ప్రజాశక్తి-కాకినాడ రానున్న దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా ప్రమాదాలకు తావులేని పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలతో బాణసంచా విక్రయాలను అనుమతించాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాల్లో కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్ వివిధ శాఖల అధికారులతో రానున్న నవంబరు 12న జరుపుకోనున్న దీపావళి పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వినాయక చవితి, దసరా పండుగలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించామని, ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చేపట్టిన చర్యలను ఆమె అభినందించారు. అదే స్పూర్తితో వచ్చే నెల 12న జరుపుకోనున్న దీపావళి పండుగ సందర్భంగా ఆన్ని ముందస్తు జాగ్రత్తలతో కూడిన పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని ఆమె కోరారు. ఇందులో భాగంగా అనుమతి లేకుండా ఎవరూ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలు నిర్వహించకుండా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు నిశితమైన నిఘా, ఉమ్మడి తనిఖీలు నిర్వహించాలన్నారు. అనుమతులు పొందిన కేంద్రాలు అన్ని ప్రామాణిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. దీపావళి పండుగ ముందు మూడు రోజులు పాటు మాత్రమే బాణాసంచా విక్రయాలను, నిర్ధిష్ట వేళల్లో అనుమతించాలని, ఇందుకు సురక్షితమైన, బహిరంగ ప్రదేశాలను ఈ నెల 30వ తేదీ లోపున గుర్తించి, తాత్కాలిక అనుమతులు జారీ చేయాలని సూచించారు. విక్రయ కేంద్రాల మధ్య దూరం, కేంద్రాల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్‌లు సులువుగా సంచరించేందుకు వీలుగా 6 మీటర్ల వెడల్పు మార్గం తప్పని సరిగా ఉండాలని సూచించారు. అన్ని విక్రయ కేంద్రాల వద్ద అగ్నిమాపక పరికరాలు, నీటి డ్రమ్ములు విధిగా ఉండేలా చూడాలన్నారు. పెంకు చిచ్చుబుడ్లు వంటి నిషేధిత బాణాసంచా ఐటమ్‌లను, శబ్ద, వాయు కాలుష్యం కలిగించే వస్తువులను విక్రయించకుండా పర్యవేక్షించాలన్నారు. బాణసంచా ధరలపై వాణిజ్యపన్నులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ఎంఆర్‌పి ధరలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. విక్రేతలు పన్నులు ఎగవేయకుండా వాణిజ్య పన్నుల శాఖ వద్ద నమోదు పొందిన షాపులను మాత్రమే అనుమతించాలన్నారు. ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ బాణాసంచా అక్రమ తయారీ, నిల్వ కేంద్రాలను నిరోధించేందుకు పటిష్టమైన సమాచార వ్యవస్థ అవసరమన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు వలంటీర్ వ్యవస్థ సహకారాన్ని ఉపయోగించుకోవచ్చనని సూచించారు. డిఆర్‌ఒ కె.శ్రీధరరెడ్డి, కాకినాడ ఆర్‌డిఒ ఈట్ల కిషోర్, కాకినాడ, పెద్దాపురం డిఎస్‌పిలు మురళీకృష్ణా రెడ్డి, కె.లతాకుమారి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్.సురేంద్ర ఆనంద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ బి.సందీప్, డిఎం అండ్ హెచ్‌ఒ కార్యాలయ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పావని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఇ సత్యకుమారి, ఎంహెచ్‌ఒ డాక్టర్ పృథ్వీచరణ్, అధికారులు పాల్గొన్నారు.










