ప్రజాశక్తి-బాపట్ల జిల్లా
'జగనన్న సురక్ష' కార్యక్రమాలలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. గృహ నిర్మాణాలు, గడప గడపకూ మన ప్రభుత్వం, నాడు-నేడు పనులు, జగనన్న సురక్ష, భూముల రీ సర్వే పనులపై కలెక్టరేట్ నుంచి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. జగనన్న సురక్ష కార్యక్రమాలలో భాగంగా బాపట్ల జిల్లాలో నాలుగు లక్షల సర్టిఫికెట్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని కలెక్టర్ ప్రకటించారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందించడంలోనూ జిల్లా యంత్రాంగం సమర్ధంగా పనిచేసిందని, మంచి ఫలితాలు లభించాయని అన్నారు. సర్టిఫికెట్ల జారీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా వాలంటీర్లకు ప్రత్యేకంగా ప్రశంసలు అందాయని కలెక్టర్ చెప్పారు. అన్ని మండలాలలోని వాలంటీర్లను అధికారులు ప్రశంసించాలన్నారు.
జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. పక్కా గృహాల నిర్మాణాలలో రేపల్లె డివిజన్ పరిధిలోని మండలాలన్నీ పురోగతి తక్కువగా ఉన్నాయని చెప్పారు. గడిచిన రెండు వారాలలో సరిగా పని చేయకపోవడంతో వేమూరు, బాపట్ల గృహ నిర్మాణ శాఖ డిఇలకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు.
అలాగే చుండూరు ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. చుండూరు మండలంలోని గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహశీల్దారు, ఎంపీడీవోలు కలెక్టర్ అనుమతి లేకుండా సెలవులు పెట్టరాదని స్పష్టం చేశారు. బుధ, గురువారాలలో ఇంజనీరింగ్ అధికారులు, మండల స్థాయి అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని తెలిపారు. అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. గడప గడపకూ మన ప్రభుత్వం పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. జిల్లాలో 320 గ్రామ సచివాలయాల పరిధిలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. 177 సచివాలయాల పరిధిలో పనులు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. భూముల రీ సర్వే పూర్తి చేయాలన్నారు. సర్వే చేసిన భూములలో హద్దురాళ్ళు వేయడం కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను జిల్లాకు విడుదల చేసిందని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీశివజ్యోతి, ఆర్డీవోలు జి రవీందర్, పి సరోజిని, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండలాల నుంచి తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










