుని పంటలు వేసుకుంటే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వారికి సాగుపత్రాలు మంజూరు చేయాలంటే 45 సంవత్సరాల నుంచి అనేకసార్లు ప్రజాప్రతినిధులను అధికారుల చుట్టూ తిరిగినా పట్టాలు లభించలేదన్నారు. పట్టాలున్నచోట భూమిలో సాగులో ఉన్నచోట సూరంపూడి గట్టుతోపాటు అబ్దుల్లాపురం గట్టు, వేపుగుంట గట్టును కూడా గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరుతో ధ్వంసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సూరంపూడి గట్టులో భూమి హక్కుదారులకి భూమికి భూమి, పంటలకు పరిహారం, బోర్లకు బోర్లు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కమిటీ సభ్యులు అనుమోలు మురళి, మడకం సుధారాణి, పూసం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.










