ప్రజాశక్తి - నెల్లిమర్ల : వైసిపి ప్రభుత్వం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ డాక్టర్ పి.వి.వి.సూర్య నారాయణ రాజు అన్నారు. ఆదివారం ఆయన స్వగ్రామం మొయిద విజయరాంపురంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా నెల రోజులు పాటు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పేదల ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాన్ని ఇచ్చాయన్నారు. ముఖ్యంగా పేద వారికి ఎంతో ఖరీదైన వైద్యంతో పాటు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పొందేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 41,161 మంది టెస్టులు చేయించుకోగా అందులో 5,734 మందికి కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించామన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్కడి ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టిడిపి హయాంలో కేవలం దోచుకోవడమే తప్ప వారి పరిపాలనలో పేదల సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసిన దాఖలాలే లేవని ఆరోపించారు. కానీ ఇప్పుడు సంక్షేమాన్ని ఇంటికి అందిస్తున్నామన్నారు. టిడిపి, జనసేన ఎంత బురద జల్లినా రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్‌రెడ్డికే ప్రజలు పట్టం కడతారని జోష్యం పలికారు.